విద్య, వైద్యం ప్రభుత్వమే కదా నిర్వహించాలి.. | - | Sakshi
Sakshi News home page

విద్య, వైద్యం ప్రభుత్వమే కదా నిర్వహించాలి..

Jan 15 2026 1:36 PM | Updated on Jan 15 2026 1:36 PM

విద్య, వైద్యం ప్రభుత్వమే కదా నిర్వహించాలి..

విద్య, వైద్యం ప్రభుత్వమే కదా నిర్వహించాలి..

విద్య, వైద్యం ప్రభుత్వమే కదా నిర్వహించాలి..

ఊరు : మార్కాపురం పట్టణం

సంక్రాంతి పండుగకు తెలంగాణ, కర్నాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి తమ సొంత పట్టణమైన మార్కాపురానికి వచ్చారు. ఇంట్లో వారితో సరదాగా గడిపి బుధవారం ఉదయం అందూ పట్టణంలోని తూర్పువీధిలో ఉన్న వైఎస్సార్‌ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఎలా ఉన్నావ్‌.. మామా... ఎలా ఉన్నావ్‌ బాబాయ్‌.. తమ్ముడూ బాగున్నావా..! అంటూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. కొంత సేపు పాత కబుర్లు మాట్లాడుకుని ఆ తర్వాత మార్కాపురం మెడికల్‌ కాలేజీ, వెలుగొండ ప్రాజెక్టుపై చర్చకు వచ్చింది. వారి మాటల్లో...

బాలకృష్ణారెడ్డి : ఎరా...! అల్లుడూ ఎలా ఉన్నావ్‌.. హైదరాబాదులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం ఎలా ఉంది. ఇప్పుడంతా లేఆఫ్‌లు అంటున్నారు కదా.. నీకేమీ ప్రాబ్లం లేదు కదా అంటూ మాటల్లో ఈ మధ్య మార్కాపురం శివారులో కట్టిన మెడికల్‌ కాలేజీని ప్రభుత్వం నిర్వహించకుండా ప్రైవేటు వారికి అప్పజెప్పిందట నిజమేనా..?

కొండారెడ్డి : అవును.. మావా..! నేను కూడా ఈ మధ్య మార్కాపురం వచ్చినప్పుడు మెడికల్‌ కాలేజీ వద్దకు ప్రజలు తండోపతండాలుగా వెళ్తున్నారు. ఎంటా అని ఆరా తీస్తే ప్రభుత్వం మెడికల్‌ కాలేజీని ప్రైవేటు వారికి ఇచ్చిందట. ప్రభుత్వమే నిర్వహించాలని వారు కోరుతూ పెద్దఎత్తున మెడికల్‌ కాలేజీ వద్దకు వెళ్లి నిరసన తెలుపుతున్నారట. విద్య,వైద్యం ప్రభుత్వం ఉచితంగా అందించాలి కదా..!

విష్ణువర్ధన్‌రెడ్డి, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి: అన్నా... నువ్‌ చెప్పింది నిజమే ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అలాంటి బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకోకూడదు. ప్రభుత్వమే వైద్య కళాశాలలను నిర్మించి ఉచితంగా పేదలకు వైద్యం అందించాలి. లేదంటే మళ్లీ ఉచిత వైద్యం కోసం మనవాళ్లు గుంటూరు, ఒంగోలు వెళ్లాలంటే చాలా కష్టపడాలి. ప్రభుత్వమే మెడికల్‌ కాలేజీని నిర్వహించాలి.

వెంకటేశ్వర రెడ్డి, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి : కరెక్టే అన్నా.. ! ఇప్పటికే కాలేజీ నిర్మాణం చాలావరకూ జరిగింది. మిగిలిన నిర్మాణాన్ని ప్రభుత్వమే చేపడితే బాగుంటుంది.

గొలమారి శ్రీనివాసరెడ్డి : ఏరా..! అల్లుళ్లూ.. బాగున్నార్రా..! మెడికల్‌ కాలేజీని ప్రభుత్వమే నిర్వహించాలని మన ఏరియా వారందరూ పెద్దఎత్తున ఉద్యమాలు చేశారు. మీరు కూడా సోషల్‌ మీడియాలో, వాట్సప్‌ల్లో, మార్కాపురం గ్రూపుల్లో చూసే వుంటారు కదా.. ప్రభుత్వమే మెడికల్‌ కళాశాలను నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నాము. దీనితోపాటు వెలుగొండ ప్రాజెక్టు నీళ్లు కూడా త్వరగా వదలాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము.

హేమంత్‌ రెడ్డి, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి: అవును.. బాబాయ్‌..! వెలుగొండ నీళ్లు వస్తేనే ఈ ప్రాంతంలో తాగునీటి సమస్య పూర్తిగా తీరిపోతుంది. ఇప్పుడు మనకు నాలుగు లేదా ఐదురోజులకొకసారి సాగర్‌ నీటిని ఇస్తున్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే ప్రతిరోజూ తాగునీరు వస్తుంది. ఈ ప్రాంతంలో ఫ్లోరిన్‌ నీరు ఎక్కువగా ఉండటంతో చాలామంది మోకాళ్ల నొప్పులు, కీళ్ల వాతంతో ఇబ్బంది పడుతున్నారు.

బాలక్రిష్ణారెడ్డి : మేము కూడా ప్రభుత్వాన్నికోరేది అదే..! అటు మెడికల్‌ కాలేజీని ప్రభుత్వమే కట్టడం.. ఇటు వెలుగొండ ప్రాజెక్టు నీటిని అందించాలని కోరుకుంటున్నాము. ప్రభుత్వమేమో అభివృద్ధి బాగా జరుగుతోందంటోంది. ఇక్కడేమో పరిస్దితి మరోలా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement