రెడ్‌బుక్ రాజ్యాంగంలో దళితులకు రక్షణ కరువు
వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దేవప్రసాద్
ఒంగోలు టౌన్: రెడ్‌బుక్ రాజ్యాంగంలో దళితులకు రక్షణ కరువైందని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గాలిమూటి దేవప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అటకెక్కించి రెడ్ బుక్ రాజ్యాంగంతో కూటమి నాయకులు పాలన సాగిస్తున్నారని విమర్శించారు. చీమకుర్తి మండలం బండ్లమూడి ఎస్సీ కాలనీకి చెందిన దళితులపై అగ్రకులాలు కర్రలు, మారాణాయుధాలతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. దళితుల పొలంలోకి గొర్రెలను మేపడానికి పంపించడమే కాకుండా ఆ విషయం గురించి అడగానికి వెళ్లిన ఏసుదాసు కుటుంబంపై దాడికి దిగడం దారుణమన్నారు. అధికారం చేతిలో ఉందన్న అహంకారంతోనే పోలీసుల ఎదుటే దాడికి పాల్పడ్డారని, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పడానికి ఈ ఘటన ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.


