శ్రీదేవి వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఫైర్‌

YSRCP fire on Sridevis comments - Sakshi

దమ్ముంటే అమరావతి గడ్డపై అడుగు పెట్టాలని సవాల్‌

తుళ్లూరులో శ్రీదేవి దిష్టిబొమ్మ దహనం

తాడికొండ (గుంటూరు): తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యలు వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఆగ్రహాన్ని కలిగించాయి. ఆదివారం తుళ్లూరు తులసీ థియేటర్‌ ఎదుట నాయకులు, కార్యకర్తలు శ్రీదేవి వ్యాఖ్యలకు నిరసనగా ఆమె దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సవాల్‌ను స్వీకరిస్తున్నాం. దమ్ముంటే అమరావతి గడ్డపై అడుగుపెట్టు. నిన్ను నమ్మి ఓట్లేసిన నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పు’ అంటూ నిలదీశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని అమరావతి గడ్డపై ప్రమాణం చేస్తానంటున్న శ్రీదేవి హైదరాబాద్‌ వెళ్లి ఎందుకు ప్రెస్‌మీట్‌ పెట్టాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. తాడికొండ నియోజకవర్గంలో దళితుల ఆత్మగౌరవానికి శ్రీదేవి భంగం కలిగించారని మండిపడ్డారు. 

‘భర్తను గన్‌మెన్లతో కొట్టించిన ఘనురాలు’
పార్టీ నాయకుడు మేకల రవి మాట్లాడుతూ.. తనకు శ్రీదేవి రూ.1.40 కోట్లు ఇవ్వాలన్నారు. ఇదే విష­యాన్ని గతంలో విలేకరుల సమావేశం ద్వారా అందరికీ చెప్పినా కనికరించలేదన్నారు. శ్రీదేవికి ముగ్గురు కుమార్తెలు ఉండగా.. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో ఇద్దరు అని నమోదు చేసిందన్నారు. భర్త శ్రీధర్‌ను గన్‌మెన్లతో కొట్టించిన ఘనురాలు అన్నారు.

శ్రీదేవి అక్రమాలపై ఒక ఫైల్‌ తయారు చేసిన ఆమె భర్త శ్రీధర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరకు వెళ్లలేదా అని ప్రశ్నించారు. నియో­జ­కవర్గంలో ప్రజల నుంచి రూ.100 కోట్లు వసూలు చేసిన శ్రీదేవికి ప్రజల్లో ప్రాధాన్యత తగ్గ­డంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అమ్ముడుపోయి నీతులు చెబుతోందన్నారు.

‘ఏబీఎన్‌ రాధాకృష్ణ మధ్యవర్తి­త్వం­తో టీఎస్‌09 ఎఫ్‌ఎస్‌ టీఎల్‌ఆర్‌ 8876 కారులో నీ కూతురు చంద్రబాబు ఇంటికి వెళ్లలేదా? కిషోర్‌రెడ్డి, బొల్లినేని రామారావు, సుజనా చౌ­దరి నేతృత్వంలో చంద్రబాబు ఇంటివద్ద రూ.4.50 కోట్లు అడ్వాన్స్‌ తీసుకున్నది నిజం కాదా? అని మేకల రవి నిలదీశారు. శ్రీదేవి అమ్ముడు పోయిందనడానికి తనవద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని.. ఫొటోలు, సీసీ ఫుటేజి ఆధారాలను త్వరలో డీజీపీకి, మీడియాకు అందజేస్తానని తెలిపారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top