సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్
చంద్రబాబు కూటమిది ప్రజా విజయం కాదు
ఈవీఎంల ట్యాంపరింగ్‌తో నెగ్గి అబ్బాకొడుకుల అరాచకం
పవన్‌కు సినిమాలపై ఉన్న మోజుప్రజా సంక్షేమంపై లేదు
టీడీపీ, జనసేన నేతలపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి ఆర్‌కే రోజా
యర్రగొండపాలెం: ‘రాష్ట్రంలో సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్ అయింది. సీఎం చంద్రబాబు రైతులకు, ఉద్యోగులకు, బడుగు బలహీన వర్గాలకు చేసిందేమీ లేద’ని మాజీ మంత్రి ఆర్‌కే రోజా విమర్శించారు. చంద్రబాబు కూటమి ప్రజల ఓట్లతో గెలవలేదని, ఈవీఎంలను గోల్‌మాల్ చేశారని ప్రజలంతా బహిరంగంగా చర్చించుకుంటున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ ఏ కార్యక్రమం తలపెట్టినా అశేష సంఖ్యలో తరలివస్తున్న జనాలే అందుకు నిదర్శనమన్నారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఎడ్ల పోటీల్లో నాలుగో రోజు బుధవారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సీఎం చంద్రబాబు నిజం మాట్లాడితే ఆయన తల వెయ్యి వక్కలవుతుందని ముని శాపం ఉందని, అందుకే నోరు తెరిస్తే అబద్ధాలే చెబుతారని ఎద్దేవా చేశారు. భోగి రోజున కూడా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, సూపర్ సిక్స్ హిట్ అయిందని, రైతుల ఆనందంలో అంతులేదని సిగ్గు లేకుండా, కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడాన్ని చూసి ప్రజలు ముక్కున వేలేసుకున్నారన్నారు.
అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్కో రైతులకు ఇప్పటి వరకు రూ 40వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.10 వేలు ఇచ్చి పంగనామం పెట్టారని విమర్శించారు. పంటలు పండించేందుకు యూరియా ఇవ్వకుండా, తంటాలు పడి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కనీయకుండా చేస్తే రైతులు ఏ విధంగా సంతోషంగా ఉంటారని ఆమె ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ హయాంలోనే రైతులు సుభిక్షంగా ఉన్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అడుగుపెడితే అక్కడే తాను పుట్టానని చెప్పుకొనే పవన్‌కల్యాణ్‌కు తన సినిమాలపై ఉన్న మోజు ప్రజా సంక్షేమంపై లేదన్నారు. అనంతరం నియోజకవర్గ స్థాయి ముగ్గుల పోటీల విజేతలకు ఆమె బహుమతులు అందజేశారు. ముందుగా మాజీ మంత్రి సాకె శైలజనాథ్, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ఐటీ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు పి.సునీల్ రెడ్డి, అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి చింతలపూడి అశోక్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి వెన్నా హనుమారెడ్డి, శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ మాజీ సభ్యురాలు డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ, ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు దొండేటి నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేలాది మంది ప్రజలు హాజరై పోటీలు తిలకించారు.
సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్


