● రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వీరపాండ్యన్
ఒంగోలు సిటీ: ప్రతి ఆరోగ్య కార్యకర్త గర్భిణులను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి రిజిస్టర్ చేసి సకాలంలో మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వీరపాండ్యన్ ఆదేశించారు. రాష్ట్రంలో అమలవుతున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై జిల్లా వైద్యారోగ్య శాఖాధికారులు, ప్రోగ్రాం అధికారులకు గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆయన మాట్లాడారు. స్కూల్ పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేసి వేసవిలో వ్యాధుల బారి నుంచి కాపాడుకోవాలని సూచించారు. పలు అంశాలపై సమీక్షించారు. ప్రతి ఆరోగ్య కార్యకర్త, సీహెచ్‌ఓ రక్తహీనతతో బాధపడుతున్న వారికి సరైన చికిత్స అందిస్తే మాతృమరణాలు నివారించవచ్చని తెలిపారు. 5 సంవత్సరాల్లోపు పిల్లలు బరువు తక్కువగా ఉంటే గుర్తించి న్యూట్రీషన్ రీహాబిలిటేషన్ సెంటర్‌కు రిఫర్ చేసి శిశుమరణాలు నివారించాలని ఆదేశించారు. పుట్టిన ప్రతి బిడ్డకు నిర్దేశించిన అన్ని టీకాలు సకాలంలో వేసి ఆ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న పిల్లలకు రాష్ట్ర బాల సురక్ష కార్యక్రమం ద్వారా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. వేసవి నేపథ్యంలో వడదెబ్బ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఓఆర్‌ఎస్ ద్రవం తయారు చేసుకోవడం గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఽఖాధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు, డాక్టర్ పి.పద్మజ, డాక్టర్ సౌజన్య, డాక్టర్ వాణిశ్రీ, డాక్టర్ శ్రీవాణి, డాక్టర్ శ్రవణ్, డాక్టర్ హేమంత్, చల్లా ప్రభాకర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.