పండుగ పూట విషాదం | - | Sakshi
Sakshi News home page

పండుగ పూట విషాదం

Jan 17 2026 7:38 AM | Updated on Jan 17 2026 7:38 AM

పండుగ పూట విషాదం

పండుగ పూట విషాదం

మేదరమెట్ల:

ంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోవాల్సిన సమయంలో మూడు కుటుంబాల్లో విషాదం అలముకుంది. మూడు వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందడం ఆయా కుటుంబాల్లో విషాదం నింపింది. మృతుల్లో ఒక మహిళ, ఇద్దరు పురుషులు ఉండగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మూడు ప్రమాదాలూ అద్దంకి నియోజకవర్గంలోనే జరిగాయి. ఆ వివరాల్లోకెళ్తే.. శుక్రవారం విజయవాడ వైపు నుంచి నెల్లూరు వెళ్తున్న కారు కొరిశపాడు మండలంలోని తిమ్మనపాలెం గ్రామం వద్దకు రాగానే డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగా సిమెంటు దిమ్మెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. కారులో ప్రయాణిస్తున్న నెల్లూరుకు చెందిన టీడీపీ నాయకుడు ఎండీ జాఫర్‌షరీఫ్‌ (54), మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మేదరమెట్ల పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఒంగోలు కిమ్స్‌ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జాఫర్‌షరీఫ్‌ మృతి చెందగా, మిగిలిన ఇద్దరూ చికిత్స పొందుతున్నట్లు ఎస్‌ఐ మహ్మద్‌ రఫీ తెలిపారు. ఆ మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు చెప్పారు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని

మహిళ దుర్మరణం...

మరో ప్రమాదంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతిచెందింది. ఈ సంఘటన గురువారం కొరిశపాడులో వెలుగుచూసింది. కొరిశపాడు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సుమారు 40 సంవత్సరాల వయసున్న మహిళ మృతదేహం కొరిశపాడులోని పొలంలో గురువారం రైతులకు కనిపించింది. రైతు ద్వారా అందుకున్న సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మహిళ ఏదో వాహనం గుద్దడంతో మృతిచెంది ఉంటుందని, వారు పొలంలో పడేసి వెళ్లిపోయి ఉంటారని, ఇది జరిగి ఐదు రోజులై ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆమె యాచకురాలు అని తెలుసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు కొరిశపాడు ఎస్‌ఐ సురేష్‌ తెలిపారు.

మూడు వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

మరో ఇద్దరికి తీవ్రగాయాలు

మూడు ప్రమాదాలూ అద్దంకి

నియోజకవర్గంలోనే..

మృతుల్లో ఒక మహిళ, ఇద్దరు పురుషులు

బస్సు చక్రాల కింద పడి వృద్ధుడు మృతి...

అద్దంకి: ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడి వృద్ధుడు మృతిచెందిన సంఘటన అద్దంకి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. పట్టణంలోని దక్షిణ అద్దంకికి చెందిన చెన్నకేశవులు (67) నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ సమయంలో ఒంగోలు–వినుకొండ సర్వీసు బస్సు ఆ వృద్ధుడిని ఢీకొట్టింది. టైర్ల కింద పడిన వృద్ధుడు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement