
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు మైనార్టీలకు వెన్నుపోటు పొడిచారని అన్నారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. అబద్ధాలు, అవాస్తవాలు లేకపోతే చంద్రబాబు రాజకీయమే లేదని మండిపడ్డారు. ఏరుదాటాక తెప్ప తగలేయడం చంద్రబాబుకు అలవాటే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి మేరుగు నాగార్జున తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో వైఎస్సార్‌సీపీపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. టీడీపీ, ఆ పార్టీ అనుకూల సోషల్ మీడియా ఫేక్ ప్రచారాన్ని ఖండిస్తున్నాం. రాజ్యసభలో వైవీ సుబ్బారెడ్డి వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ చేసిన ప్రసంగం అందరూ చూడండి. దీనిపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. వక్ఫ్ సవరణ బిల్లుకు మేం వ్యతిరేకిస్తున్నామని వైఎస్ అనేక సార్లు చెప్పారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా లోక్‌సభ, రాజ్యసభలో ఓటేశాం.
ఏరుదాటాక తెప్ప తగలేయడం చంద్రబాబు అలవాటు. మైనార్టీలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు. ఎన్నికల్లో వాడుకున్నాడు ఇప్పుడు వదిలేశాడు. మైనార్టీలకు అన్యాయం జరిగితే అంగీకరించనని ఎన్నికల సమయంలో చెప్పారు. గుంటూరు జిల్లా ఎంపీ మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామా చేస్తామన్నారు. అందరూ కలిసి మైనార్టీలకు ద్రోహం చేశారు. టీడీపీ, చంద్రబాబు చేసిన మోసంపై ప్రజలు చర్చించుకుంటున్నారు. దీన్ని తప్పించుకోవడానికి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టాడు.
వైఎస్సార్‌సీపీ రాజ్యసభలో విప్ జారీ చేయలేదని.. బిల్లుకు అనుకూలంగా ఓటేసిందని తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడు. టీడీపీ అనుకూల జర్నలిస్టులు, అనుకూల మీడియా ఈ ఫేక్ న్యూస్‌ను నడుపుతున్నారు. అబద్ధాలు, అవాస్తవాలు లేకపోతే చంద్రబాబు రాజకీయమే లేదు. చంద్రబాబు చెబుతాడు.. ఆయన సానుభూతి పరులు ప్రచురిస్తుంటారు. ఎన్టీఆర్ వెన్నుపోటు దగ్గర్నుంచి అప్పుల వరకూ చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే. ఎన్నికల ముందు 14 లక్షల కోట్లు అప్పులున్నాయని ప్రచారం చేశారు. ఇప్పుడు 10 లక్షల కోట్లు అప్పులున్నాయంటాడు. కానీ, వేటికీ ఆధారాలు చూపించరు. 5 లక్షల 62 కోట్ల రూపాయల అప్పులున్నాయని కేంద్రం చెబుతోంది.

పీ-లో భాగంగా పేదలను సంపన్నులను చేస్తానని మభ్యపెడుతున్నాడు. రాష్ట్రంలో పేదలు ఎంత మంది?. ఇన్ కమ్ ట్యాక్స్ కట్టేవారెందరో ప్రజలకు అర్ధమయ్యేట్లు చంద్రబాబు చెప్పాలి. రాష్ట్రంలో కోటి 61 లక్షల కుటుంబాలకు తెల్లరేషన్ కార్డులున్నాయి. ఈ రాష్ట్రంలో ఇన్ కమ్ ట్యాక్స్ కట్టేది 8 లక్షల 60 వేల కుటుంబాలు మాత్రమే. చంద్రబాబు చేసిన మోసానికి యావత్ ముస్లిం, నార్టీ లోకం రగిలిపోతోంది. వైఎస్ జగన్ మీద మరక వేయాలని చంద్రబాబు చూస్తున్నాడు. మీరు ఎంత బురద జల్లినా జగన్ కడిగిన ముత్యంలా బయటపడతాడు. తస్మాత్ చంద్రబాబు.. ప్రజలే నీకు బుద్ధి చెబుతారు అంటూ’ ఘాటు విమర్శలు చేశారు.