దళిత ద్రోహి.. చంద్రబాబు
ఒంగోలు సిటీ : చంద్రబాబు ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు మాదిగ ఆరోపించారు. శుక్రవారం ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి చెందిన మందా సాల్మన్ హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు. సాల్మన్ వైఎస్సార్ సీపీలో కీలకంగా పనిచేస్తూ అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడన్నారు. ఈ హత్యకు సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వారి నిర్లక్ష్యం వల్లే సాల్మన్ హత్య జరిగిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగమే ఈ హత్య అని ఆయన ఆరోపించారు. 18 నెలలుగా టీడీపీ నేతల వేధింపులు తట్టుకోలేక మాచవరం గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మెనార్టీలకు చెందిన 300 కుటుంబాలు గ్రామం వదిలి బయట ప్రాంతాల్లో తలదాచుకుంటున్నాయని అన్నారు. సాల్మన్ సైతం గ్రామం విడిచి వెళ్లిపోయాడని, భార్య అనారోగ్యంతో ఉంటే గ్రామానికి వచ్చిన అతనిపై టీడీపీ నాయకులు విచక్షణారహితంగా దాడిచేసి హత్య చేశారని ఆరోపించారు. ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికులు సీఐ, ఎస్సైలకు ఫిర్యాదు చేశారన్నారు. అయితే, దాడిచేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేయకుండా సాల్మన్‌పై 324 కేసు పెట్టడం అన్యాయమన్నారు. గురజాల నియోజకవర్గంలో పోలీసులు అధికార పార్టీ నేతలకు కొమ్ముకాస్తున్నారనడానికి ఇది నిదర్శనమన్నారు. సాల్మన్ ఆరోగ్య పరిస్థితి విషమించిన తర్వాత పోలీసులు 307 కేసుగా మార్చడం వారి నిర్లక్ష్యానికి పరాకాష్ట అని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని, అలాగే దళితులకు రక్షణ కరువైందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక టీడీపీ నేతల ఆగడాలకు ముగ్గురు దళితుల ప్రాణాలు పోయాయన్నారు. కర్నూలు జిల్లా ఆధోని నియోజకవర్గంలో గోవిందమ్మను ట్రాక్టర్లతో తొక్కించి హత్య చేశారన్నారు. అద్దంకి నియోజకవర్గం బల్లికురవలో దళిత రైతు చింతల శ్రీను భూమిని కాజేసేందుకు టీడీపీ నాయకులు యత్నించారన్నారు. తనకు రక్షణ కల్పించాలని ఉన్నతాధికారులకు అతను మొరపెట్టుకున్నా ఫలితం కనిపించకపోవడంతో మంత్రి గొట్టిపాటి రవి దృష్టికి సైతం తీసుకెళ్లాడన్నారు. అక్కడ కూడా న్యాయం లభించకపోవడంతో గత్యంతరం లేక ఆత్మహత్య చేసుకున్నాడని కనకారావు వాపోయారు. ప్రస్తుతం మందా సాల్మన్‌ను టీడీపీ నాయకులు అతి కిరాతకంగా దాడి చేసి హత్య చేశారన్నారు. దళితులపై దాడులు జరుగుతుంటే చంద్రబాబు స్పందించకపోవడం దారుణమన్నారు.
డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో
మాలపల్లి సాంఘిక బహిష్కరణ...
డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం మల్లావు అనే గ్రామంలో మాలపల్లిని సాంఘిక బహిష్కరణ చేసిన దుస్థితిని చూశామని కనకారావు గుర్తుచేశారు. రాజంపేట నియోజకవర్గంలో మాదిగపల్లిని బహిష్కరించడం కూడా చూశామన్నారు. కందూకూరు నియోజకవర్గంలోని దప్పలంపాడు గ్రామంలో ఎస్సీలను బహిష్కరించిన పరిస్థితినీ మనం చూశామన్నారు. నెల్లూరు, చిత్తూరు వంటి ప్రాంతాలలో ఎన్నో సంవత్సరాలుగా దళితులు సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూములు వారివి కాదంటూ పచ్చని మామిడిచెట్లను నరికిన సంఘటనలు కూడా చూశామన్నారు. ఈ రెడ్‌బుక్ రాజ్యాంగంలో దళితులకు చోటు లేదనేది స్పష్టంగా అర్థమవుతోందన్నారు. దళిత వ్యతిరేకిగా చంద్రబాబు పనిచేస్తున్నారని ఈ ఉదాహరణలన్నీ తేటతెల్లం చేస్తున్నాయన్నారు. మందా సాల్మన్‌పై దాడి చేసిన సంఘటనలో గురజాల ఎమ్మెల్యే చేతిలో పచ్చచొక్కా తొడుక్కున్న సీఐ ఆయుధంగా మారి రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. పల్నాడు జిల్లాలో జోలకల్లు, మాచవరం వంటి గ్రామాలను వైఎస్సార్ సీపీ కుటుంబాలు వదిలిపెట్టి వెళ్లాయని తెలిపారు. మందా సాల్మన్ శవాన్ని ఆ గ్రామంలోకి తీసుకెళ్లకుండా అనేక ఆంక్షలకు గురిచేయడం దారుణమన్నారు. మాచవరం నుంచి పిన్నెల్లి వెళ్లడాన్ని పోలీసులు అడ్డుకుని వందలాది మంది పోలీసులు మొహరించడం చూస్తుంటే.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం కాకుండా రెడ్‌బుక్ రాజ్యాంగం ఒక్కటే అమలవుతోందని స్పష్టమవుతోందన్నారు. దళిత ద్రోహి చంద్రబాబు అనేదానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకొకటి లేదని కనకారావు అన్నారు. విలేకరుల సమావేశంలో ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి దుడ్డు వినోద్, ఎస్సీ సెల్ టౌన్ ప్రెసిడెంట్ పసుపర్తి గోపిచంద్ పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు
మందా సాల్మన్ హత్యకు
సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత బాధ్యత వహించాలని డిమాండ్


