సర్కారు సొమ్ము.. సొంత బాజా!
దర్శి(ముండ్లమూరు): ప్రభుత్వ ధనంతో సొంత డబ్బా కొట్టుకోవడం తెలుగు తమ్ముళ్లకే చెల్లింది. ప్రతిదానికీ పచ్చరంగు పులిమి ఇది మా ఘనతేనంటూ ప్రచారం చేసుకోవడం పరిపాటైంది. ముండ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామంలో మండల పరిషత్ గ్రాంట్ రూ.5 లక్షలతో బస్‌షెల్టర్ ఏర్పాటు చేశారు. గ్రామంలో ఉన్న గ్రామకంఠం భూమి, ఆపక్కనే ఉన్న తన సొంత స్థలం కలిపి గతంలో దేవాలయం నిర్మించాలని వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ చింతా శ్రీనివాసరెడ్డి తలచారు. అయితే చింతా శ్రీనివాసరెడ్డి 23 ఏళ్లుగా వ్యాపారం చేసుకుంటున్న దుకాణాలు తొలగించే కుట్రలో భాగంగా గత ఏడాది ఆగస్టు 22వ తేదీన దుకాణాలను తొలగించారు. దేవుని ఆలయం కోసం ఉంచిన భూమిలో ఆలయం కడితే చింతా శ్రీనివాసరెడ్డికి మంచి పేరు వస్తుందన్న కుట్రతో స్థానిక టీడీపీ నాయకులు ఆలయం కట్టేందుకు వీలు కాకుండా గ్రామ కంఠం స్థలంలో బస్‌షెల్టర్ ఏర్పాటు చేశారు. మండల పరిషత్ నిధులతో నిర్మించిన ఆ బస్‌షెల్టర్‌పై టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ గొట్టిపాటి లక్ష్మి సహకారంతో అని రాయడంపై స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. సొమ్ము ప్రభుత్వానిది.. పేరు టీడీపీ ఇన్‌చార్జ్‌దా హవ్వా ..ఇదేమి చోద్యం అని గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నియోజకవర్గ ప్రజలు తిరస్కరించి ఓడించిన వ్యక్తి అధికార పార్టీని అడ్డు పెట్టుకుని ఇలా చేయడంపై మండిపడుతున్నారు. ప్రభుత్వానికి చెందిన బస్ షెల్టర్‌పై ప్రైవేటు వ్యక్తుల పేర్లు ఎలా పెడతారని ఎంపీడీఓను వివరణ కోరగా తాను కొత్తగా వచ్చానని, పేర్లు రాసిన విషయం తనకు తెలియదని గ్రామ కార్యదర్శిని సంప్రదించాలని చెప్పారు. గ్రామ కార్యదర్శిని ఫోన్‌లో సంప్రదించి వివరణ కోరగా ‘‘గొట్టిపాటి లక్ష్మి వచ్చి నాకు డబ్బులు ఇచ్చి బస్‌షెల్టర్ కట్టించి పేర్లు రాయమనలేదు. రాసిన వాళ్లను అడుక్కోండి...లేదంటే మండల కార్యాలయంలో వెళ్లి అడుక్కోండి...నాకేం సంబంధం లేదు. నేను సెక్రటరీని అయితే పేర్లు రాయడంలో నా బాధ్యత ఉంటుందా...’’ అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.


