అన్యాయంగా ఇల్లు కూల్చారు
● లబోదిబోమంటున్న బాధిత మహిళ
కొనకనమిట్ల: ఓ మహిళ గ్రామ కంఠం భూమిలో ఐదేళ్ల క్రితం వేసుకున్న రేకుల షెడ్‌ను టీడీపీ నాయకులు నిర్ధాక్షిణ్యంగా కూల్చివేసిన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. కొనకనమిట్ల మండలం చినారికట్ల బీసీ కాలనీకి చెందిన బరిగే తిరుపతమ్మ గ్రామ పెద్దల సహకారంతో గ్రామ కంఠం భూమిలో రేకుల షెడ్ ఏర్పాటు చేసుకుని కుమార్తెతో కలిసి నివాసం ఉంటోంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ భూమిపై కన్నేసిన టీడీపీ నాయకుడు బరిగె బాలయ్య ప్రోద్బలంతో అతని అనుచరులు బరిగే భగవాన్, గడ్డి తిరుపతయ్య, కుమ్మరి ఏడుకొండలు, గోసుల చినవెంకటయ్య రేకుల షెడ్ ఖాళీ చేయాలంటూ బెదిరిస్తూ వస్తున్నారు. శనివారం తిరుపతమ్మ లేని సమయంలో రేకుల షెడ్ కూల్చివేశారు. రేకులు, కర్రలను చిల్లచెట్లలో పడేశారు. ఇంట్లో సామగ్రి బయటపడేసి, బయట ఉన్న చెత్తకు నిప్పు పెట్టారు. ఆమెకు జీవనాధారమైన కుట్టు మిషన్‌ను విసిరికొట్టడంతో అది పనికిరాకుండా పోయింది. ఇల్లు కూల్చివేతపై ప్రశ్నిస్తే దాడి చేసేందుకు యత్నించారని తిరుపతమ్మ వాపోయింది. ఆ స్థలంలో అప్పటికప్పుడు వాల్మీకి మహర్షి బ్యానర్ ఏర్పాటు చేసి, చిత్ర పటాలు పెట్టడం గమనార్హం. టీడీపీ నేతల దుశ్యర్యపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. ఇదిలా ఉండగా గ్రామ కంఠం భూమి తమదని, ఖాళీ చేయాలంటూ గత ఏడాది నవంబర్‌లో పొదిలికి చెందిన నూతలపాటి లక్ష్మీప్రసూనాంబ కోర్టు ద్వారా తిరుపతమ్మకు నోటీసులు పంపారు. గ్రామ కంఠం భూమిపై కన్నేసి, దారుణానికి ఒడిగట్టారని బాధిత మహిళ ఆరోపించారు. రెండు రోజులుగా హైస్కూల్లో తలదాచుకుంటున్నట్లు ఆమె వాపోయింది.
అన్యాయంగా ఇల్లు కూల్చారు


