నిరుపయోగంగా గ్రామీణ ఆస్తులు
చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా గ్రామీణ ఆస్తులను నిర్వీర్యం చేస్తోంది. వైఎస్సార్‌సీపీ హయాంలో గ్రామాల అభివృద్ధి కోసం సమకూర్చిన ఆస్తులను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో అవి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. గ్రామ సచివాలయాల ద్వారా ప్రజల చెంతకు పాలన వచ్చింది. నాడూ–నేడుతో ప్రభుత్వ స్కూళ్లల్లో చేరేందుకు ఆసక్తి చూపించారు. మేము చదివిన పాఠశాలలను పట్టించుకోవడంలేదు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మా తముళ్లు, ఊళ్లో పిల్లలు ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లేందుకు ఇష్టపడడం లేదు..అంటూ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కొలువులు చేస్తున్న యువకులు నిట్టూరుస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా సొంతూరు గంజివారి పల్లెకు వచ్చిన యువకులు బుధవారం భోగి మంటలు వేసుకున్న తర్వాత అంతా గ్రామంలోని రచ్చబండ వద్దకు చేరుకున్నారు. గ్రామ పరిస్థితి, కుటుంబ వ్యవహారాలు చర్చించుకోవడం కనిపించింది. పంచాయతీలకు గుర్తింపు తీసుకొచ్చి సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లీనిక్‌ల కోసం రూ.కోట్లు ఖర్చుపెట్టి పక్కా భవనాలు నిర్మించి ఆ ఆస్తులు గ్రామానికి అప్పజెప్తే చంద్రబాబు ప్రభుత్వానికి కన్నుకుట్టినట్లుగా ఉందని, వాటిని నిరుపయోగంగా మార్చుతున్నారని వెన్నా వీరారెడ్డి చర్చ తీసుకొని వచ్చారు.
● రూ.45 లక్షలు ఖర్చుపెట్టి నిర్మించిన సచివాలయ భవనం ఈ నాటికి ప్రారంభోత్సవానికి నోచుకోదు. రైతు భరోసా కేంద్రంలోనే సచివాలయ ఉద్యోగులు తమ విధులు నిర్వర్తిస్తున్నారని మరో ఉద్యోగి పిచ్చిరెడ్డి అన్నారు.
● రూ.1.20 కోట్లతో నాడు–నేడు కింద జిల్లా పరిషత్ హైస్కూల్‌కు అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని అర్ధంతరంగా నిలిపేశారని, 10 తరగతి గదుల్లో విద్యను అభ్యశించాల్సిన విద్యార్థులు కేవలం 5 గదుల్లో సర్దుకుంటున్నారని, ప్రస్తుతం ఆ భవనం శిథిలావస్థకు చేరుకుంటోందని వెంకటేశ్వరరెడ్డి వాపోయారు. నియోజకవర్గ కేంద్రానికి వెళ్లే రోడ్డు అభివృద్ధికి నిధులు మంజూరైతే కేవలం టీడీపీ వర్గీయులు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో మాత్రమే అభివృద్ధి చేశారని, తమ గ్రామంలోని రోడ్డులో తట్టెడు ఇసుక వేయలేక పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మెడికల్ కాలేజీలు ప్రవేటు పరంచేయడం ఏమిటి..
పేదల ఆరోగ్యం కాపాడటంతోపాటు పేద పిల్లలు డాక్టర్లుగా ఎదిగేందుకు గత చరిత్రలో ఎక్కడా లేని విధంగా అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకొని వస్తే వాటిని ప్రైవేటు వాళ్ల చేతుల్లో పెట్టడం సరికాదని, చంద్రబాబు, ఆయన బినామీలు జేబులు నింపుకోవటానికే అని ఐటీ ఉద్యోగి శివారెడ్డి విమర్శించారు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయటానికి రూ 1700 కోట్లు ఖర్చుచేయవచ్చని, పేదల ఆరోగ్యం కాపాడేందుకు మాత్రం ప్రభుత్వం వద్ద నిధులు ఉండవని ఆయన ప్రశ్నించారు.
● రేషన్ ఇంటి వద్దకు చేర్చేలా జగనన్న వాహనాలు ఏర్పాటు చేస్తే చంద్రబాబు వాటిని ఎత్తివేసి రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలించుకునేలా చర్యలు తీసుకొని పేదల కడుపులు కాల్చుతున్నారని చెన్నకేశవరెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. తమ తల్లిదండ్రులు కాయకష్టం చేసి పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఊరు : యర్రగొండపాలెం, గంజివారి పల్లె
నిరుపయోగంగా గ్రామీణ ఆస్తులు


