బరితెగించారు..!
సాక్షి టాస్క్‌ఫోర్స్:
జిల్లాలో తెలుగు తమ్ముళ్లు బరితెగించారు. కోడి పందేల నిర్వహణ చట్టవిరుద్ధమైనప్పటికీ.. అధికార పార్టీ అనే అహంకారంతో ప్రత్యేకంగా బరులు ఏర్పాటు చేశారు. పైగా, ఆ బరుల చుట్టూ టీడీపీ జెండాలు, ఆయా నియోజకవర్గాల టీడీపీ ముఖ్య నాయకుల ఫొటోలతో ఫ్లెక్సీలను అలంకరించారు. జిల్లావ్యాప్తంగా కోట్ల రూపాయల్లో కోడి పందేలు వేస్తున్నారు. అక్కడే మద్యం, మాంసం విక్రయిస్తూ విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని దర్శి, కొండపి, కందుకూరు, కనిగిరి ఒంగోలు, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో యథేచ్ఛగా కోడి పందేలు నిర్వహిస్తున్నప్పటికీ పోలీసులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో పాటు భారీగా లంచాలు తీసుకుని పోలీసులు పట్టించుకోవడం లేదని ప్రజలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. పోలీసులు మాత్రం కోడి పందేలు నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు, ప్రకటనలు చేస్తూ క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులతో చేతులు కలిపి డ్రామాలాడుతున్నట్లు తెలుస్తోంది.
దర్శి నియోజకవర్గంలో పచ్చనేతల విచ్చలవిడి...
దర్శి నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి అండదండలతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. తాళ్లూరు సమీపంలోని వెంకట్రామయ్యస్వామి ఆలయ సమీపంలో కొందరు తెలుగు తమ్ముళ్లు గొట్టిపాటి లక్ష్మి ఫొటోలతో ఫ్లెక్సీలు వేసి మరీ కోడి పందేలు నిర్వహిస్తున్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్సై మల్లికార్జునరావు కోడి పందేల బరిని ట్రాక్టర్ సహాయంతో దున్నేసినట్లు పైకి షో చేసినప్పటికీ.. బుధవారం గుట్టుచప్పుడు కాకుండా అదే ప్రాంతంలో బరి ఏర్పాటు చేసి కోడి పందేలు నిర్వహించారు. కొందరు తెలుగు తమ్ముళ్లు గొట్టిపాటి లక్ష్మి, సీఐ, ఎస్సైలకు భారీగా ముడుపులు ముట్టజెప్పి బరిని ఏర్పాటు చేసినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. పోలీసుల ప్రవర్తన చూసి ముక్కునవేలేసుకుంటున్నారు. కోట్లాది రూపాయల్లో పందేలు వేస్తుండగా, కమీషన్లు పెట్టి తెలుగు తమ్ముళ్లు మధ్యవర్తిత్వం నడుపుతూ లక్షలాది రూపాయలు కాజేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు బరి వద్దే మద్యం యథేచ్ఛగా విక్రయిస్తూ ఏరులై పారిస్తున్నారు. ఇదంతా విచ్చలవిడిగా జరుగుతున్నా కనీసం పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం. బుధవారం జరిగిన పందేలలో లక్షలాది రూపాయలు వెచ్చించినట్లు సమాచారం కాగా, సంక్రాంతి, కనుమ రెండు రోజుల్లో ఇంకా భారీ మొత్తాల్లో పందేలు వేసేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడకుండా ఉండేందుకు భారీగా ముడుపులు ముట్టజెప్పారన్న చర్చ నడుస్తోంది.
మంత్రి స్వామి ఇలాకాలోనూ జోరుగా
కోడి పందేలు...
మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామికి చెందిన కొండపి నియోజకవర్గంలో ఏకంగా మంత్రి ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి బరులు సిద్ధం చేశారు. కొణిజేడు – యరజర్ల గ్రామాల మధ్య టీడీపీ నాయకులు జోరుగా కోడి పందులు నిర్వహిస్తున్నారు. పెద్ద, చిన్న బరులు, కాయ్ రాజా కాయ్ ఏర్పాటు చేశారు. కోడి పందేలకు జిల్లా నలుమూలల నుంచి దాదాపు 100 పందెపు కోళ్లు వచ్చినట్లు సమాచారం. ఈ పందేల్లో లక్షల రూపాయల్లో డబ్బు చేతులు మారుతోంది. దాదాపు 500 కార్లు, 1000కి పైగా ద్విచక్ర వాహనాలతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. కారుకు రూ.100, ద్విచక్ర వాహనానికి రూ.50 చొప్పున నిర్వాహకులు పార్కింగ్ ఫీజు కూడా వసూలు చేస్తున్నారంటే.. ఏ స్థాయిలో ఏర్పాట్లు చేశారో అర్థం చేసుకోవచ్చు.
మంచికలపాడు పంచాయతీ పరిధిలో
లక్షల్లో కోడి పందేలు...
చీమకుర్తి రూరల్: మండలంలోని మంచికలపాడు పంచాయతీ పరిధిలో ఎర్రగుడిపాడు వెళ్లే చినరాస్తా రోడ్డుకి ఇరువైపులా స్థానిక టీడీపీ నాయకులు మూడు బరులు ఏర్పాటు చేసి లక్షల రూపాయల్లో కోడి పందేలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ బరులు ఏర్పాటు చేసినట్లు సాక్షి దినపత్రికలో ఈ నెల 11వ తేదీ కథనం ప్రచురితమైనప్పటికీ పోలీసులు, అధికారులు ఆవైపు కన్నెత్తి కూడా చూడలేదు. నియోజకవర్గ టీడీపీ ముఖ్య నాయకుని అండతో ఆ పార్టీ నాయకులు కోడి పందేలు నిర్వహిస్తుండటంతో పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పెద్ద బరిలో ఒక్కో పందెం లక్ష రూపాయల వరకు నడవగా, చిన్న బరిలో 50 వేల రూపాయల వరకు నడిచినట్లు సమాచారం.
కొత్తపట్నం మండలంలో
కోడి పందెం కూత...
కొత్తపట్నం: మండలంలో టీడీపీ నాయకులు బరుల చుట్టూ పసుపు జెండాలు ఏర్పాటు చేసి జోరుగా కోడి పందేలు నిర్వహిస్తున్నారు. పార్టీ ముఖ్య నాయకుడి ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పోలీసులను సైతం లెక్క చేయకుండా కోడి పందేలు వేస్తున్నారు. లక్షల రూపాయల్లో నగదు చేతులు మారుతుండగా, పోలీసులకు సమాచారం తెలిసినప్పటికీ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శిలు వినిపిస్తున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా జూదరులు కోళ్లతో చేరుకోవడంతో బరులు కిక్కిరిసిపోయాయి. అక్కడే మద్యం, మాంసం వంటివి కూడా ఏర్పాటు చేసి ఇష్టారాజ్యంగా టీడీపీ నాయకులు కోడి పందేలు నిర్వహిస్తుండటంతో పాలకులు, పోలీసుల తీరును ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
కనిగిరి నియోజకవర్గంలో భారీగా
కోడి పందేలు...
కనిగిరి రూరల్/హనుమంతునిపాడు/పీసీ పల్లి: సంక్రాంతి సంబరాల మాటున కనిగిరి నియోజకవర్గంలో జోరుగా కోడి పందేలు నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో కనిగిరి, పీసీ పల్లి, హెచ్‌ఎం పాడు, వెలిగండ్ల, పామూరు, సీఎస్ పురం మండలాల్లో బుధవారం విచ్చలవిడిగా కోడి పందేలు జరిగాయి. కనిగిరి మండలంలోని శివారు ప్రాంతమైన బల్లిపల్లి పంచాయతీ పాలకొండ వద్ద అధికార పార్టీకి చెందిన రూరల్ నేతల కనుసన్నల్లో కోడి పందేలు నిర్వహించారు. సంక్రాంతి, కనుమ రెండ్రోజులు కూడా భారీగా నిర్వహణకు తెలుగు తమ్ముళ్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆటగాళ్లకు అన్ని సౌకర్యాలు కల్పించి మరీ పందేలు వేస్తున్నారు. వేములపాడు గ్రామ సమీపాన పొలాల్లో కోడి పందేలు భారీగా సాగాయి. వేములపాడు కేంద్రంగా ఘాట్ రోడ్డు సమీపాన పొలాల్లో కోడి పందేల బరులు ఏర్పాటు చేసి పందేలు జరిపారు. అక్కడికి కంభం, బేస్తవారిపేట, కొనకనమిట్ల, కనిగిరి హనుమంతునిపాడు, మార్కాపురం, తర్లుపాడు, గిద్దలూరు మండలాల నుంచి కోడి పందెం ఆటగాళ్లు వచ్చి పాల్గొన్నట్లు సమాచారం. సుమారు 400 నుంచి 500 కోళ్లు వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. పై పందేలు కూడా భారీగా సాగినట్లు తెలిసింది. పీసీ పల్లి మండల పరిధిలోని పెదఎర్లపాడు, పీసీ పల్లి పంచాయతీ రామగోవిందాపురం, వేపగుంపల్లి, దేశిరెడ్డిపల్లి, కోదండరామపురం, గుంటుపల్లి, లక్ష్మక్కపల్లి, చౌటు గోగులపల్లి గ్రామాల్లోనూ అధికార పార్టీ అండదండలతో దర్జాగా ఆ పార్టీ నాయకులు టెంట్లు, కుర్చీలు వేసి మరీ కోడి పందేలు ఆడించారు.
జిల్లాలో బరుల చుట్టూ టీడీపీ జెండాలు ఏర్పాటు చేసి మరీ విచ్చలవిడిగా
కోడి పందేలు
దర్శి, కొండపి, కందుకూరు, కనిగిరి
ఒంగోలు, సంతనూతలపాడు
నియోజకవర్గాల్లో యథేచ్ఛగా నిర్వహణ
ఆయా నియోజకవర్గాల ముఖ్య నాయకుల అండదండలతో చెలరేగిపోయిన వైనం
జిల్లావ్యాప్తంగా కోట్ల రూపాయల్లో పందేలు
అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు, ముడుపులకు తలొగ్గిన పోలీసులు
పైకి మాత్రం చట్టప్రకారం చర్యలు
తీసుకుంటామంటూ డ్రామాలు
బరితెగించారు..!
బరితెగించారు..!
బరితెగించారు..!
బరితెగించారు..!
బరితెగించారు..!
బరితెగించారు..!


