
తాడేపల్లి : లులూ సంస్థకు వేల కోట్ల రూపాయల విలువైన స్థలాలను కట్టబెట్టడం వెనుక భారీ అవినీతి దాగి ఉందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అనుమానం వ్యక్తం చేశారు. విశాఖ, విజయవాడలో కలిపి రూ. 3 వేల కోట్ల విలువైన భూమిని అప్పనంగా కట్టబెట్టారని విమర్శించారాయన. ఈ రోజు(సోమవారం,. జూలై 28) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడియ మల్లాది విష్ణు.. ‘లులూకు కేటాయించిన భూములను వెంటనే రద్దు చేయాలి. ఏ మాల్స్ అయినా సొంంతంగా భూములు కొనుగోలు చేసి వ్యాపారం చేసుకుంటుంది. కానీ లులూకు మాత్రం చంద్రబాబు వేల కోట్ల భూమిని దోచిపెట్టడం వెనుక కారణం ఏంటి?,
అసలు లులూ గ్రూపు మీద చంద్రబాబుకు వల్లమాలిన ప్రేమ ఎందుకు?, లులూ ఛైర్మన్ అలీ.. చంద్రబాబుకు లెటర్ రాయగానే భూకేటాయింపులు ఎలా చేస్తారు?, ఆ సంస్థకు ఇచ్చే భూమి విలువ ఎంత? వారు పెట్టే పెట్టుబడి ఎంత?, విశాఖలో 14 ఎకరాల భూమిని కట్టబెట్టడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దాని వలన ప్రభుత్వానికి రూ.2,100 కోట్లు నష్టం జరుగుతుంది.
అసలు మూడేళ్లపాటు ప్రభుత్వానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పని లేదని చంద్రబాబు జీవో ఇచ్చారు. లులూకే కాదు, తన బినామీలకు పెద్ద ఎత్తున భూపందేరాలు చేస్తున్నారు. విజయవాడలో కూడా అత్యంత విలువైన ఆర్టీసీ స్థలాన్ని కట్టబెట్టడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. రూ.150 కోట్ల పెట్టుబడి పెట్టే లులూకి రూ. 600 కోట్ల విలువైన భూమిని ఎందుకు ఇస్తున్నారు?, విశాఖ, విజయవాడలో కలిపి రూ.3 వేల కోట్ల విలువైన భూమిని అక్రమంగా లులూకి కట్టబెట్టారు. ఈ భూపందేరాల వెనుక భారీ అవినీతి ఉంది

ఆ మేరకు ప్రభుత్వానికి తీవ్ర నష్టం జరుగుతోంది. ఈ భూపందేరం వెనుక లాభపడేది టీడీపీ పెద్దలే. భూపందేరాల వెనుక పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయి. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీని మరింత నష్టాల్లోకి నెట్టేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి. లులూకి కేటాయించిన స్థలాలను వెంటనే రద్దు చేయాలి. మాల్స్ వారే స్వయంగా భూములు కొనుక్కుంటారు. కానీ లులూకి చంద్రబాబు ప్రత్యేకంగా భూపందేరం చేయడం వెనుక కారణమేంటి?’ అని ఆయన నిలదీశారు.