కొలిక్కిరాని కాకుటూరివారిపాలెం వివాదం
● తహసీల్దార్ కార్యాలయంలో రాత్రి వరకు కొనసాగిన చర్చలు
టంగుటూరు: మండలంలోని కాకుటూరివారిపాలెం వివాదం కొలిక్కి రాలేదు. ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, టంగుటూరు తహసీల్దార్ ఆంజనేయులు, కొండపి సీఐ సోమశేఖర్, టంగుటూరు, సింగరాయకొండ ఎస్సైలు నాగమల్లేశ్వరరావు, మహేంద్ర, పోలీస్ సిబ్బంది గ్రామంలో ఉదయం నుంచి పర్యటించి తహసీల్దార్ కార్యాలయంలో చర్చించారు. అయినా ఓ కొలిక్కి రాలేదు. వివరాల్లోకి వెళితే..కాకుటూరివారిపాలెం 531–1 సర్వే నంబర్‌లో పంచాయతీ కార్యదర్శి జాన్‌బాషా కనీసం సర్పంచ్‌కు తెలియకుండా దళితుల కమ్యూనిటీ స్థలంలో విద్యుత్ స్తంభం ఏర్పాటు చేశారు. దీనిపై కాలనీవాసులు అభ్యంతరం చెప్పగా పంచాయతీ కార్యదర్శి వారిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అంతటితో ఆగకుండా రోడ్డు వెడల్పు చేయాలని అంబేడ్కర్ విగ్రహం తొలగించాలని హైడ్రామా సృష్టించడంతో వివాదం మరింత ముదిరింది. ఈ క్రమంలో గ్రామస్తుల ఆందోళనతో తహసీల్దార్ గ్రామానికి చేరుకొని కొలతలు చేస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం టంగుటూరు తహసీల్ధార్ కార్యాలయంలో ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న ఇరు వర్గాలను పిలిపించి వేరువేరుగా చర్చించారు. అనంతరం సంఘటనా స్థలానికి చేరుకొని 15 అడుగుల ఉన్న రోడ్డును మలుపు వద్ద 30 అడుగులు పెంచడానికి తీర్మానం చేసి ఇరువర్గాలతో సంతకాలు చేయించారు. అనంతరం అధికారులు మార్కింగ్ చేసేందుకు గ్రామానికి రాగా మళ్లీ కథ మొదటికొచ్చింది. దీంతో అధికారులు మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకు చర్చలు చేస్తూనే ఉన్నారు.


