ప్రకాశం
గురువారం శ్రీ 15 శ్రీ జనవరి శ్రీ 2026
నాడు సంక్రాంతి పండుగంటే ఎంత సంబరంగా ఉండేదో.. ఇప్పుడా కళ ఏమైందో అంటూ పండుగ కళతప్పిన దానిపై వారి చర్చ సాగింది. నాడు జగన్ ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా సంక్షేమ పథకాలు అందజేయడంతో ఊళ్లన్నీ కళకళలాడేవని గుర్తు చేసుకున్నారు. సంక్రాంతి పండుగ రోజుల్లో సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నప్పుడు ఏదో ఒక పథకం డబ్బులు బ్యాంకులో పడేవి. ఆ డబ్బులతో పేదలు దుస్తులు, ఇంటికి సరుకులు తెచ్చుకుని పండుగ సంబరాలు చేసుకునే వారు. ఇప్పుడు పల్లె వెలవెలపోతోంది. వైఎస్సార్ సీపీ హయాంలో సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేశారు. వలంటీర్లు ఇంటికే వచ్చి పింఛన్లు ఇచ్చే సందడి హడావుడి బాగుండేది. ప్రస్తుతం రైతులకు సేవా వారధిగా ఉండే రైతు భరోసా కేంద్రం సేవలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. జగన్ హయాంలో రైతులు పండించిన ధాన్యానికి ధరలు బాగుండేవి. లాభాలు పండాయి. చంద్రబాబు వచ్చాక పరిస్థితి తలకిందులైంది. ఉద్యోగరీత్యా వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వచ్చారు. పల్లెల్లో వచ్చిన మార్పును వారు గమనించారు. ‘‘నేడు ఒకటో తేదీ వస్తే ఉదయాన్నే పింఛన్ కోసం గుడి వద్ద కాపు కాయాల్సిన దుస్థితి. గతంలో రేషన్ బియ్యం ఇంటికి వస్తే నేడు రేషన్ దుకాణానికి వెళ్లి గంటల తరబడి నిరీక్షించి బియ్యం తెచ్చుకోవాల్సిన పరిస్థితి. గతంలో గ్రామ వలంటీర్ వచ్చి అప్లికేషన్ పూర్తి చేసి తీసుకుని వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మంజూరు చేయించేవారు. కానీ నేడు గ్రామ సచివాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది.’’ అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కాపురంలో మెడికల్ కళాశాలను ప్రైవేటుకు అప్పగించడం, వెలుగొండ జలాలను జిల్లా వాసులకు అందించి స్వచ్ఛమైన జలాలు అందించాలన్న డిమాండ్ సైతం వారి నుంచి వినిపించింది.


