లోకేష్ పర్యటనలో ఏరులై పారిన మద్యం
పీసీపల్లి: మండల పరిధిలోని దివాకరపల్లి గ్రామంలో కంప్రెస్డ్ బయో గ్యాస్‌ప్లాంట్ భూమి పూజకు మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. అయితే లోకేష్ పర్యటన సందర్భంగా స్థానిక నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. కార్యక్రమానికి ఎవ్వరూ రారన్న ఉద్దేశంతో మద్యాన్ని ఏరులై పారించారు. ఇక మహిళలను కార్యక్రమానికి తరలించేందుకు నానా పాట్లు పడ్డారు. కార్యక్రమానికి వస్తే డ్వాక్రా మహిళలకు రాయితీ రుణాలిస్తామని మభ్యపెట్టారు. ఉపాధి కూలీలు పనికి వెళ్లకుండా కార్యక్రమానికి వస్తే మస్టర్ వేస్తామని నమ్మబలికారు. తీరా కార్యక్రమం ప్లాంట్ శంకుస్థాపన అని తెలియడంతో డ్వాక్రా మహిళలు మండిపడ్డారు. రాయితీ రుణాలంటే ఇక్కడకు వచ్చామని, లేదంటే ఈ కొండల్లో మాకేంటి పనంటూ రుసరుసలాడుతూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇక విచ్చలవడిగా మద్యం సరఫరా చేయడంతో మందుబాబులు తాగి సభా ప్రాంగణంలోనే పడిపోయారు. కార్యక్రమానికి ప్రజలను తరలించేందుకు స్కూల్, కాలేజీ బస్సులను వినియోగించారు. అయితే చాలా వాహనాలు ప్రజలు లేకుండానే వచ్చాయి.
లోకేష్ పర్యటనలో ఏరులై పారిన మద్యం


