డీజే నిర్వాహకులపై ఎస్సై దాష్టీకం | - | Sakshi
Sakshi News home page

డీజే నిర్వాహకులపై ఎస్సై దాష్టీకం

Nov 5 2025 7:47 AM | Updated on Nov 5 2025 7:47 AM

డీజే నిర్వాహకులపై ఎస్సై దాష్టీకం

డీజే నిర్వాహకులపై ఎస్సై దాష్టీకం

డీజే నిర్వాహకులపై ఎస్సై దాష్టీకం ● తీవ్రంగా కొట్టి, ఇదేమిటని ప్రశ్నించిన వారిని కులం పేరుతో దుర్భాషలు ● తాళ్లూరు ఎస్సై తీరుపై దళితుల నిరసన

తాళ్లూరు: ఓ వివాహ కార్యక్రమానికి డీజే ఏర్పాటు చేసిన నిర్వాహకుడిని, డీజే ఆపరేటర్‌ను ఎస్సై స్టేషన్‌కు పిలిపించి విచక్షణారహితంగా కొట్టి, కులంపేరుతో దూషించారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తాళ్లూరు మండలం శివరాంపురంలో జరిగింది. బాధితుల కథనం మేరకు శివరాంపురం ఎస్సీ కాలనీలో శనివారం రాత్రి వివాహ వేడుకలో డీజే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. దీనిలో పెళ్లి కూతురిని పెళ్లి మండపం దగ్గరకు తీసుకెళ్తున్న సమయంలో డాన్స్‌ ప్రదర్శన చేస్తున్న వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులైన యువకులను పోలీసులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి చితకబాది, కేసులు నమోదు చేశారు. ఈ తరుణంలో ఆదివారం ఉదయం ఆపరేటర్‌ రాజేష్‌ని ఎస్సై పిలిపించి కొట్టాడు. డీజే నిర్వాహకుడు అనపర్తి విజయ్‌ కుమార్‌ను డీజేకు అనుమతులు ఎవరిచ్చారంటూ డీజే బాక్స్‌లు తీసుకొని వచ్చి స్టేషన్లో పెట్టాలని ఆదేశించారు. సాంప్రదాయ పద్ధతిలో జరుగుతున్న వివాహంలో ఎటువంటి తప్పు జరగలేదని ఎస్సైతో చెప్పినా వినకుండా కులం పేరుతో అసభ్యంగా తిట్టి, జుట్టు పట్టుకొని కొట్టినట్టు బాధితుడైన డీజే నిర్వాహకుడు అనపర్తి విజయ్‌ కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదేమిటని అడగటానికి వచ్చిన తన తండ్రి సత్యవర్ధన్‌ ని కూడా అసభ్యంగా తిట్టాడని, టీడీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు అనపర్తి సుబ్బారావు ని కూడా కులం పేరుతో దూషించినట్లు విజయ్‌ కుమార్‌ తెలిపాడు. డీజే బాక్సులు తిరిగి ఇవ్వాలన్నా, పెట్టిన కేసులు తీసేయాలన్నా ఎస్సైకు రూ.50 వేలు చెల్లించాలని కానిస్టేబుళ్లు బాబురావు, రాము డిమాండ్‌ చేసినట్లు విజయ్‌ కుమార్‌ తెలిపారు. ఎస్సైపై విచారణ జరిపి వెంటనే సస్పెండ్‌ చేసి న్యాయం చేయాలని కోరారు. ఈ ఘటన నేపథ్యంలో ఎస్సీ యువకులు, స్థానిక దళిత నాయకులు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద మంగళవారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా మాల మహానాడు అధ్యక్షుడు దారా అంజయ్య మాట్లాడుతూ డీజే నిర్వాహకుడు అనపర్తి విజయ్‌ కుమార్‌, ఆపరేటర్‌ రాజేష్‌పై మాల మాదిగలు ఇలానే ప్రవర్తిస్తారంటూ కులం పేరుతో దూషిస్తూ మాట్లాడటం సరికాదని, ఎస్సైపై చర్యలు తీసుకోవాలని మండిపడ్డారు. ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ కేసు కొట్టేయాలన్నా, డీజే బాక్సులు విడిపించాలన్నా పోలీసులు డబ్బులు అడిగారని ఆరోపించారు. అడిగిన డబ్బులు ఇవ్వలేదని వారిని చితకబాదినట్లు చెప్పారు. ఈ విషయమై ఎస్సై ఎస్‌.మల్లికార్జునరావుని వివరణ కోరగా శివరాంపురం ఎస్సీకాలనీలో నిర్వహించిన వివాహ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన డీజేకి ఎటువంటి అనుమతులు లేవని, అక్కడ ప్రజలకు ఇబ్బందికరమైన పాటలు పెట్టి డాన్స్‌లు చేసిన యువకులపై కేసు నమోదు చేసి, డీజేను సీజ్‌ చేశామన్నారు. అలాగే డీజే నిర్వాహకుడు అనపర్తి విజయ్‌ కుమార్‌, ఆపరేటర్‌ను, దళితులను ఎలాంటి కులం పేరుతో దూషించలేదని, డబ్బులు అడగలేదని తెలిపారు.

మాదిగలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు

ఒంగోలు టౌన్‌: మాదిగ పల్లెకు చెందిన యువకులను కులం పేరుతో దూషించడమే కాకుండా అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్న తాళ్లూరు ఎస్సై మల్లికార్జున మీద కఠిన చర్యలు తీసుకోవాలని మాదిగ సంక్షేమ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ము సుజన్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం ప్రకాశం భవనం వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట మాదిగ సంక్షేమ పోరాట సమితి ఆధ్వర్యంలో తాళ్లూరు గ్రామానికి చెందిన మాదిగలు నిరసన చేపట్టారు. సుజన్‌ మాట్లాడుతూ తాళ్లూరు ఎస్సీ పల్లెకు చెందిన యువకులను పదేపదే పోలీసు స్టేషన్‌కు పిలిపించి బెదిరింపులకు పాల్పడుతున్నాడని, ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నిరసనలో తోరటి ఆనంద్‌, గర్నెపూడి యోహాను, గద్దె త్యాగరాజు, పొగడ్త నారాయణ, కె.బుజ్జి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement