పప్పుశనగ రైతుల ఆశలు ఆవిరి
● తీవ్ర వర్షాభావంతో గిడసబారిన పంట
● జిల్లాలో 75 వేల ఎకరాల్లో పప్పుశనగ సాగు
● 50 నుంచి 60 రోజుల వయసుకి వచ్చినా ఎదగని పంట
● మూడు నెలల నుంచి సన్న వర్షపాతం మాత్రమే నమోదు
● నీటి వసతి ఉన్న రైతులకే అధిక దిగుబడులు
● మరోవైపు శనగలకు తగ్గిన ధర
అద్దంకి:
గతేడాది సెప్టంబర్ నెలాఖరుతో కీలకమైన 2025 ఖరీఫ్ ముగిసింది. డిసెంబర్ నెలాఖరుతో రబీ ముగిసింది. ఖరీఫ్‌లో నైరుతి రుతుపవనాలు ముందే పలకరించినా పంటలు పండలేదు. అనుకున్న విస్తీర్ణంలో పంటలు సాగు కాలేదు. పప్పుశనగ సాగుపై ఆశలు పెట్టుకున్న రైతులు జిల్లాలో నవంబర్ మొదటి వారంలో, ఆఖరులో పప్పుశనగ పంటను సుమారు 75 వేల ఎకరాల్లో సాగు వేశారు. తుఫాన్ తర్వాత మూడు నెలల నుంచి తీవ్ర వర్షాభావంతో పైరు గిడసబారిపోయింది. దీంతో ఈ సంవత్సరం పప్పుశనగ సాగుతోనైనా ఊరట చెందుదామనకున్న రైతుల ఆశలు ఆవిరయ్యాయి. దీనికితోడు క్వింటాలు శనగధర పడిపోవడంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు.
ఖర్చు తడిసి మోపెడు
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇంటి ముంగిటికే ఎరువులు, పురుగుమందులు వచ్చాయి. ఏటా రైతు భరోసా నగదు ఖాతాల్లో జమ అయ్యేది. చంద్రబాబు ప్రభుత్వంలో ఏ సాయం రైతులకు అందడం లేదు. ఈ క్రమంలో ఖరీఫ్‌లో పంటలు సాగు చేయలేని రైతులు రబీలో మెట్ట పంట కింద తక్కువ వర్షంతో అధిక లాభాలు తెచ్చిపెట్టే పప్పుశనగపై ఆశలు పెట్టుకున్నారు. గతేడాది నవంబర్‌లో పప్పు శనగ పంటలు సాగు చేశారు. ప్రస్తుతం పంట 60 నుంచి 70 రోజుల వయసులో ఉంది. ఎకరాకు ఎరువులు, విత్తనం, పురుగుమందులు, వ్యవసాయంతో కలుపుకుని రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు వచ్చింది. కౌలు రైతుకై తే రూ.30 నుంచి రూ.35 వేల వరకు ఖర్చు వచ్చింది. 18 నెలల నుంచి వర్షాలు సాధారణంగా పడటం లేదు. అల్పపీడనాలు, తుఫాన్‌లతో మాత్రమే వర్షాలు పడుతున్నాయి. రబీ పంట సాగు చేసిన నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో ఒక్క చుక్క వర్షం పడలేదు. సరాసరిన నెలకు 100 నుంచి 130 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదు కాలేదు. సున్నా వర్షపాతం నమోదు కావడంతో వేసిన పంట ఎదగక గిడసబారిపోయింది. దీంతో ఈ సంవత్సతం ఎకరాకు మూడు నుంచి నాలుగు క్వింటాళ్ల శనగలు వచ్చే పరిస్థితి కూడా లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ప్రకాశంలో భిన్న పరిస్థితి
జిల్లాలోని కందుకూరు, కొండపి, ఒంగోలు ప్రాంతాల్లో కొంతమేర తేలికపాటి జల్లులు పడటంతో ఆయా ప్రాంతాల్లో దిగుబడి కొంచెం పెరిగే అవకాశం ఉంది. ఉత్తర ప్రకాశానికి చెందిన అద్దంకి, దర్శి, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో దిగుబడి గణనీయంగా తగ్గిపోనుంది.
దిగజారిన ఆర్థిక పరిస్థితి
ఈ సంవత్సరం అఽకాల వర్షాలు..లేదంటే అధిక వర్షాలు.. ప్రతికూల వాతావరణం కారణంగా ఖరీఫ్, రబీ రైతులకు పెద్దగా కలిసిరాక నష్టాలబాట పట్టారు. విత్తన రాయితీ అంతంత మాత్రంగా ఉంది. దానికి తోడు క్వింటాళ్ల ధర గణణీయంగా తగ్గిపోవడంతో కనీసం శనగ పంటకు మద్దతు ధర పెంచి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
నష్టాలు తప్ప మిగిలేదేం లేదు:
నేను ఐదెకరాల్లో పప్పుశనగ పంట సాగు చేశా. విత్తనం వేసే అదునులో వర్షాలు అధికంగా పడ్డాయి. భూమి ఆరే సరికి అదును చివరైంది. ఎలాగోలా విత్తనం వేశాం. తర్వాత బెట్ట పెట్టడంతో పంట ఎదుగుద లేక గిడసబారిపోయింది. సాగు ఖర్చులు కూడా వచ్చే అవకాశం లేదు.
రాంబాబు, రైతు
ఆశలు ఆవిరయ్యాయి:
ఈ సవత్సరం పప్పుశనగ సాగుతో ఇబ్బంది లేదనుకున్నాం. తీరా పంట వేయబోయే సరికే క్వింటాలు ధర తగ్గిపోయింది. వర్షాభావంతో పంట ఎదగలేదు. ఎకరాకు మూడు నుంచి నాలుగు క్వింటాళ్లు కూడా కావు. కొంతమందికి క్వింటా అరకింటా కూడా వచ్చే అవకాశం లేదు. ప్రభుత్వ పరంగా ఆదుకోవాలి.
సుబ్రహ్మణ్యం, రైతు
పప్పుశనగ రైతుల ఆశలు ఆవిరి


