రాష్ట్రంలో కొనసాగుతున్న రెడ్‌బుక్ రాజ్యాంగం
టంగుటూరు: ఏపీలో రెడ్‌బుక్ పాలన కొనసాగుతూనే ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. మండలంలోని పొందూరులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల బహుమతి ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఏం మాట్లాడినా రికార్డింగ్ చేసేందుకు కూటమి నాయకులు రెడీగా ఉంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం నడవడం లేదని, కేవలం రెడ్‌బుక్ రాజ్యాంగ మాత్రమే అమలులో ఉందని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో సంక్రాంతి వచ్చినా, ఉగాది వచ్చినా పండగ వాతావరణం తలపించేదని, సంక్రాంతికి ముందు ప్రతి తల్లికి అమ్మఒడి పథకం ద్వారా నగదు అందినట్లు గుర్తు చేశారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అందించిన పథకాలతో పాటు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పథకాలు అందిస్తామని మాయమాటలు చెప్పి ఒక్క పథకం కూడా అమలు చేయని దౌర్భాగ్య ప్రభుత్వమని విమర్శించారు. క్యాలెండర్ ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేసిన దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు. కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చినా 40 శాతం మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైఎస్సార్ సీపీకి అండగా నిలిచారని చెప్పారు. కార్యకర్తలకు గత ప్రభుత్వంలో కొంతమేర న్యాయం చేయలేకపోయామని, జగన్ 2.0 పరిపాలనలో ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. కూటమి నాయకులు హత్యా రాజకీయాలు చేస్తున్నారని, దళిత సోదరుడు సాల్మన్ హత్య కూటమి ప్రభుత్వ హత్య అన్నారు. పొందూరు ఎంతో ప్రత్యేకమని, ఈ గ్రామానికి రెండోసారి సంక్రాంతి సంబరాలకు హాజరయ్యానని సంతోషం వ్యక్తం చేశారు. ప్రతిపక్షం మనకేమీ కొత్త కాదని, ఆటుపోట్లు సహజమేనని, ప్రతి ఒక్కరూ ఓపిక పట్టాలన్నారు. మీ వెనక మండల పార్టీ అధ్యక్షుడు చింతపల్లి హరిబాబు ఉన్నాడని, హరిబాబు వెనక నియోజకవర్గ ఇన్‌చార్జిగా తాను ఉన్నానని, తన వెనుక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారని చెప్పారు. అనంతరం మూడు రోజులుగా నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఆదిమూలపు సురేష్ బహుమతులు అందించారు. కార్యక్రమంలో సీఈసీ మెంబర్ డాక్టర్ మాదాసి వెంకయ్య, వేజెండ్ల సుబ్బారాయుడు, పరిటాల చక్రపాణి, జిల్లా యువజన విభాగం జనరల్ సెక్రటరీ మేదరమిట్ల భరత్ రెడ్డి, పరిటాల మధు, రాయపాటి రామకృష్ణ, రాయిండ్ల వెంకట నారాయణ, భీమవరపు అంకయ్య పాల్గొన్నారు.
మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్


