కోట్లు తెగిపడ్డాయి!
న్యూస్‌రీల్
జిల్లాలో విచ్చలవిడిగా కోడి పందేలు అధికార టీడీపీ కనుసన్నల్లో బరులు బరుల వద్ద రెట్టింపు ధరలకు మద్యం అమ్మకాలు దర్శి, కొండపి, ఒంగోలు, కందుకూరు, కనిగిరి, ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గాల్లో భారీ మొత్తంలో పందేలు దర్శి, కందుకూరుల్లో భారీగా పేకాట శిబిరాలు రూ.30 కోట్లు చేతులు మారినట్టు ఆరోపణలు కన్నెత్తి చూడని పోలీసులు
అధికార బరులు..
శనివారం శ్రీ 17 శ్రీ జనవరి శ్రీ 2026
కోళ్లు కత్తులు దూశాయి. రూ.కోట్లు చేతులు మారాయి. సంక్రాంతి సంబరాల ముసుగులో కోడి పందేలతో జూదగాళ్లు రెచ్చిపోయారు. కోడి పందేలు నిర్వహించొద్దన్న హైకోర్టు ఆదేశాలు కాగితాలకే పరిమితం కాగా, పందెం బరుల వద్ద టీడీపీ తమ్ముళ్ల హుంకారమే శాసనమైంది. చట్టంతోపాటు కనిపించని నాలుగో సింహం అధికార పక్షం ముందు తలవంచింది. గతంలో తరతరాలుగా గోదావరి జిల్లాలకే పరిమితమైన కోడి పందేలు.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక సంక్రాంతి సంబరాల ముసుగులో జిల్లాలో ఊరూరా అంతకు మించిన స్థాయిలో పందెం బరులు వెలిశాయి. ఉమ్మడి జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో బహిరంగంగానే కోడి పందేల బరులు, పేకాట టేబుళ్లు, మద్యం విక్రయాలు వంటి వసతులతో భారీ ఏర్పాట్లే చేశారు.
సింగరాయకొండ: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పల్నాడు జిల్లా గురజాల మండలం పిన్నెల్లి గ్రామానికి చెందిన సాల్మన్ పై జరిగిన దాడి, హత్యను.. దళితవర్గాల పై జరిగిన దాడిగా వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అభివర్ణించారు. శుక్రవారం రాత్రి పార్టీ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు, బలహీన, దళిత వర్గాల వారిని టార్గెట్ చేస్తున్నారని.. శాంతిభధ్రతలు క్షీణించాయనడానికి సాల్మన్ హత్యే ఉదాహరణ అని అన్నారు. సాల్మన్ హత్యకు కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజలు భోగిమంటల్లో రెడ్‌బుక్ రాజ్యాంగంలో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసిన ప్రైవేటు మెడికల్ కాలేజీల జీఓ, టెండర్ కాగితాలను వేసి దహనం చేసి తమ నిరసనను తెలియజేశారని గుర్తు చేశారు. సాల్మన్ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని, న్యాయస్థానాలు జోక్యం చేసుకుని హింసాత్మక ఘటనలకు అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేశారు.
సింగరాయకొండ: స్థానిక ఏఆర్‌సీ అండ్ జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజిలో శుక్రవారం నిర్వహించిన జాతీయ కబడ్డీ సమాఖ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జాతీయ అధ్యక్షునిగా ఢిల్లీకి చెందిన ఆనంద్ సాహూ, ఉపాధ్యక్షులుగా తమిళనాడుకు చెందిన మాధవన్, తెలంగాణకు చెందిన కేఎస్‌ఎన్ రాజు, సెక్రటరీగా తెలంగాణకు చెందిన కే రామిరెడ్డి, జాయింట్ సెక్రటరీగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వంశీకృష్ణ, ఖజాంచీగా తెలంగాణకు చెందిన టీ రవికుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజేష్, ఒడిశాకు చెందిన పూర్ణచంద్ర మోహంతి ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గం మాట్లాడుతూ మోడ్రన్ కబడ్డీ క్రీడాభివృద్ధికి కృషి చేస్తామని, యువతకు మెరుగైన అవకాశాలు కల్పించేలా జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహిస్తామని వివరించారు.
జాతీయస్థాయి మోడ్రన్ కబడ్డీ పోటీలు ప్రారంభం:
ఈ సందర్భంగా జాతీయ స్థాయి మోడ్రన్ కబడ్డీ సీనియర్ మహిళలు, పురుషుల పోటీల ప్రారంభం సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడాజ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు. ఈ పోటీల్లో తెలంగాణ, పాండిచ్చేరి, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కు చెందిన జట్లు పాల్గొన్నాయి.
యర్రగొండపాలెం: మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం మండలంలోని తమ్మడపల్లి గ్రామంలో తరతరాల నుంచి వస్తున్న వింత ఆచారం కొనసాగుతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా గురువారం గ్రామంలో అంకాళమ్మ చెన్నకేశవ స్వామి వార్లకు గ్రామస్తులు నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా పోలేరమ్మ గుడి వద్ద నుంచి పొంగళ్లు ఊరేగింపుగా తీసుకెళ్తున్న సందర్భంగా భక్తులు ఒళ్లు గగుర్పాటు కలిగించేలా కత్తులతో సాములు చేస్తూ గుండెలకు బాదుకుంటూ తమ భక్తిని చాటుకున్నారు. భక్తులు పోలేరమ్మ అమ్మవారికి దాదాపు 80 వెండి గొడుగులను సమర్పించుకొని తమ మొక్కులను తీర్చుకున్నారు. ఐదేళ్లకు ఒక సారి పొట్టేళ్ల గావ్ కొలుపులు జరుపుతామని, ఈ ఆచారం చూసి తమ కోర్కెలు తీర్చుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారని ఆ గ్రామస్తులు తెలిపారు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: సంక్రాంతి సందర్భంగా జరిగే కోడి పందేలు జూద క్రీడలను తలపించాయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండదండలతో పందెం రాయుళ్లు రెచ్చిపోయారు. మద్యం ఏరులై పారింది. అడ్డుకోవాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడంతో నిర్వాహకులు రెచ్చిపోయారు. భోగి రోజు ప్రారంభమైన కోడి పందేలు కనుమ పండగ నాడు కూడా కొనసాగాయి. ముక్కనుమ రోజు కూడా వీటిని కొనసాగించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లూ చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోట్ల రూపాయలు చేతులు మారాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కొత్తపట్నం, ఒంగోలు రూరల్, చీమకుర్తి, టంగుటూరు, పొన్నలూరు, సింగరాయకొండ, దర్శి, కందుకూరు తదితర ప్రాంతాల్లో కోడి పందేల బరులు గోదావరి జిల్లాలను తలపించాయి. ఈ దఫా గుండాట కూడా నిర్వహించడం గమనార్హం. ఒంగోలు నియోజకవర్గం పరిధిలోని కొత్తపట్నం, ఒంగోలు రూరల్ మండలాల్లో భారీ ఎత్తున పందేలు నిర్వహించారు. కొత్తపట్నం మండలంలోని గవళ్లపాలెం, మడనూరుల్లో భారీ ఎత్తున పందేలు జరిగాయి. గవళ్లపాలెంలో పోటీలు భీమవరాన్ని తలపించాయి. పెద్ద ఎత్తున పోటీలు జరిగాయి. రోజుకు సుమారు రూ.30 లక్షలు మేర పందేలు జరిగినట్టు తెలిసింది. అలాగే దాదాపు రూ.పది లక్షల వరకూ మద్యం అమ్మకాలు జరిగాయి. పేకాట కూడా నిర్వహించారు. మొత్తంగా మూడు రోజుల పాటు ఇక్కడ సుమారు రూ.1.20 కోట్ల మేర నగదు చేతులు మారినట్టు సమాచారం. మద్యాన్ని మాత్రం రెట్టింపు ధరలకు విక్రయించారు. ఇక్కడ అత్యధికంగా రూ.లక్షన్నర పందెం జరిగినట్టు తెలిసింది. అలాగే మడనూరులో సైతం చిన్న బరులు నిర్వహించారు. ఇక్కడ మూడు రోజులకు సుమారు రూ.15 లక్షల మేర పందేలు, రూ.15 లక్షల మేర మద్యం అమ్మకాలు జరిగినట్టు తెలిసింది. యర్లజర్లలో భారీ ఎత్తున బరులు నిర్వహించినట్టు తెలిసింది. ఇక్కడ మూడు రోజుల్లో కోటి రూపాయలకు పైగా బెట్టింగ్‌లు జరిగినట్టు సమాచారం. ఈ పందేలు అన్నీ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కనుసన్నల్లో జరగడంతో పోలీసులు చూసీచూడనట్టు వదిలేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
● కొండపి నియోజకవర్గంలో పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన కోడి పందేల బరుల్లో సుమారు రూ.10 కోట్లకు పైగా డబ్బులు చేతులు మారాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధానంగా టంగుటూరు మండలం కొణిజేడు, పొన్నలూరు మండలం వెంకుపాలెం, మాలపాడు, చెన్నిపాడు వద్ద ఏర్పాటు చేసిన బరులు గోదావరి జిల్లాల బరులను తలపించాయి. టిక్కెట్ ధర కూడా రూ.500 ఏర్పాటు చేశారు. టంగుటూరు మండలం కొణిజేడులో సైతం బరులు కోస్తాను తలపించాయి. ఇక్కడ రోజుకు రూ.50 లక్షలు మేర పందేలు నిర్వహించినట్టు తెలిసింది. మూడు రోజులు సుమారు రూ.1.5 కోట్లు బెట్టింగ్ పెట్టినట్టు సమాచారం. ఇక్కడ గుండాట కూడా లక్షల్లో పందేలు పెట్టినట్టు తెలిసింది. సింగరాయకొండ మండలం పాకల, పాతసింగరాయకొండ పంచాయతీల్లో, కొండపి మండలం చిన్నకళ్లగుంట, కట్టావారిపాలెం, అనకర్లపూడి మండలాల్లో భారీగా కోడిపందేలు జరగగా మర్రిపూడి మండల కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున జరిగాయి.
రేయింబవళ్లు పందేలు..
చీమకుర్తి మండలం గాడిపర్తివారిపాలెంలో అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో కోడిపందేలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మూడు రోజుల పాటు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ ఫ్లడ్‌లైట్ వెలుగుల్లో పందేలు జరిగాయి. దాదాపు కోటి రూపాయలకు పైగా పందేల నగదు చేతులు మారినట్టు తెలిసింది. చూసేందుకు వచ్చిన వారి నుంచి సైతం రూ.500 టికెట్ వసూలు చేశారు. అలాగే మంచికలపాడు పంచాయతీ పరిధిలో యర్రగుడిపాడు వెళ్లే చినరాస్తా రోడ్డుకి ఇరువైపులా మండల టీడీపీ నాయకులు జెండాలు, ఫ్లెక్సీలు కట్టి మూడు బరులను ఏర్పాటు చేశారు. అదే విధంగా గాడిపర్తివారిపాలెం పంచాయతీ పరిధిలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో బరి ఏర్పాటు చేసి యథేచ్ఛగా కోడి పందేలు నిర్వహించారు. ఆ బరుల్లో కోడి పందేలు జరుగుతున్నాయని పక్కా సమాచారం ఉన్నప్పటికీ పోలీసులు ఆవైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో కోడి పందేల నిర్వాహకులు యథేచ్ఛగా నిర్వహించారు. పెద్ద బరిలో కోడి పందేలు ఒక్కో పందెం లక్ష రూపాయల వరకు, చిన్న బరిలో రూ.50 వేల వరకు నడిచింది. కోట్ల రూపాయలు చేతులు మారాయి.
● కనిగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కోడి పందేలు అధికార పార్టీ నేతల అండదండలతో జోరుగా సాగాయి. కనిగిరి, పీసీపల్లి, హెచ్‌ఎంపాడు, పీసీపల్లి, పామూరు, వెలిగండ్ల అన్ని మండలాల్లో కోడి పందేలను టీడీపీ నేతలు దర్జాగా వేదికలపై కూర్చొని మరీ వేయించారు. సంబరాల మాటున జరిగిన కోడి పందేల్లో ఒక్క కనిగిరి నియోజకవర్గంలోనే రూ.3 కోట్లకు పైన పందేలు సమాచారం.
● మార్కాపురం నియోజకవర్గం పొదిలి నగర పంచాయతీలోని పిచ్చిరెడ్డితోటలో సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజుల నుంచి కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. అధికార పార్టీకి చెందిన వారు కోడి పందేల బరిని ఏర్పాటు చేశారు. పొదిలి, కొనకనమిట్ల మండలాలకు చెందిన వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన కోడి పందేల్లో లక్షల రూపాయలు చేతులు మారినట్లు తెలుస్తోంది. చుట్టుపక్కల మండలాల నుంచి పందెపు రాయుళ్లు తరలిరావడంతో పిచ్చిరెడ్డితోట కోడి పందేల బరి జనంతో నిండిపోయింది. కోడి పందేలతో పాటు మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. అధికారులు ఆవైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక అధికార పార్టీ హస్తం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
● కందుకూరు మండలం పలుకూరు గ్రామంలో మూడు రోజులుగా భారీగా కోడి పందేలు, పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు. శిబిరం వద్ద రూ.కోట్లలోనే పందాలు జరుగుతున్నాయి. దాదాపు పది కోట్ల వరకు చేతులు మారినట్లు అంచనా వేస్తున్నారు. గ్రామ టీడీపీ నాయకులు ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.
యర్రగొండపాలెం: ప్రజల ఆనందోత్సాహాల మధ్య ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ముగిశాయి. రైతులను ప్రోత్సహించేందుకు, ఒంగోలు జాతి గిత్తల మనుగడను కాపాడటానికి సంక్రాంతి పండుగ సందర్భంగా ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలు భారీ ఎత్తున ఈ నెల 11వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో సీనియర్, న్యూ కేటగిరీ ఎద్దులతోపాటు 6 పండ్లు, 2 పండ్ల విభాగాలకు చెందిన గిత్తలు దాదాపు 70 జతలు పాల్గొన్నాయి. ఆంధ్రప్రదేశ్‌తోపాటు కర్నాటక, తమిళనాడు, తెలంగాణ ఎడ్లు పాల్గొని అలరించాయి. పోటీలు ప్రారంభమైన తొలి రోజు నుంచి ప్రజలు తండోప తండాలుగా కదలివచ్చి ఎడ్ల బలప్రదర్శన తిలకించారు. పోటీలు చూడటానికి వచ్చిన వారు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఎమ్మెల్యే అన్ని సౌకర్యాలతోపాటు భోజన ఏర్పాట్లు చేశారు. ఈ పోటీలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. పోటీల చివరి రోజు మాజీ మంత్రి ఆర్.కె.రోజా పాల్గొన్నారు. తొలిరోజు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పోటీలు ప్రారంభించారు. నెల్లూరు జిల్లా పార్టీ పరిశీలకుడు, మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి, కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి దద్దాల నారాయణ యాదవ్, రాష్ట్ర ముస్లిం మైనార్టీ నాయకుడు మీర్జ షంషీర్ అలీబేగ్‌లు పాల్గొన్నారు. రెండవ రోజు కార్యక్రమంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.శ్యామల, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కొండపి నియోజకవర్గ పరిశీలకుడు వై.వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి కేవీ.రమణారెడ్డి, జమ్మలమడుగు నియోజకవర్గ నాయకుడు హనుమంతారెడ్డి, 3వ రోజు కార్యక్రమంలో తాటిపర్తి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి, రాయచోటి మాజీ ఎమ్మెల్సీ గడికొట శ్రీకాంత్‌రెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగారెడ్డి సతీష్‌రెడ్డి, పంచాయతీరాజ్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, ఐటీవింగ్ రాష్ట్ర అధ్యక్షుడు చిట్యాల విజయభాస్కర్‌రెడ్డి, 4వ రోజు మాజీ మంత్రి సాకె శైలజనాథ్, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ఐటీ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు పి.సునీల్‌రెడ్డి, అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి చింతలపూడి అశోక్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి వెన్నా హనుమారెడ్డి, శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ మాజీ డైరెక్టర్ చెప్పల్లి కనకదుర్గ పాల్గొన్నారు.
కోట్లు తెగిపడ్డాయి!
కోట్లు తెగిపడ్డాయి!
కోట్లు తెగిపడ్డాయి!
కోట్లు తెగిపడ్డాయి!
కోట్లు తెగిపడ్డాయి!
కోట్లు తెగిపడ్డాయి!
కోట్లు తెగిపడ్డాయి!
కోట్లు తెగిపడ్డాయి!
కోట్లు తెగిపడ్డాయి!


