దర్శిలో ‘బరి’తెగించిన టీడీపీ నేతలు:
దర్శి నియోజకవర్గంలో కొత్త సంస్కృతికి తెరలేపి కోడి పందేలు, పేకాట బరులు నిర్వహిస్తూ పోలీసుల సహకారంతో టీడీపీ నేతలు బరి తెగించారు. టీడీపీ ఇన్‌చార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఫొటోలతో ఫ్లెక్సీలు వేసి మరీ తాళ్లూరు మండలం వెంకట్రామయ్య స్వామి ఆలయం సమీపంలో కోడి పందేల బరిని నిర్వహించారు. పేకాట శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ మూడు రోజుల పాటు జరిగిన బరిలో సుమారు రూ.5 కోట్ల మేర పందేలు జరిగినట్టు సమాచారం. ఇక్కడ పోలీసులు హైడ్రామా నిర్వహించారు. తొలుత బరులను తొలగించినట్టు హడావుడి చేశారు. తర్వాత యథేచ్ఛగా బరులు నిర్వహిస్తున్నా అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో ఎస్సై మల్లిఖార్జున వైఖరిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పందెం రాయుళ్ల వాహనాలతో ఆ ప్రాంతం అంతా కిక్కిరిసి పోయింది. ఈ పందేల్లో లక్షలాది రూపాయలు పోగొట్టుకున్న వాళ్లు ఎందరో ఉసూరుమంటూ వెళ్లిపోయారు. పేకాట శిబిరాలకు అడ్డేలేకుండా పోయింది. తాళ్లూరు మండలంలోని గుంటి గంగమ్మ ఆలయం నుంచి కొండలోపలి వైపు అడవి మధ్యలో పేకాట శిబిరాలు ఏర్పాటు చేశారు. బొద్దుకూరపాడు శివారు ప్రాంతాలు, నాగంబొట్లపాలెం, తూర్పు గంగవరం, తాళ్లూరు, తోటవెంగన్నపాలెం నుంచి దారంవారిపాలెం వెళ్లే పంట పొలాల్లో, దోసకాయలపాడు నుంచి లక్కవరం వైపు వెళ్లే ఈనెల వద్ద, గంగవరం నుంచి చీమకుర్తి వెళ్లే రోడ్డులో మూడు మండలాలు కలిసే ప్రాంతంలో పేకాట శిబిరాలు నిర్వహించినట్టు తెలిసింది. మూడు రోజుల్లో సుమారు రూ.20 కోట్లు చేతులు మారినట్టు సమాచారం. అధికార పార్టీ నేతలు భారీ ఎత్తున కమీషన్లు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. బరివద్ద అనధికారక మద్యం ఏరులై పారింది. జూదరులు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటిని కూడా మరిచిపోయి అక్కడే గడిపారు. ఈ మూడు రోజులు సాయంత్రానికి ఇంటికి వెళ్లడం తెల్లవారు జామునే అక్కడకు చేరుకోవడం, ఫుల్లుగా మద్యం కొట్టి కోళ్లు కొట్టుకుంటుంటే వీళ్లు మద్యం మత్తులో కేకలు వేసి పైశాచిక ఆనందం పొందారు.


