‘దిశ’లో సమస్యల ఏకరువు
ఒంగోలు సబర్బన్: జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం (దిశ)లో సమస్యలపై సభ్యులు ఏకరువు పెట్టారు. సమావేశంలో సమస్యలు చెప్పటం మినహా అవి మాత్రం పరిష్కారానికి నోచుకోలేదని సమావేశంలో ప్రశ్నించారు. మొదటి దిశ సమావేశంలోని తీర్మానాలకే అతీగతీ లేదని ధ్వజమెత్తారు. అప్పట్లో చేసిన తీర్మానాలను అమలు చేయలేదని వైఎస్సార్ సీపీ సభ్యులు చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రకాశం భవన్‌లోని గ్రీవెన్స్ హాలులో బుధవారం ఒంగోలు ఎంపీ, దిశ చైర్మన్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఈ సమావేశంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ సభ్యులు జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ పథకాలపై అలసత్వాన్ని నిలదీశారు. వైఎస్సార్‌సీపీ సభ్యుల పట్ల అధికారులు పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారన్నారు. తొలుత ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు వచ్చినందుకు కలెక్టర్ తమీమ్ అన్సారియాను ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకుండా అవసరమైన ముందస్తు చర్యలు పటిష్టంగా చేపట్టాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్, దిశ వైస్ చైర్మన్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ ఈ నెల 8 నుంచి 22 వ తేదీ వరకు 15 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 7వ పౌష్టికాహార పక్షోత్సవాలు (పోషణ్ పక్వాడా) రోజుకు ఒక కార్యక్రమంతో సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని, దాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ నగరంలోని పోతురాజుకాలువ, నల్ల కాలువల్లో పూడిక తీత పనులు చేపట్టాలన్నారు. ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహా రెడ్డి, బీఎన్ విజయకుమార్ మాట్లాడుతూ తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో జేసీ రోణంకి గోపాల కృష్ణ, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డీఆర్‌ఓ చిన ఓబులేసు, సీపీఓ వెంకటేశ్వర రావు, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ బాల శంకర రావు, హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్, పబ్లిక్ హెల్త్ ఈఈ శ్రీనివాస సంజయ్, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం.వెంకటేశ్వర రావుతో పాటు పలువురు పాల్గొన్నారు.
దిశ తొలి సమావేశంలోని తీర్మానాల అమలు ఎక్కడ సమస్యలు చెప్పటమే కానీ పరిష్కారం లేదని సభ్యుల అసహనం ఎమ్మెల్యే తాటిపర్తికి సమాచారం ఇవ్వలేదని వైఎస్సార్ సీపీ సభ్యుల ఆగ్రహం కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే సమావేశానికి హాజరు
మర్రిపూడి–పొదిలి రోడ్డు అధ్వానంగా ఉంది
మర్రిపూడి–పొదిలి రోడ్డులో 12 కిలో మీటర్ల ప్రయాణానికి అర్ధ గంటపైగా సమయం పడుతోంది. రోడ్డు మరీ అధ్వానంగా మారింది. గతంలో కూడా సమావేశాల్లో ప్రస్తావించినా ప్రయోజనం లేదు. మర్రిపూడి సెంటర్‌లో 90 వేల లీటర్ల సామర్ధ్యం కలిగిన ఓవర్ హెడ్ ట్యాంకు కూలిపోయే స్థితిలో ఉంది. దాన్ని కడిగి ఎన్ని సంవత్సరాలైందో. ట్యాంకు పైకి ఎక్కడానికి భయపడుతున్నారు. అదే నీళ్లు ప్రజలకు సరఫరా చేస్తున్నారు.
– వాకా వెంకట రెడ్డి, వైఎస్సార్ సీపీ ఎంపీపీ, మర్రిపూడి


