పిల్లి జయరావు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
కొత్తపట్నం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలను అవగాహన చేసుకుని బడుగు బలహీన వర్గాల ప్రజలకు జ్ఞానమే సంపదగా భావించి గ్రామంలోని ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ చదువుకోవాలని తన జీవితకాలం ప్రజలను చైతన్యపరిచిన పిల్లి జయరావు కాంస్య విగ్రహం ఏర్పాటుకు గ్రామస్తులందరూ కలిసి రావడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ పేర్కొన్నారు. మండలంలోని సురారెడ్డిపాలెం–ఈతముక్కల రహదారి మధ్యలో ఉన్న సంకువారిగుంట వద్ద ఏర్పాటు చేసిన పిల్లి జయరావు కాంస్య విగ్రహాన్ని శనివారం డాక్టర్ కసుకుర్తి జగదీష్‌బాబు ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జూపూడి ప్రభాకర్ మాట్లాడుతూ జయరావు మాస్టారు మొదటి నుంచి వామపక్ష భావజాలంతో ప్రజల పక్షపాతిగా వ్యవహరించారని గుర్తు చేశారు. జయరావు మాస్టారు, డీటీ మోజెస్ నిర్విరామంగా చేసిన కృషి కారణంగా గ్రామంలో దాదాపు అందరూ విద్యావంతులై ఉద్యోగులుగా స్థిరపడ్డారని పేర్కొన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఆర్.వెంకట్రావు మాట్లాడుతూ జయరావు మాస్టార్ కుటుంబ బాధ్యతను, వృత్తి ధర్మాన్ని, వామపక్ష రాజకీయాలను, ప్రజల సమస్యలను కలగలిపి తన జీవితాన్ని సమాజ శ్రేయస్సు కోసం పాటుపడ్డారని కొనియాడారు. జయరావు భార్య విజయమ్మ, కుమారుడు రవికుమార్, కుమార్తె తానికొండ జన్నమ్మ, పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారి ఏకా మురళి, డీఎంఆర్ శేఖర్, సీనియర్ సాఫ్ట్‌వేర్ యరమాల మల్లికార్జునరావు, ఎల్‌ఐసీ రిటైర్డ్ ఆఫీసర్ పిల్లి కనకరాజు, లాజర్, చిడితోటి కోటేశ్వరరావు, చక్కా రత్నాకర్ పాల్గొన్నారు.


