దళితులపై ఆగని దాడులు
స్వతహాగా బాబు దళిత ద్రోహి అనటానికి పిన్నెల్లి ఘటనే ఉదాహరణ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్
చంద్రబాబు ప్రభుత్వంలో
యర్రగొండపాలెం: చంద్రబాబు ప్రభుత్వం దళితులపై దాడులు చేయిస్తోందని, స్వతహాగా దళిత ద్రోహిగా ముద్రపడిన చంద్రబాబు ఈ రోజు తన ఆలోచన, పనితీరు ఏంటో పిన్నెల్లి ఘటన ద్వారా మరోసారి దళిత వ్యతిరేకి కార్యక్రమాలు చేయడం శోచనీయమని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పిన్నెల్లి గ్రామం, గురజాల నియోజకవర్గానికి చెందిన 400 కుటుంబాలు బయట ఉన్నాయని, మందా సాల్మన్ తన కుటుంబ సభ్యులతో ఇతర ప్రాంతంలో నివశిస్తున్నారని, పండుగకు వచ్చిన భార్య, కుమార్తె అనారోగ్యానికి గురికావడంతో వారిని చూడటానికి సాల్మన్ వెళ్తే మాటువేసిన టీడీపీ నాయకులు దాడి చేశారని అన్నారు. వైద్యశాలలో చావు బతుకుల మధ్య ఆయన కొట్టుమిట్టాడుతుంటే దాడి చేసిన వ్యక్తే పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడని, ఆ కేసును ఎస్సై రిజిస్ట్రేషన్ చేసి వైద్యశాలలో మృతి చెందిన సాల్మన్‌పై ఎఫ్‌ఐఆర్ చేశారని, దాడి చేసిన వారిపై మాత్రం ఎటువంటి ఎఫ్‌ఐఆర్ కాలేదని ఆయన అన్నారు. ఆ నాడు చంద్రబాబు ప్రభుత్వంలో కారంచేడు నుంచి నేటి పిన్నెల్లి వరకు దళితులపై మారణకాండ కొనసాగుతూనే ఉందని, ఏకంగా డిప్యూటీ సీఎం ఇలాకాలో దళితులను గ్రామాల్లోకి రాకుండా వెలివేస్తున్నారని, సనాతన ధర్మంపేరుతో పవన్ కల్యాణ్ వేషాలు వేసుకుంటూ దళిత వ్యతిరేకిని తానని చాలా స్పష్టంగా సంకేతాలు ఇస్తూ దళితులను గ్రామాల నుంచే తరిమేస్తున్నాడని విమర్శించారు. మరొక డిప్యూటీ స్పీకర్ ఇలాకాలో అంబేడ్కర్ విగ్రహాన్ని అవమానపరచిన ఘటన మరువకముందే అనేక ఉదంతాలు చోటు చేసుకున్నాయని, కుప్పంలో ఏకంగా దళిత మహిళను చెట్టుకు కట్టేసి కొట్టడం, అమరావతిలో దళిత బిడ్డను మానభంగం చేసి హత్యచేయడం, హోం మంత్రి నియోజకవర్గంలోని పాయకరావుపేటలో దళిత బాలికను అత్యాచారంచేసి హతమార్చడం ఇలా రాష్ట్రంలో జరుగుతున్న అనేక పాశవిక చర్యలకు బలవుతోంది దళితులేనని అన్నారు.
రాష్ట్రంలో పొలిటికల్ గవర్నెస్‌ను నడిపిస్తున్న చంద్రబాబు
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పొలిటికల్ గవర్నెస్‌ను నడిపిస్తున్నారని, ఆయన ప్రభుత్వంలో నడుస్తుంది రాజ్యాంగబద్ధ ప్రభుత్వం కాదని, పొలిటికల్ గవర్నమెంట్ అని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రజల కోసం కాకుండా రాజకీయంగా నడిపిస్తున్నాడని విమర్శించారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రక్కనపెట్టి అమాయకత్వంతో కూడిన పరిపక్వత, జ్ఞానం, సమాజంపై అవగాహనలేని చంద్రబాబు కుమారుడు లోకేష్ ఎర్రబుక్కు అనే వెర్రి రాజ్యాంగాన్ని రాష్ట్రంలో నడిపిస్తున్నారని మండిపడ్డారు.
సంక్రాంతి సంస్కృతిని మంటకలుపుతున్నారు
రాష్ట్రంలో ప్రాముఖ్యత ఉన్న సంక్రాంతి సంస్కృతిని చంద్రబాబు ప్రభుత్వం మంట కలుపుతోందని, ఒక పక్క హైకోర్టు కోడిపందేలు వేయవద్దంటుంటే హోం మంత్రి, డిప్యూటీ స్పీకర్ కోడిని పట్టుకొని ప్రజలకు ఏం సంకేతాలు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. విచ్చలవిడిగా కోడిపందేలను టీడీపీ వాళ్లే ప్రోత్సహిస్తున్నారని, కోళ్లకు కత్తులు కట్టి బరిలోకి వదిలి వాటిని ఒకదెబ్బకు కూలిపోయే పందేలను ప్రోత్సహించడం దుర్మార్గపు చర్యఅని మండిపడ్డారు.


