పామూరులో రూ.1.60 లక్షల చోరీ
పామూరు: స్థానిక పోలేరమ్మ ఆలయ సమీపంలోని ఓ నివాసగృహంలో సోమవారం రాత్రి రూ.1.60 లక్షలు చోరీకి గురయ్యాయి. వివరాల్లోకి వెళితే..పామూరుకు చెందిన గాజులపల్లి శ్రీకాంత్ ఇంట్లో నిద్రిస్తుండగా రాత్రి దుండగలు వెనుక వైపు నుంచి ఇంట్లోకి ప్రవేశించి బీరువాలోని రూ.1.60 నగదు చోరీ చేశారు. దీనిపై ఎస్సైని వివరణ కోరగా ఘటనపై విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మార్కాపురం: మార్కాపురం నియోజకవర్గ పరిధిలోని పొదిలి శివార్లలో సంక్రాంతి పండుగ సందర్భంగా కూటమి నేతలు కోడి పందేల బరిని ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. ఈ బరికి సంబంధించి ఫొటోలు సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఒక వైపు పోలీసు ఉన్నతాధికారులు కోడిపందేల బరులు ఏర్పాటు చేసినా, నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ ఆదేశాలను కూటమి నేతలు లెక్కపెట్టడం లేదు. పొదిలి పట్టణ శివార్లలోని పిచ్చిరెడ్డితోట సమీపంలో కోడిపందేల బరిని ఏర్పాటు చేసి 14, 15, 16 తేదీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కోడిపందేలు నిర్వహిస్తామని పేర్కొనడం విశేషం. పోలీసులకు అన్నీ తెలిసినా పట్టించుకోవడం లేదు.
● రూ.8 లక్షల సొత్తు స్వాధీనం
● విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడి
బల్లికురవ: చెడు వ్యసనాలకు బానిసైన నలుగురు యువకులు వ్యవసాయ ఉపకారణాల చోరీకి పాల్పడ్డారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ కె.వెంకటరావు, బల్లికురవ ఎస్సై వై నాగరాజు వివరాలు వెల్లడించారు. పల్నాడు జిల్లా వినుకొండ మండలం గోకనకొండ గ్రామానికి చెందిన ఏ.బాలాంజనేయులు, వి.నాగరాజు, కె. వెంకటేష్, డి.అంకమ్మరావు ప్రకాశం జిల్లా బల్లికురవ, అద్దంకి, సంతమాగులూరు, బాపట్ల జిల్లా మార్టూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో 6 కేసుల్లో ట్రాక్టర్ ట్రాలీ, 5 రోటావేటర్‌లను చోరీ చేశారు. చెన్నుపల్లి శివారులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. దర్శి డీఎస్పీ లక్ష్మీ నారాయణ పర్యవేక్షణలో సీఐ, ఎస్సై, పోలీస్ సిబ్బంది చాకచక్యంగా రైతుల సొత్తు రికవరీ చేసినందుకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించారు.
సీఎస్‌పురం(పామూరు): చెరువులో పెంచుతున్న చేపలకు మేత వేసేందుకు బోటులో లోపలికి వెళ్లిన వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ ఘటన మండలంలోని రేగులచెలక గ్రామ సమీపంలోని చెరువులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని రేగులచెలక చెరువును తెనాలి ప్రాంతానికి చెందిన వ్యక్తి లీజుకు తీసుకుని చేపలు పెంచుతున్నాడు. తెనాలి ప్రాంతానికి చెందిన కనుమల ప్రకాశరావు అనే వ్యక్తి చెరువులోని చేపలకు మేత వేసేందుకు సోమవారం మధ్యాహ్నం సమయంలో బోటులో చెరువులోకి వెళ్లి ఆపై ఒడ్డుకు రాలేదు. దీంతో ప్రకాశరావు కుటుంబ సభ్యులు మంగళవారం స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై ఎస్సై యం.వెంకటేశ్వర నాయక్ ఘటన జరిగిన చెరువు ప్రాంతాన్ని పరిశీలించి గజ ఈతగాళ్లను పిలిపించి గాలింపు చర్యలు చేపట్టారు. చెరువులో మునిగిపోయిన బోటును మంగళవారం సాయంత్రానికి బయటికి తీయించగలిగారు. కాగా గల్లంతైన ప్రకాశరావు ఆచూకీ మాత్రం రాత్రి వరకు లభ్యం కాలేదు.
● 200 బాతులు మృతి
బల్లికురవ: టైరు పంక్చర్ కావడంతో అదుపుతప్పి డివైడర్ ఎక్కిన బాతుల లోడు లారీ అనంతరం బోల్తా కొట్టింది. ఈ సంఘటన మంగళవారం రాత్రి నార్కెట్‌పల్లి– మేదరమెట్ల నామ్ రహదారి కొప్పరపాడు సమీపంలో జరిగింది. తెలంగాణ రాష్ట్రం నుంచి చెన్నె ప్రాంతానికి బాతు లోడు లారీ వెళ్తోంది. టైరు పంక్చర్ కావడంతో ప్రమాదం సంభవించింది. లారీ బోల్తా కొట్టడంతో ప్రమదంలో 200 పైచిలుకు బాతులు అక్కడికక్కడే చనిపోయాయి. లారీలో ప్రయాణిస్తున్న ఒకరిద్ద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
పామూరులో రూ.1.60 లక్షల చోరీ
పామూరులో రూ.1.60 లక్షల చోరీ


