రైతుల మోములో ఆనందం ఏది
యర్రగొండపాలెం: చంద్రబాబు ప్రభుత్వంలో రైతుల మోములో ఎటువంటి ఆనందం లేదని, యూరియా లేదని, గిట్టుబాటు ధర లేదని, అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్నట్లు వారి పరిస్థితి అధ్వానంగా తయారైందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రెండు రోజులుగా జరుగుతున్న జాతీయ స్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలకు మంగళవారం హాజరైన ఆయన మాట్లాడారు. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిఉన్నట్లయితే వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తయ్యేదని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను సుఖసంతోషాలతో ఉంచేవారని అన్నారు. రాజు అనేవాడు నాయకుడు కాదని, అతిపెద్ద సేవకుడిగా పనిచేయాలని భీష్ముడు ఇచ్చిన సందేశాన్ని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పాటిస్తున్నారని, నియోజకవర్గ ప్రజలకు ఆయన అతిపెద్ద సేవకుడిగా పనిచేస్తున్నారని అన్నారు. 2027లో జమిలి ఎన్నికలు, 2029లో ఎన్నికలు వస్తాయా అని ఎవరు ఏమనుకున్నా సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమట అస్తమిస్తాడన్నది ఎంత వాస్తవమో, రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెప రెపలాడుతుందని, జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు.
జగనే మనకు రక్ష
మనందరికీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండదండలు ఉండటం వల్లనే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నామని, దుర్మార్గపు కూటమి నాయకుల బారి నుంచి రక్షింపబడుతున్నామని తాడిపర్తి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. జాతీయ స్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పోటీలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ను, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలను ఆయన అభినందించారు. మార్కాపురం నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు మాట్లాడుతూ ఎడ్ల పోటీలకు తరలి వచ్చిన ప్రజలను చూస్తుంటే జగనన్న ఇంకా అధికారంలో కొనసాగుతున్నారా అన్న అనుమానం వస్తోందని, ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పటికీ ప్రజల్లో అటువంటి ఆలోచనే లేకుండా పోయిందని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఎటువంటి కష్టాలు ఎదుర్కోలేదని, చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను అమలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. గిద్దలూరు పార్టీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ ఎడ్ల పందేలకు తరలి వచ్చిన అశేష ప్రజలను చూస్తుంటే జగనన్న ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదని, ఆయన ముఖ్యమంత్రి కావాలన్న ప్రజల కోరిక 2029లో నెరవేరబోతుందని అన్నారు. కార్యక్రమంలో ఉరవకొండ ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి, రాయచోటి మాజీ ఎమ్మెల్సీ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఒంగోలు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగారెడ్డి సతీష్‌రెడ్డి, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, ఐటీ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు చిట్యాల విజయభాస్కర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, ఆదిత్య విద్యా సంస్ధల అధినేత సూరె వెంకట రమేష్ పాల్గొన్నారు.


