పోలీసులపై యువనేత చిందులు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: మార్కాపురం నియోజకవర్గంలో టీడీపీ యువనేత వ్యవహారం ఆ పార్టీ నాయకులకు తలనొప్పిగా మారింది. కనుమ పండగ రోజు రాత్రి పెట్రోలింగ్ జిల్లాలోని ఒక సీఐకి అప్పగించారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆ సీఐ పట్టణంలోని కోర్టు సెంటర్‌లో వాహనాలు తనిఖీ చేస్తుండగా మద్యం మత్తులో ఒక వ్యక్తి వేగంగా వచ్చి సీఐ ముందు కారు ఆపాడు. వెంటనే ఆయన బయటకు పిలిచి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేయగా మద్యం సేవించినట్లు నిర్ధారణ కావడంతో వెంటనే స్టేషన్‌కు తరలించారు. ఆ వ్యక్తి గతంలో ఒక రెవెన్యూ కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేసి మానేసినట్లుగా గుర్తించారు. సదరు వ్యక్తి నియోజకవర్గ ముఖ్యనేత కుమారుడికి ఫోన్ చేయడంతో యువనేత అర్ధరాత్రి సమయంలో కోర్టు సెంటర్‌కు వచ్చి విధుల్లో ఉన్న సిబ్బందిపై చిందులు తొక్కి బూతులు తిట్టినట్టు తెలిసింది. వెంటనే సిబ్బంది సదరు నేత వ్యవహారశైలిపై ఉన్నతాధికారులకు తెలపడంతో ఈ విషయం ఎస్పీ దృష్టికి వెళ్లింది. దీంతో పోలీసులు ఆ వ్యక్తికి తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. ఈ విషయం శనివారం బయటకు రావడంతో పాటు పలువురు కూటమి పార్టీ నేతలు యువనేత వ్యవహార శైలిపై పార్టీ రాష్ట్ర కార్యాలయానికి, అమరావతిలోని ముఖ్య నేతలకు ఫోన్‌లో సమాచారం చెప్పినట్లు తెలిసింది. యువనేత వ్యవహారం టీడీపీకి చెడ్డపేరు తెస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మార్కాపురం రూరల్ (మార్కాపురం): విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతిచెందిన సంఘటన శనివారం మార్కాపురం పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోని ఏకలవ్యకాలనీలో జరిగింది. కాలనీలో నివాసముండే దమ్ము చెన్నకేశవులు (39) కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. శనివారం యథావిధిగా పనికి వెళ్లేందుకు సిద్ధమై బకెట్‌లో నీళ్లు కాచుకునేందుకు వాటర్ హీటర్ పెట్టుకున్నాడు. ప్రమాదవశాత్తూ బకెట్ తగలడంతో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. చెన్నకేశవులుకు భార్య హేమలత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పట్టణ ఎస్సై సైదుబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అద్దంకి: స్పీడ్ బ్రేకర్ వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన అద్దంకి మండలంలోని అద్దంకి–నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారిపై గోపాలపురం వద్ద శనివారం జరిగింది. ఆ వివరాల మేరకు.. నరసరావుపేటలో ఉంటున్న దుర్గాప్రసాద్ కుటుంబం సంక్రాంతి పండుగకు పొదిలి వచ్చింది. పండుగ అనంతరం శనివారం కారులో నరసరావుపేట వెళ్తుండగా, అద్దంకి మండలంలోని గోపాలపురం వద్ద స్పీడ్ బ్రేకర్‌ను గమనించకపోవడంతో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి పల్టీకొట్టింది. ఈ ఘటనలో కారులోని దుర్గాప్రసాద్, అతని భార్య మల్లీశ్వరి, తల్లి పార్వతి, కుమారుడు నటరాజ్, కుమార్తె శివాని గాయపడ్డారు. స్థానికులిచ్చిన సమాచారం మేరకు 108 వాహనం చేరుకుని క్షతగాత్రులను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించింది.
పోలీసులపై యువనేత చిందులు


