సర్కారు చోద్యం!
దళారుల భోజ్యం..
జిల్లాలో నేటికీ ప్రారంభం కాని పంట కొనుగోలు కేంద్రాలు దళారులు చెప్పిందే ధర.. నాణ్యత పేరుతో ఇంకాస్త కత్తెర
బేస్తవారిపేట:
పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో కూటమి సర్కారు అలవిమాలిన జాప్యం రైతులను కుంగదీస్తోంది. ఖరీఫ్ సీజన్ ముగిసి నెల దాటుతున్నా నేటికీ జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. రైతు సేవా కేంద్రాల్లో రైతులు పండించిన పంటలను అమ్ముకునేందుకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించలేదు. ఈ ఏడాది జూన్‌లో పంటలకు నామమాత్రంగా మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం.. తీరా దిగుబడి వచ్చే సమయంలో పట్టించుకోకుండా చేతులెత్తేసింది. దీంతో బయట మార్కెట్‌లో దళారులకే రైతులు తమ పంట ఉత్పత్తులను విక్రయించాల్సిన దురవస్థ ఏర్పడింది. దళారులు ఎన్నడూ లేని విధంగా మరీ తక్కువ ధరకు అడుగుతుండటంతో పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేయలేక, పెట్టుబడి కోసం చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక తప్పనిసరి పరిస్థితుల్లో అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.
రైతుల కష్టం దళారులపాలు
జిల్లాలో రైతులువరికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్నను ఎంచుకున్నారు. ఏటికేటికీ పంట విస్తీర్ణం పెరుగుతోంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో దాదాపు 17,500 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా.. గడిచిన నెల రోజులుగా నూర్పిళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 47 వేల టన్నుల మొక్కజొన్నలు దిగుబడి వచ్చినట్లు వ్యవసాయాధికారుల అంచనా. ఇంత వరకు బాగానే ఉంది కానీ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. క్వింటా రూ.2400కు కొనుగోలు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం పత్తా లేదు. అదే సమయంలో పంట పొలాల వద్ద గద్దల్లా వాలిన దళారులు క్వింటా రూ.1850 లెక్కన కొనుగోలు చేస్తామని చెప్పారు. రైతులు దిక్కు తోచని స్థితిలో దళారులకే పంటను తెగనమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా జిల్లాలో శనగ రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. గత రెండేళ్లుగా మద్దతు ధర లేకపోవడంతో వేల టన్నుల శనగలు కోల్డ్ స్టోరేజీల్లో మగ్గుతున్నాయి. శనగలు క్వింటా రూ.10 వేల చొప్పున కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం శనగలపై దిగుమతి సుంకాన్ని పూర్తిగా రద్దు చేయడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఆస్ట్రేలియా, కెనడా, టాంజానియా దేశాల నుంచి శనగలు సేకరించడం వల్ల దేశంలోని రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయని రైతు సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు.
క్వింటా మొక్కజొన్న రూ.1850, నువ్వులు రూ.7 వేలు, రాగులు రూ.3,500, జొన్నలు రూ.2100, సజ్జలు రూ.2 వేలు, మినుములు రూ.6500, పొద్దుతిరుగుడు రూ.5500, ధాన్యం రూ.1500, వేరుశనగ రూ.6500 చొప్పున దళారులు కొనుగోలు చేస్తున్నారు. అది కూడా పంట దిగుబడి నాణ్యంగా ఉంటేనే ఈ ధరలు చెల్లిస్తున్నారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటల ధరను తెగ్గోసి కొనుగోలు చేస్తున్న పరిస్థితి.
అరకొరగా మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకొన్న కూటమి సర్కారు
తక్కువ ధరకే పంట ఉత్పత్తులు తెగనమ్ముకోవాల్సిన దుస్థితి
రోజురోజుకూ ధరలు పతనం
అవుతుడటంపై రైతుల ఆందోళన
ఈ–క్రాప్‌లోనే మాయ
ప్రభుత్వం కొత్తగా పెట్టిన నిబంధనలతో ఈ–క్రాప్ బుకింగ్‌లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రభుత్వ నూతన నిబంధనల ప్రకారం సర్వే నంబర్ల వారీగా పంట సాగు చేసినా లేదా బీడుగా ఉన్నా జియో మ్యాపింగ్ చేసి, ఫొటో తీసి అప్‌లోడ్ చేయాలి. ఈ తతంగం క్షేత్ర స్థాయిలో పూర్తికావడానికి ఎక్కువ సమయం పడుతోంది. ఇప్పటికే భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ఎల్‌పీ నంబర్లకు వ్యవసాయశాఖ సిబ్బంది దగ్గరున్న సర్వే నంబర్లకు పొంతన కుదరక ఈ క్రాప్‌నే ఆపేసిన పరిస్థితి. ఈ–క్రాప్ బుకింగ్ పూర్తయితేనే రైతులు పంట కొనుగోలు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ అడ్డగోలు నిబంధనల మూలంగా ఈ–క్రాప్ బుకింగ్ ఆలస్యం కావడంతో పంటల కొనుగోలుపై ప్రభావం పడుతోంది.
వంచనకే పరిమితం
వాతావరణ పరిస్థితులు అనుకూలించక రైతులు నష్టాలపాలవుతున్నా ప్రభుత్వం ఏ మాత్రం కనికరించడంలేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రకృతి విపత్తుల సమయంలో రైతులను ఆదుకునేందుకు ఉచిత పంటల బీమా అమలు చేసింది. ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌లో రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకున్నారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతులపై నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తోంది. అన్నదాత సుఖీభవ ద్వారా ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తామని ప్రకటించి ఈనాం భూములు, అసైన్‌మెంట్, కౌలు కార్డుదారులకు ఎగనామం పెట్టింది.


