హోరా హోరీగా బండలాగుడు పోటీలు
అర్థవీడు (కంభం): మండలంలోని నాగులవరం గ్రామంలో శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలను మార్కాపురం మాజీ ఎమ్మెల్యే, గిద్దలూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ కేపీ నాగార్జునరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. పోటీల్లో రాచర్ల మండలం ఆకవీడుకు చెందిన సూరా పూజితరెడ్డి ఎడ్లు 4500 అడుగుల దూరం బండలాగి ప్రథమస్థానంలో నిలిచి సత్తాచాటాయి. అక్కలరెడ్డి పల్లికి చెందిన కూతుళ్ల దక్షితరెడ్డి ఎడ్లు 4223 అడుగులు లాగి ద్వితీయ స్థానం, కంభం మండలం ఎల్‌కోటకు చెందిన ఉలవల హరికృష్ణ ఎడ్లు 4080 అడుగులు లాగి తృతీయ స్థానం, అర్థవీడు మండలం గన్నేపల్లికి చెందిన డి.ఖాసింవలి ఎడ్లు 4059 అడుగులు లాగి నాల్గవ స్థానం, గన్నేపల్లికి చెందిన భూపని గురవయ్య ఎడ్లు 3726 అడుగులు లాగి ఐదో స్థానం, కనిగిరికి చెందిన సానికొమ్ము శ్రీనివాసరెడ్డి ఎడ్లు 3 వేల అడుగులు లాగి ఆరో స్థానంలో నిలిచాయి. విజేతలకు బహుమతుల కింద రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు అందజేశారు. దండుగ వెంకటరెడ్డి, పిడుగు రవికుమార్‌రెడ్డి, రామిరెడ్డి నారాయణరెడ్డి, బాలసుబ్బారెడ్డి, తదితరులు బహుమతులకు ఆర్థిక సహకారం అందించారు.


