ఉపాధి పనులా..!
ఉద్యోగులతో
● పీడీ తనిఖీలో వెలుగు చూసిన అక్రమాలు
యర్రగొండపాలెం: గ్రామాల్లో చిరుద్యోగాలు చేసుకునేవారి పేర్లతో ఉపాధి హామీ పనులు చేసినట్లు మస్టర్లు వేసుకున్నట్లు మంగళవారం జరిగిన సోషల్ ఆడిట్‌లో గుర్తించారు. ఆయా ప్రాంతాలకు చెందిన అంగన్‌వాడీ ఆయాలు, ఇతర ఉద్యోగుల పేర్లు నమోదు చేసుకొని ఉపాధి నిధులు దుర్వినియోగం చేశారని డ్వామా పీడీ జోసఫ్ కుమార్‌కు ఆడిట్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. అనేక ప్రాంతాల్లో నాటుకున్న మొక్కలు ఎండిపోయాయని, కొలతల్లో వ్యత్యాసాలు ఉన్నాయని వారు ఆరోపించారు. ఈ మేరకు రికార్డు చేసిన పీడీ ఉపాధి సిబ్బందిని మందలించారు. మండలంలో ఉపాధి, ఐటీడీఏ, పంచాయతీ రాజ్ ఆధ్వర్యంలో దాదాపు రూ.28 కోట్ల పనులు జరిగినట్లు ఆయన తెలిపారు. అనంతరం ఇటీవల విద్యుదాఘాతంతో మృతి చెందిన కంప్యూటర్ ఆపరేటర్ కోటేశ్వరరావు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఉపాధి సిబ్బంది ద్వారా సేకరించిన రూ.1.50 లక్షలు, తన సొంత నిధులు రూ.10 వేలు మృతుడి పిల్లలకు అందజేశారు. కాశికుంట తండాలో నిర్మిస్తున్న పశువుల నీటి తొట్టిని ఆయన పరిశీలించారు. నియోజకవర్గంలోని ఉపాధి సిబ్బందితో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని పలు సూచనలు ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీవో పి.శ్రీనివాసరావు, సోషల్ ఆడిట్ ఎస్‌ఆర్‌పీ వెంకటేశ్వర్లు, జిల్లా విజిలెన్స్ అధికారి ప్రసాద్, ఏపీవోలు కె.నాగేశ్వరరావు, ఎం.శైలజ పాల్గొన్నారు.


