నిధులు లేక విలవిల్లాడుతున్న పంచాయతీలు
ఒంగోలు సిటీ: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలలో కనీస వసతుల కల్పనకు నిధులు లేక విలవిల్లాడుతున్నాయని సర్పంచ్‌ల సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు జి.వీరభద్రాచారి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం స్థానిక సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మరో రెండు మాసాల్లో ఆర్థిక సంవత్సరం పూర్తవుతుందని, అయినప్పటికీ నేటి వరకు ఇంటిపన్నుల వసూళ్లలో ఎలాంటి పురోగతి లేదని అన్నారు. పారిశుధ్య నిర్వహణతో పాటు కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో పంచాయతీలు ఉన్నాయన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీల ఖాతాలకు జమకావడం లేదన్నారు. తక్షణమే ఇంటి పన్నుల పద్దులపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారులను సర్పంచుల సంఘం కోరుతుందన్నారు. కొన్ని గ్రామ పంచాయతీలలో పన్ను కొంతమేర వసూలైనప్పటికీ జమ చేయకుండా దుర్వినియోగం అవుతున్న తీరుపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. సర్పంచుల పదవీకాలం కూడా మరో రెండు నెలల్లో ముగిసిపోతున్న నేపథ్యంలో.. చేసిన పనులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని కోరారు. అలాగే గౌరవ వేతనం తాలూకు బకాయిలు వెంటనే చెల్లించాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖామంత్రి పవన్ కల్యాణ్‌ని కోరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘ నాయకులు పాండు రంగారావు, ప్రజ్యోత్ కుమార్ పాల్గొన్నారు.
సర్పంచ్‌ల సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు
వీరభద్రాచారి


