మట్టి మాఫియా
రెచ్చిపోతున్న
మార్కాపురం రూరల్ (మార్కాపురం):
మార్కాపురం పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో పెద్దారవీడు మండలంలోని కొత్తపల్లి కొండల నుంచి అక్రమంగా మట్టి రవాణా చేస్తూ మట్టి మాఫియా రెచ్చిపోతోంది. రాత్రిపూట జేసీబీలతో మట్టి తవ్వకాలు జరుపుతూ టిప్పర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నారు. గత మూడు రోజులుగా సుమారు 10 టిప్పర్లు, రెండు జేసీబీల సాయంతో కొత్తపల్లి కొండతో పాటు తోకపల్లి, సుంకేశుల ఎస్సీలకు కేటాయించిన వెలుగొండ కాలనీ నుంచి కూడా మట్టి తరలిస్తున్నారు. టిప్పర్లతో మట్టిని మార్కాపురం తరలిస్తున్నట్లు సమాచారం. పునరావాస కాలనీలో, కొత్తపల్లి కొండపై యంత్రాలతో మట్టి తవ్వుతున్నారు. ట్రాక్టరు మట్టిని వెయ్యి రూపాయలకు, టిప్పర్ మట్టిని 4 వేల నుంచి 5 వేల రూపాయల మధ్య విక్రయిస్తున్నారు. ఎవరైనా తమకు అడ్డొస్తే ఊరుకోమంటూ బహిరంగంగా బెదిరింపులకు దిగుతున్నారు. కుంట, దరిమడుగు మధ్య ఉన్న నేషనల్ హైవేపై మట్టి టిప్పర్లు తిరుగుతున్నప్పటికీ రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్ అధికారులకు మాత్రం తెలియక పోవడం శోచనీయం.
రియల్ ఎస్టేట్ వెంచర్లకు తోలకం...
మార్కాపురం కొత్త జిల్లాగా ఏర్పడటంతో రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎకరా భూమిని చదును చేయాలంటే దాదాపు 50 ట్రాక్టర్ల మట్టి అవసరమవుతోంది. ఒకవేళ భూమి లోతు ఎక్కువగా ఉంటే మరో 40 ట్రాక్టర్ల మట్టి అదనంగా కావాల్సి ఉంటుంది. మార్కాపురం పట్టణ శివార్లలో, తర్లుపాడు రోడ్డులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు వేస్తున్నారు. కలెక్టరేట్ కార్యాలయం, జాయింట్ కలెక్టర్ కార్యాలయం, ఇతర ఉన్నతాధికారుల కార్యాలయాలు అక్కడే ఏర్పాటు కానుండటంతో పలువురు రియల్ వ్యాపారులు భూములు కొని వెంచర్లు వేస్తున్నారు. ఈ వెంచర్లను చదును చేసేందుకు చెరువు మట్టి అవసరం. దీంతో వందల సంఖ్యలో ట్రాక్టర్ల మట్టి అవసరమవుతోంది. ప్రభుత్వ భూములు, పోరంబోకు భూములు, అసైన్‌మెంటు భూముల్లో మట్టి వ్యాపారులు జేసీబీల సాయంతో మట్టి తవ్వి టిప్పర్లతో తోలుతున్నారు. అయినప్పటికీ సంబంధిత అఽధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. గోగులదిన్నె గ్రామ శివార్లలో కూడా పలువురు వ్యాపారులు మట్టి తవ్వారు.
మట్టి మాఫియా
మట్టి మాఫియా


