ఉద్దేశపూర్వకంగానే దళితులపై టీడీపీ మూక దాడి
చీమకుర్తి: బండ్లమూడి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు తమపై ఉద్దేశపూర్వకంగానే దాడికి తెగబడి తీవ్రంగా గాయపరిచారని ఎస్సీ కాలనీకి చెందిన వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల కథనం మేరకు.. వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడు కంఠం యేసుదాసు కుటుంబానికి చెందిన పొలంలో సుబాబుల్ మొక్కలను టీడీపీ నాయకులకు చెందిన గొర్రెలు మేసి పాడుచేశాయి. దీంతో యేసుదాసు వారి ఇంటి వద్దకు వెళ్లి, పొలంలో జరిగిన పరిస్థితిని చెప్పి నిలదీశాడు. దళితుడు ఇంటికి వచ్చి నిలదీయడం, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి పోలీసు సిబ్బందిని ఊర్లోకి తీసుకురావడాన్ని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు తమ బంధువర్గంతో కలిసి దాడికి పథకం రచించారు. యేసుదాసుతోపాటు అతనికి మద్దతుగా వచ్చిన వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై కర్రలతో దాడి చేసి గాయపరిచారు. ఈ దాడిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఇదిలా ఉండగా.. యేసుదాసు కుటుంబంలో ఇటీవల వివాహ శుభకార్యం జరిగింది. ఈ సందర్భంగా తాళిబొట్టు తీసుకొచ్చే సంప్రదాయంలో భాగంగా గ్రామంలోని వైఎస్సార్ సీపీ నాయకుల ఇంటికి ఊరేగింపుగా వెళ్లారు. ఆ విషయాన్ని టీడీపీ నేతలు ప్రస్తావిస్తూ.. ‘ఆ రోజే మిమ్మల్ని తన్నాల్సింది’ అని దాడికి తెగబడటం గమనార్హం. దీంతో టీడీపీ నేతలు దాడికి తెగబడటం యాదృచ్ఛికం కాదని, ఉద్దేశపూర్వకమేనని తేలిపోయింది.
చీమకుర్తి రూరల్: మండలంలోని బండ్లమూడి గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. గ్రామంలో సుబ్బారెడ్డి వర్గీయులు చేసిన దాడిలో కంఠం ఏసుదాసు కుటుంబీకులు తీవ్ర గాయాలై ఒంగోలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దళితులపై జరిగిన దాడులపై పలు ప్రాంతాల నుంచి ప్రజా సంఘాలు నేతలు వచ్చి ఖండిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామంలో వివాదాలు ముదరకుండా సీఐ ప్రసాద్ 15 మంది సిబ్బందితో పికెట్ ఏర్పాటు చేశారు. గ్రామంలో ఎటువంటి ఉద్రిక్తత తలెత్తకుండా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
● బీసీ సంఘాలు, ప్రజా సంఘాల డిమాండ్
ఒంగోలు టౌన్: చీమకుర్తి మండలం బండ్లమూడి గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన మాదిగలపై దాడి చేసిన అగ్ర కులాల వారిని వెంటనే అరెస్టు చేయాలని, ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని బీసీ సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా బీసీ సమన్వయ కమిటీ జిల్లా చైర్మన్ బొట్ల సుబ్బారావు మాట్లాడుతూ అధికారం చేతిలో ఉందన్న అహంకారంతోనే పోలీసుల సమక్షంలో దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు, బీసీలు, మహిళలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. బండ్లమూడి దళితులకు రక్షణ కల్పించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓపీడీఆర్ రాష్ట్ర నాయకులు చావలి సుధాకర్, బీసీ నాయకులు ధరణికోట లక్ష్మి నారాయణ, బీఎస్పీ నాయకులు షేక్ అజీజ్, తాటిపర్తి వెంకటస్వామి, గిరిజన సంఘం రాష్ట్ర నాయకుడు పేరం సత్యం, చర్మకారుల సంఘం రాష్ట్ర నాయకుడు ఆంజనేయులు, జిల్లా రజక సంఘం నాయకుడు ఉప్పలపాటి ఏడుకొండలు, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకుడు ఫణిదెపు సుధాకర్, మస్తాన్ రావు, వీసం బాలకృష్ణ, మద్దు ప్రతాప్, నరసింహగౌడ్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
● రూ.4.50 లక్షల ఆస్తినష్టం
దర్శి: పట్టణంలోని శివరాజనగర్‌లో ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధమైంది. ఈ సంఘటనలో రూ.4.50 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. వివరాల్లోకి వెళితే..శివరాజనగర్‌లో నివసిస్తున్న అంజయ్య కుటుంబసభ్యులతో కలిసి శ్రీశైలం వెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇంట్లో నుంచి మంటలు వ్యాపించాయి. ఇంటి పైకప్పు తారుబాలు పట్టలతో ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి ఇల్లంతా కాలిపోయింది. ప్రమాదంలో ఇంట్లోని సామగ్రి, బీరువాలోని నగదు కాలిపోయాయని బాధితులు వాపోయారు. వ్యాపారం చేసేందుకు ఉంచిన దుస్తులు కూడా దగ్ధమయ్యాయి. ప్రమాదంలో మొత్తం రూ.4.50 లక్షల నష్టం వాటిల్లినట్లు తెలిపారు. స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.
ఉద్దేశపూర్వకంగానే దళితులపై టీడీపీ మూక దాడి


