చంద్రమౌళీశ్వర ఆలయంలో చోరీ
సీఎస్ పురం (పామూరు): మండల కేంద్రమైన సీఎస్ పురంలోని కామాక్షీసమేత చంద్రమౌళీశ్వర ఆలయంలో గురువారం రాత్రి చోరీ జరిగింది. చోరీకి పాల్పడిన నిందితుడిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేసి చోరీకి గురైన రూ.64 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై యం.వెంకటేశ్వరనాయక్ తెలిపిన వివరాల ప్రకారం... సీఎస్ పురం నడిబొడ్డున ఉన్న కామాక్షీసమేత చంద్రమౌళీశ్వర ఆలయం తాళాలను గడ్డపారతో పగులగొట్టి లోపలికి ప్రవేశించిన వ్యక్తి హుండీలోని నగదును బస్తాలో వేసుకుని వెళ్లిపోయాడు. గురువారం రాత్రి ఆలయంలో ఓ మాలధారుడు ఆలయం తలుపులు తీసి ఉండటాన్ని గమనించి ఆలయ పూజారికి తెలియజేశాడు. ఆలయ అర్చకుడు శ్రీకృష్ణశర్మ ఫిర్యాదు చేయగా శుక్రవారం ఉదయం ఎస్సై యం.వెంకటేశ్వరనాయక్, ఒంగోలు క్లూస్‌టీం రవీంద్రనాథ్‌రెడ్డి నేతృత్వంలో ఆధారాలు సేకరించారు. ఆధారాల ప్రకారం చోరీకి పాల్పడిన వ్యక్తి స్థానిక వడ్డెపాలెంకు చెందిన బండారు రాంప్రసాద్‌గా అనుమానించి అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో పోలీసులు విచారించారు. ఆ విచారణలో నిందితుడు రాంప్రసాద్ తానే చోరీకి పాల్పడినట్లు ఒప్పుకుని చోరీ చేసిన నగదును సీఎస్ పురం సమీపంలోని పామూరు రోడ్డులో చెట్లలో పెట్టినట్లు చెప్పడంతో అక్కడికి వెళ్లి రూ.64,836 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
నాగులుప్పలపాడు: సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. యువత పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉప్పుగుండూరు గ్రామంలో కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి క్రీడల్లో భాగంగా గురువారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోలురాధ నాటు బండి లాగుడు పోటీల్లో బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం పెదపూడి గ్రామానికి చెందిన అలహరి కృష్ణయాదవ్ ఎడ్ల జత నిర్ణీత 10 నిమిషాల కాలంలో 3 వేల అడుగుల దూరం లాగి మొదటి స్థానంలో నిలిచింది. వేటపాలెం మండలం పందిళ్లపల్లి గ్రామానికి చెందిన పాలపర్తి మూగయ్య ఎడ్ల జత 2833 అడుగుల దూరం లాగి రెండో బహుమతి సాధించాయి. బాపట్ల జిల్లా చెరుకుపల్లికి చెందిన జజ్జర యలమందల వెంకట గోపాలకృష్ణకు చెందిన ఎడ్ల జత కూడా ద్వితీయ స్థానంలో నిలిచింది. గోగినేని సుబ్బారావు ఎడ్ల 2759 అడుగుల దూరం లాగి మూడో స్థానంలో నిలిచాయి. బాపట్ల జిల్లా బాపట్ల మండలం మద్దిబోయినవారిపాలెం గ్రామానికి చెందిన పిన్నిబోయిన మణీంద్రయాదవ్ ఎడ్ల జత 2701 అడుగుల దూరం లాగి నాలుగో స్థానంలో నిలిచాయి. నెల్లూరు జిల్లా ఉలవపాలెం మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన బొట్ట బాలకృష్ణ యాదవ్ ఎడ్ల జత 2624 అడుగుల దూరం లాగి 5వ స్థానంలో నిలిచాయి. నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన గోగినేని జ్ఞానసాయి దీపక్‌కు చెందిన ఎడ్ల జత 2620 అడుగుల దూరం లాగి ఆరో స్థానంలో నిలిచాయి. వీరికి వరుసగా రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.5 వేల బహుమతులను నిర్వాహకులు అందజేశారు. పోటీలను చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
పోలీసుల అదుపులో నిందితుడు రూ.64 వేల నగదు రికవరీ
చంద్రమౌళీశ్వర ఆలయంలో చోరీ


