
రీసర్వేపై సమావేశం నిర్వహిస్తున్న జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు
● జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు
ఒంగోలు అర్బన్: జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంలో భాగంగా చేపట్టిన రీ సర్వే నిర్దేశించిన గడువులో పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ప్రకాశం భవనంలో రీ సర్వేపై సమావేశం నిర్వహించారు. దీనిలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మూడో విడత రీ సర్వేలో వీఎస్ లాగిన్ వరకు సకాలంలో 130 గ్రామాలు పూర్తి చేయడం అభినందనీయమని అధికారులను అభినందించారు. అదే స్ఫూర్తితో మిగిలిన ప్రక్రియ ఈ నెలలో పూర్తి చేయాలని సూచించారు. రీ సర్వేలో వచ్చిన అర్జీలతో పాటు జేకేసీలో వచ్చిన అర్జీలు పరిష్కరించి ఈకేవైసీ పెండింగ్ లేకుండా చూడాలన్నారు. దీనిలో జిల్లా సర్వే అధికారి కిషోర్‌బాబు, పరిశీలకులు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌లు, సర్వేయర్లు పాల్గొన్నారు.
నేడు ఏపీ ఫెన్సింగ్ జిల్లా స్థాయి క్రీడాజట్ల ఎంపిక
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక మినీ స్టేడియంలో ఫెన్సింగ్ జిల్లా క్రీడాజట్ల ఎంపిక నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ ముఖ్య కార్యదర్శి జి.నవీన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 4 గంటలకు ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. సబ్‌జూనియర్ (అండర్ 14), క్యాడెట్ (అండర్ 17) బాలబాలికల విభాగాల్లో ఈ జట్ల ఎంపిక ఉంటుందన్నారు. సబ్ జూనియర్ విభాగంలో పాల్గొనదలచినవారు 2010 జనవరి 1వ తేదీ తరువాత, క్యాడెట్ విభాగంలో పాల్గొనదలచిన వారు 2007 జనవరి 1వ తేదీ మొదలు 2010 నవంబరు 30వతేదీ మధ్య జన్మించిన వారు మాత్రమే అర్హులు. ఈ పోటీలకు వచ్చే ఫెన్సింగ్ క్రీడాకారులు ఫెన్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గుర్తింపు కార్డు, ఆధార్‌కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, సొంత ఫెన్సింగ్ కిట్‌తో హాజరుకావాలన్నారు. పూర్తి వివరాలకు సెల్: 7993790364, 7671991147 నెంబర్లను సంప్రదించగలరు.
ఐఎంఏ అధ్యక్షురాలిగా డాక్టర్ ఝాన్సీ
ఒంగోలు టౌన్: ఒంగోలు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) నూతన అధ్యక్షురాలిగా డాక్టర్ ఝాన్సీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక ఐఎంఏ కార్యాలయంలో శనివారం నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. కార్యదర్శిగా డాక్టర్ ఈ.శ్రావణి, కోశాధికారిగా డాక్టర్ శ్రీదేవి ఎన్నికయ్యారు. సమన్వయకర్తగా డాక్టర్ జాలాది మణిబాబును ఎన్నుకున్నారు. నూతన కమిటీ వివరాలను ఎన్నికల అధికారిగా వ్యవహరించిన డాక్టర్ మన్నే వీరయ్య చౌదరి ప్రకటించారు. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ నల్లూరి రాఘవరావు, డాక్టర్ రావిపాటి జయశేఖర్ నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డా.రంగనాథ్ బాబు, డా.కోటిరెడ్డి పాల్గొన్నారు. కార్యవర్గంలో ప్రధాన పదవులకు మహిళలను ఎన్నుకోవడం విశేషం. ఈ ఎన్నికలు రాష్ట్రంలో ఎందరికో స్ఫూర్తినిస్తాయని పలువురు వైద్యులు పేర్కొన్నారు. నూతన కమిటీని నగరంలోని పలువురు వైద్యులు అభినందించారు.

ఐఎంఏ నూతన కమిటీకి నియామక పత్రాలు అందజేస్తున్న డా.నల్లూరి రాఘవులు, డా.జయశేఖర్

డాక్టర్ ఝాన్సీ
Comments
Please login to add a commentAdd a comment