తప్పు చేసినోళ్లు.. ఎక్కడున్నా వదలం: వైఎస్‌ జగన్‌ | YSRCP President YS Jagan Warns TDP Leaders And Supporting Police Officers, Full Speech Highlights Inside | Sakshi
Sakshi News home page

తప్పు చేసినోళ్లు.. ఎక్కడున్నా వదలం: వైఎస్‌ జగన్‌

Feb 19 2025 4:22 AM | Updated on Feb 19 2025 10:02 AM

YSRCP President YS Jagan Warns TDP Leaders and Supporting Police Officers

మీడియాతో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌. చిత్రంలో వంశీ సతీమణి పంకజశ్రీ, మాజీ మంత్రి పేర్ని నాని

టీడీపీకి కొమ్ముకాసే పోలీసు అధికారులు, ఆ పార్టీ నేతలకు వైఎస్‌ జగన్‌ హెచ్చరిక

వారు రిటైరైనా వదిలిపెట్టం.. సప్త సముద్రాల ఆవల ఉన్నా రప్పించి చట్టం ముందు నిలబెడతాం

పోలీసులూ.. మూడు సింహాలకు సెల్యూట్‌ చేయండి.. టీడీపీ నాయకులకు కాదు.. 

పోలీసులు సుమోటోగా పెట్టిన కేసుల్లో ఎక్కడా వల్లభనేని వంశీ పేరు లేదు 

వంశీ అరెస్టు వెనుక పోలీసులతో కలసి చంద్రబాబు, లోకేశ్‌ కుట్రలు 

ఆయన సామాజిక వర్గంలో మరెవరూ లీడర్లుగా ఎదగకూడదు.. అందుకే వంశీ, కొడాలి నానిపై చంద్రబాబుకు దుగ్ధ  

అక్రమ కేసులో అరెస్టై విజయవాడలోని జైలులో ఉన్న వంశీని పరామర్శించిన వైఎస్‌ జగన్‌

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసేటప్పుడు తాను ఏడాదిన్నర తర్వాత రిటైర్‌ అవుతానని సీఐ అన్నాడట..! రిటైర్‌ అయినా.. సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా.. మొత్తం అందరినీ పిలిపిస్తాం.. చట్టం ముందు నిలబెడతాం. న్యాయం జరిగేటట్లు చేస్తాం.

2023లో పోలీసులు సత్యవర్థన్‌ నుంచి రికార్డు చేసిన 161 స్టేట్‌ మెంట్‌లోనూ వంశీ పేరు లేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక రెండోసారి తీసుకున్న 161 స్టేట్‌మెంట్‌లోనూ తనను ఎవరూ దూషించలేదని, టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో వంశీ లేడని సత్యవర్థన్‌ స్పష్టంగా చెప్పాడు. న్యాయమూర్తి ముందు హాజరైనప్పుడూ అదే విషయాలను చెప్పాడు.దీంతో ఆయన కుటుంబ సభ్యులను బెదిరించి.. తప్పుడు ఫిర్యాదు ఇప్పించి కేసు పెట్టారు. వంశీని తెల్లవారుజామున అరెస్ట్‌ చేస్తే.. అదే రోజు సాయంత్రం సత్యవర్థన్‌ స్టేట్‌మెంట్‌ నమోదు చేసి బలవంతంగా పేరు చెప్పించారు.  

చంద్రబాబు పాలనలో ప్రతి కేసూ ఇల్లీగలే... ప్రతి కేసులోనూ వీరే బెదిరిస్తారు.. మళ్లీ తిరిగి తమను బెదిరిస్తున్నారంటూ తప్పుడు కేసులు పెడతారు. అసలు ఎవరు.. ఎవరిని బెదిరిస్తున్నారు? రాజకీయ నేతలతోపాటు పారిశ్రామికవేత్తలనూ వదిలిపెట్టడం లేదు. ప్రతి ఒక్కరినీ వీరే బెదిరిస్తూ అవతలి వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇవన్నీ ఊరికే పోవు. వారికి తప్పకుండా చుట్టుకుంటాయి. అప్పుడు వారి పరిస్థితి అతి దారుణంగా తయారవుతుంది.. 
– మీడియాతో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసులను వదిలిపెట్టేది లేదని.. వారు ఎక్కడున్నా తీసుకొచ్చి బట్టలు ఊడదీసి చట్టం ముందు నిలబెడతామని వైఎస్సార్‌సీపీ(YSRCP)అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) హెచ్చరించారు. అన్యాయం చేసిన అధికారులు, నాయకులు ఎవరినీ వదిలి పెట్టబోమన్నారు.  ‘మీ టోపీలపై కనిపించే మూడు సింహాలకు సెల్యూట్‌ చేయండి..! టీడీపీ నాయకులకు కాదు..! మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి..’ అని పోలీసులకు హితవు పలికారు. ‘టీడీపీ నాయకులు ఆడించినట్లల్లా ఆడుతూ అన్యాయాలు చేస్తే.. ఎల్లకాలం ఆ ప్రభుత్వమే ఉండదని గుర్తుంచుకోండి..! రేపు మేం అధికారంలోకి వస్తాం.. అన్యాయం చేసిన అధికారులు, నాయకులను చట్టం ముందు నిలబెడతా..’ అని హెచ్చరించారు. 

అక్రమ కేసులో అరెస్టై విజయవాడలోని జిల్లా జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైఎస్‌ జగన్‌ మంగళవారం పరామర్శించారు. వంశీ సతీమణి పంకజశ్రీతో కలిసి జైలు లోపలికి వెళ్లారు. పార్టీ సీనియర్‌ నేతలు, నాయకులెవరినీ జైలు అధికారులు లోపలకు అనుమతించలేదు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను సైతం బయటే నిలువరించారు. మరోవైపు పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు తరలి రావడంతో జైలు పరిసరాలు కిక్కిరిసిపోయాయి. వారందరినీ పోలీసులు చాలా దూరంలోనే అడ్డుకున్నారు. వల్లభనేని వంశీని పరామర్శించిన అనంతరం జైలు బయట వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, కూటమి సర్కారు కక్ష సాధింపు చర్యలను సాక్ష్యాధారాలతో ఎండగట్టారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..  

విజయవాడ గాందీనగర్‌లో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ను చూడడానికి తరలివచ్చిన అశేష జనసందోహంలో ఓ భాగం  

వంశీ ఏ తప్పూ చేయకున్నా.. 
వల్లభనేని వంశీని అరెస్ట్‌ చేసిన తీరు, ఆయన మీద పెట్టిన తప్పుడు కేసు రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు అద్దం పడుతోంది. వంశీని అరెస్ట్‌ చేసిన తీరు ఒకసారి గమనిస్తే.. అత్యంత దారుణంగా లా అండ్‌ ఆర్డర్‌ బ్రేక్‌ డౌన్‌ కనిపిస్తోంది. ఈ కేసులో గన్నవరం టీడీపీ కార్యాలయంలో దాడి జరిగిందని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్థన్‌ అనే వ్యక్తి గన్నవరం టీడీపీ(TDP) ఆఫీస్‌లో పని చేస్తున్నారు. ఆ వ్యక్తి సాక్షాత్తూ తానే న్యాయమూర్తి సమక్షంలో వాంగ్మూలం ఇచ్చారు. వంశీ ఎలాంటి తప్పు చేయలేదని అందులో ఆయన చెప్పినప్పటికీ తప్పుడు కేసు బనాయించారు.  

మేం ఏనాడూ ఏకపక్షంగా వ్యవహరించలేదు..  
2023 ఫిబ్రవరి 19న మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో పట్టాభి అనే వ్యక్తితో వంశీని భరించలేని విధంగా చంద్రబాబు బూతులు తిట్టించారు. ‘వాడో పిల్ల సైకో. నేనే గన్నవరం వెళ్తా.. ఎవడేం పీకుతాడో చూస్తా... ఆ వంశీ సంగతి చూస్తా... నియోజకవర్గం నుంచి బయటకు విసిరేస్తా..’ అని పట్టాభి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. మర్నాడు ఫిబ్రవరి 20న కూడా అదే పట్టాభిని చంద్రబాబు గన్నవరం పంపాడు. అక్కడ పట్టాభి మళ్లీ ప్రెస్‌మీట్‌ పెట్టి వంశీని తిట్టాడు. అంతేకాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పోగేసిన మనుషులను వెంట బెట్టుకుని పట్టాభి ఒక ప్రదర్శనగా వైఎస్సార్‌సీపీ ఆఫీస్‌పై దాడికి బయలుదేరాడు. 

వైఎస్సార్‌సీపీ ఆఫీస్‌ వద్దకు చేరుకుని అక్కడ శీనయ్య అనే దళిత సర్పంచ్‌పై దాడి చేశారు. దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన గన్నవరం సీఐ కనకారావుపైనా వారు దాడి చేయడంతో ఆయన తల పగిలింది. ఆయన కూడా దళిత సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. టీడీపీ వారు పెద్ద సంఖ్యలో దాడికి సిద్ధం కావడంతో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతిఘటించేందుకు గట్టిగానే ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఇరువైపుల వారిపై కేసులు నమోదు చేశారు. నిజానికి ఆ రోజు మా ప్రభుత్వం ఉన్నప్పటికీ ఎక్కడా ఏకపక్షంగా వ్యవహరించలేదు. పోలీసుల చర్యలను అడ్డుకోలేదు. కేసు నుంచి బయటపడే ప్రయత్నమూ చేయలేదు. 

ఎక్కడా వంశీ ప్రమేయం, పేరు లేకున్నా
వైఎస్సార్‌సీపీ ఆఫీస్‌పై దాడికి ప్రయత్నించిన టీడీపీ నేతలు మూడు ఫిర్యాదులు చేయడంతో పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేశారు. అయితే వాటిలో ఎక్కడా వంశీ పేరు లేదు. ఆ ఫిర్యాదుల్లోనూ, పోలీసులు సుమోటోగా పెట్టిన కేసుల్లోనూ ఎక్కడా వల్లభనేని వంశీ పేరు లేదు. కారణం.. ఆ ఘటన జరిగినప్పుడు వంశీ అక్కడ లేరు. అది జరిగిన రెండు రోజుల తర్వాత గన్నవరం టీడీపీ ఆఫీస్‌లో డీటీపీ ఆపరేటర్‌గా పని చేస్తున్న సత్యవర్థన్‌ అనే దళిత యువకుడిని మంగళగిరిలోని తమ కార్యాలయానికి చంద్రబాబు మనుషులు పిలిపించారు. సత్యవర్థన్‌తో తెల్ల కాగితంపై సంతకం తీసుకుని మరో ఫిర్యాదు ఇప్పించారు. దాని ఆధారంగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. అయితే ఆ కేసులో కూడా వంశీ పేరు లేదు. 2023 ఫిబ్రవరి 23న పోలీసులు సత్యవర్థన్‌ నుంచి 161 స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. అందులోనూ వంశీ పేరు, ప్రసావన లేదు.  



టార్గెట్‌ వంశీ... కేసు రీ ఓపెన్‌ 
టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే వంశీని టార్గెట్‌ చేయడం మొదలుపెట్టారు. 2024 జూలై 10న ఆ కేసును రీ ఓపెన్‌ చేశారు. ఆశ్చర్యం కలిగించే మరో విషయం ఏమిటంటే.. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇదే సత్యవర్థన్‌తో రెండోసారి 161 స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు. అయితే అందులో కూడా తనను ఎవరూ దూషించలేదని, టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో వల్లభనేని వంశీ లేడని ఆయన స్పష్టంగా చెప్పాడు. ఆ ఘటన జరుగుతున్నప్పుడు తాను అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తొలి స్టేట్‌మెంట్‌లో చెప్పిందే రిపీట్‌ చేశాడు. 

అయినా సరే.. చంద్రబాబు ఆక్రోశం, కోపం ఏ స్థాయిలో ఉందంటే.. ఎలాగైనా సరే వంశీని ఈ కేసులో ఇరికించాలని, ఘటనా స్థలంలో లేకపోయినా కూడా ఆయన్ను ఈ కేసులో 71వ నిందితుడిగా చేర్చారు. అయితే ఆ కేసులోవి బెయిలబుల్‌ సెక్షన్లు కావడంతో ముందస్తు బెయిల్‌ కోసం అప్పటికే వంశీ హైకోర్ట్‌ను ఆశ్రయించారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ వంశీకి బెయిల్‌ రాకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు ఈ కుట్రను మరింత ముందుకు తీసుకెళ్లారు. గన్నవరం టీడీపీ ఆఫీస్‌ను తగలబెట్టే ప్రయత్నం చేశారంటూ మరో తప్పుడు కేసు నమోదు చేశారు. 

నిజానికి అలాంటిది జరగకపోయినా చంద్రబాబు కట్టుకథ అల్లారు. ఎందుకంటే.. ఆ ఆఫీస్‌ భవనం యజమానులు ఎస్సీ, ఎస్టీలైతే  వారితో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించవచ్చని భావించి ఆ భవనం అదే సామాజిక వర్గానికి చెందిన వారిదంటూ దొంగ వాంగ్మూలం కూడా ఇచ్చేశాడు. వాస్తవానికి టీడీపీ ఆఫీస్‌ను ఎవరూ తగలబెట్టే ప్రయత్నం చేయలేదు. ఆ బిల్డింగ్‌ కూడా చంద్రబాబుకు సంబంధించిన కడియాల సీతారామయ్య అనే వ్యక్తికి చెందినది. అంటే వంశీపై ఎస్సీ, ఎస్టీ కేసు బనాయించి బెయిల్‌ కూడా రాకూడదని చేసిన కుట్ర ప్రయత్నమిది అని అర్థమవుతోంది.   

కుట్రతో బెయిల్‌నూ అడ్డుకుంటున్నారు
మొత్తం 94 మందిపై కేసు పెడితే, నెలల తరబడి వైఎస్సార్‌సీపీ వారిని వేధించేందుకు ఇంకా 44 మందికి బెయిల్‌ రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారు. ఆ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్థన్‌ మేజి్రస్టేట్‌ ముందు హాజరై వాంగ్మూలం ఇస్తే వారికి కూడా బెయిల్‌ వస్తుందనే ఆందోళనతో చంద్రబాబు, పోలీసులు కలిసి కుట్ర పన్నారు. ఇందులో భాగంగానే సత్యవర్థన్‌కు 20 సార్లు కోర్టుకు హాజరు కావాలంటూ సమన్లు ఇచ్చినా.. ప్రతిసారీ దాటవేస్తూ కోర్టుకు రాలేదు. 

చివరకు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేయడంతో సత్యవర్థన్‌ తనంతట తానే న్యాయమూర్తి ముందు హాజరయ్యాడు. గతంలో తాను పోలీసులకు ఏదైతే స్టేట్‌మెంట్‌ ఇచ్చాడో.. అదే విషయాలను చెప్పారు. ఘటన జరిగిన సమయంలో తాను లేనని, తనను ఎవరూ కులం పేరుతో దూషించలేదని స్పష్టం చేశాడు. అసలు ఈ కేసుతో తనకు సంబంధం లేదని కోర్టుకు మొర పెట్టుకున్నాడు.

ప్రజాస్వామ్యం ఖూనీ..
ఇవాళ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పట్టపగలే ఖూనీ అవుతోంది. పిడుగురాళ్ల మునిసిపాలిటీలో మొత్తం 33 కౌన్సిలర్‌ స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలుచుకుంటే.. సోమవారం జరిగిన ఉప ఎన్నికలో ఒక్క సభ్యుడు కూడా లేని టీడీపీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పీఠాన్ని దక్కించుకుంది. టీడీపీకి సంఖ్యా బలం లేకున్నా.. ఒక్క సభ్యుడు కూడా లేకున్నా ఏమాత్రం సిగ్గు లేకుండా తామే ఆ ఎన్నికలో గెల్చామని చెప్పుకుంటోంది. చంద్రబాబు హయాంలో పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోయి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారో చెప్పడానికి ఇది నిదర్శనం.

తిరుపతి కార్పొరేషన్‌లోని 49 డివిజన్లలో 48 చోట్ల వైఎస్సార్‌సీపీ గెలుపొందగా కేవలం ఒక్క డివిజన్‌లో మాత్రమే టీడీపీ నెగ్గింది. అలాంటి చోట.. పోలీసుల ఆధ్వర్యంలో కార్పొరేటర్లను కిడ్నాప్‌ చేసి డిప్యూటీ మేయర్‌ పీఠాన్ని సాధించామని టీడీపీ గొప్పగా చెప్పుకుంటోంది. దీన్నిబట్టి అక్కడ కూడా పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోయారో అర్థం చేసుకోవచ్చు. 

⇒ తుని మున్సిపాలిటీలో మొత్తం 30 స్థానాలను వైఎస్సార్‌సీపీ గెల్చుకుంది. మరి అలాంటి చోట టీడీపీ వైస్‌ ఛైర్మన్‌ పదవిని ఎలా గెల్చుకుంటుంది? అక్కడ దౌర్జన్యం చేసి వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను తీసుకెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో చివరికి టీడీపీ ఒత్తిడితో ఎన్నికనే వాయిదా వేయించారు. అంటే వారికి అనుకూల పరిస్థితి వచ్చే వరకు ఆ ఎన్నిక జరపరు.  

పోలీసులతో కలసి తండ్రీ కుమారుల కుట్ర..
తన తల్లితో కలిసి ఆటోలో కోర్టుకు వచ్చానని, తన స్టేట్‌మెంట్‌ వెనక ఎవరి బలవంతమూ లేదని సత్యవర్థన్‌ మొన్న.. ఫిబ్రవరి 10న న్యాయమూర్తి ఎదుట స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. దీంతో మనశ్శాంతి కరువైన చంద్రబాబు, లోకేశ్‌ మళ్లీ పోలీసులతో కలసి కుట్ర పన్నారు. అందులో భాగంగా ఆ మర్నాడే.. సత్యవర్థన్‌ కోర్టును తప్పుదోవ పట్టించడంతో పాటు తప్పుడు వాంగ్మూలం ఇచ్చాడంటూ ఫిబ్ర­వరి 11న విజయవాడ పటమట పీఎస్‌లో ఆయనపై ఒక ఎఫ్‌ఐఆర్‌ పెట్టి కుటుంబ సభ్యులను బెదిరించారు. 

ఆ వెంటనే ఫిబ్రవరి 12న.. సత్యవర్థన్‌ వద్ద ఉన్న రూ.20 వేలు లాక్కుని అతడిని కిడ్నాప్‌ చేశారని, దాన్ని ఎవరో చూసి తనకు చెప్పారంటూ సత్యవర్థన్‌ అన్నతో పోలీసులకు ఒక ఫిర్యాదు ఇప్పించి వెంటనే కేసు రిజిస్టర్‌ చేశారు. ఇక ఆ మర్నాడు.. ఫిబ్రవరి 13 తెల్లవారుజామున వల్లభనేని వంశీని అరెస్ట్‌ చేశారు. అదే రోజు సాయంత్రం సత్యవర్థన్‌ స్టేట్‌మెంట్‌ నమోదు చేశారు. అందులో వంశీ పేరు చెప్పించారు. అంటే.. ఎవరైతే కిడ్నాప్‌ అయ్యారని చెబుతున్నారో అతడి నుంచి ఎలాంటి స్టేట్‌మెంట్‌ తీసుకోకుండానే వంశీని తెల్లవారుజామునే అరెస్ట్‌ చేశారు. 

ఆ సాయంత్రం తాపీగా సత్యవర్థన్‌ స్టేట్‌మెంట్‌ నమోదు చేశారంటే ఎంత కుట్రపూరితంగా ఈ అరెస్ట్‌ జరిగిందో అర్థమవుతోంది. ఒక మనిషి తప్పు చేస్తే.. అతడిని శిక్షిస్తే పోలీసులకు గౌరవం ఉంటుంది. కానీ ఈరోజు రాష్ట్రంలో తమకు నచ్చని వారిపై దొంగ సాక్ష్యాలు సృష్టించి, దొంగ కేసులు పెట్టి నెలల తరబడి జైళ్లలో ఉంచుతున్నారు. వంశీపై పెట్టిన కేసే దీనికి నిదర్శనం.

వంశీ రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకే..
‘‘వంశీని ఇంతగా ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారంటే.. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఆయన రాజకీయంగా ఎదుగుతున్నాడు కాబట్టి! చంద్రబాబు, లోకేశ్‌ కంటే ఆయన గ్లామరస్‌గా ఉన్నారనే..! వల్లభనేని వంశీతో పాటు కొడాలి నానిపై వారికి జీరి్ణంచుకోలేని ఆక్రోశం. ఇక అవినాశ్‌ కూడా లోకేశ్‌ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి ఏదో ఒక రోజు టార్గెట్‌ అవుతారు... ఇదీ చంద్రబాబు మనస్తత్వం! 

ఆ సామాజిక వర్గంలో చంద్రబాబు, ఆయన కుమారుడు మాత్రమే లీడర్లుగా ఉండాలనుకుంటారు! వారికి అనుకూలంగా లేని వారిని ఆ సామాజికవర్గం నుంచి వెలి వేస్తారు..!’’ అని మరో ప్రశ్నకు సమాధానంగా వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు. అదో మాఫియా సామ్రాజ్యం!‘‘చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 కలిసి చేసేవన్నీ కుట్రలు, కుతంత్రాలే..! అది ఒక మాఫియా సామ్రాజ్యం. 

చంద్రబాబును సీఎంను చేయడం కోసం.. ఆయనకు ఓట్లు వేయించడం కోసం వారు ఒక మాఫియా సామ్రాజ్యంలా తయారయ్యారు. వారి సామాజిక వర్గంలో ఎవరైనా వ్యతిరేకంగా నిలబడితే వారి పని ఇక అంతే. వారిపై తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు. బురద చల్లడంతో పాటు దారుణంగా ట్రోలింగ్‌ చేస్తారు. 

ఇవన్నీ చంద్రబాబు, లోకేశ్‌ నైజానికి అద్దం పడుతున్నాయి’ అని మీడియా ప్రశ్నకు సమాధానంగా వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌ వెంట మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, ఎం.అరుణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలే అనిల్‌కుమార్, నల్లగట్ల స్వామిదాసు, పార్టీ ఎనీ్టఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్‌ తదితరులు ఉన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement