
- ఒక మహిళా ప్రజాప్రతినిధికే రక్షణ లేని దిక్కుమాలిన పాలన ఇది
- తక్షణం సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి, డీజీపీ, మహిళా కమిషన్ స్పందించాలి
- దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి
- వైఎస్సార్‌సీపీ మహిళా నేతల స్పష్టీకరణ
పెడన: కృష్ణాజిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ గుండాలు చేసిన దాడికి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలిన వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు డిమాండ్ చేశారు. ఈ దాడి నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు, మాజీ మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, విజయవాడ మేయర్ రాయని భాగ్యలక్ష్మితో పాటు పలువురు పెడనలో ఉప్పాల హారిక నివాసంలో ఆమెను పరామర్శించి, సంఘీభావం ప్రకటించారు.
అనంతరం వారు మాట్లాడుతూ గుడివాడలో పోలీసుల సమక్షంలోనే ఒక మహిళా జెడ్పీ చైర్‌పర్సన్‌పై పాశవికంగా దాడి జరిగిందంటే, ఈ రాష్ట్రంలో అసలు శాంతిభద్రతలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ల మద్దతు లేకుండా టీడీపీ గూండాలు ఇంతటి ఘాతుకానికి పాల్పడతారా అని నిలదీశారు. రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో రాష్ట్రంలో ఒక అరాచక పాలనను సాగిస్తున్నారని మండిపడ్డారు. ఇంకా వారేమన్నారంటే...
దాడికి పాల్పడిన వారికి కొమ్ము కాస్తున్న ప్రభుత్వం: తానేటి వనిత
గుడివాడలో జరిగే "బాబు ష్యూరిటీ -మోసం గ్యారెంటీ" పార్టీ కార్యక్రమానికి వస్తుండగా కృష్ణా జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక కారు మీద తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన గూండాలు, రౌడీలు దాడి చేసి, భీభత్సం సృష్టించారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. టీడీపీ, జనసేన నాయకుల డైరెక్షన్‌లో అచారక శక్తులు దాడులు చేస్తున్నట్టు స్పష్టంగా వీడియోలో కనిపిస్తున్నా ఇప్పటివరకు ఎవరి మీదా కేసులు నమోదు చేయలేదు. పైగా దాడి చేసిన సమయంలో పోలీసులు అక్కడే ఉన్నా ఆ గూండాలను అదుపుచేసే ప్రయత్నం చేయకుండా మా నాయకురాలినే నిలువరించారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ, జనసేన నాయకులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. దాడులు చేసినా పోలీసులు మమ్మల్ని ఏం చేయలేరనే ధీమాతో రెచ్చిపోతున్నారు. ప్రజాస్వామ్యానికి ఇలాంటి సంస్కృతి ఎంతమాత్రం మంచిది కాదు. మా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఇలాగే టీడీపీ, జనసేన నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడినా వారికి మీడియా ముఖంగానే సమాధానం చెప్పామే తప్ప, అధికారం చేతిలో ఉంది కదా అని భౌతిక దాడులకు ప్రయత్నించలేదు.
కానీ ఈరోజు కూటమి పార్టీలు శృతిమించి వ్యవహరిస్తున్నాయి. వీటన్నింటికీ భవిష్యత్తులో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోకతప్పదు. హారిక మీద దాడులు చేసిన వారిని వెనకేసుకొస్తూ జిల్లా మంత్రి ఆమెది నటన అని చులకన చేసి మాట్లాడటం సిగ్గు చేటు. గుడివాడ పీఎస్‌లో కేసు పెట్టడానికి వెళితే పెడనకి వెళ్లాలని వారికి సూచించారంటే కేసు నమోదు చేసే ధైర్యం కూడా పోలీసులకు లేదనిపిస్తుంది? జిల్లా ప్రథమ పౌరురాలిగా ఉన్న మహిళకు రక్షణ కల్పించడంలో విఫలమైనందుకు సిగ్గుపడకుండా గౌరవప్రదమైన మంత్రి స్థానంలో ఉండి ఇలా మాట్లాడటం ఆయనకే సిగ్గుచేటు.
బీసీ వర్గానికి చెందిన మహిళ ప్రజాప్రతినిధి మీద దాడి జరిగితే సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి, డీజీపీ, మహిళా కమిషన్ ఇంతవరకు స్పందించకపోవడం దారుణం. ఇలాంటి దాడులు ఇంకెప్పుడూ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత సీఎం, డీజీపీ, హోంమంత్రి, మీద ఉంటుంది. హారిక కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది. వారికి సంఘీభావం తెలియజేయడానికి మా నాయకులు వైయస్ జగన్ ఆదేశాలతో మేమంతా ఇక్కడికి రావడం జరిగింది. ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదని కూటమి నాయకులు గుర్తుంచుకోవాలి.
మహిళా రక్షణపై సీఎం, డిప్యూటీ సీఎంల మాటలు పచ్చి అబద్దాలే : వరుదు కళ్యాణి
జిల్లాకు ప్రథమ పౌరురాలైన కృష్ణా జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక మీద జరిగిన దాడిని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి సంఘటనలు చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అనే అనుమానాలు కలుగుతున్నాయి. జిల్లా ప్రథమ పౌరురాలి మీద టీడీపీ, జనసేన సైకోలు, గూండాలు దాడి చేస్తే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత నుంచి ఖండిస్తూ కనీస ప్రకటన కూడా లేకపోవడం చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయి.
పక్క రాష్ట్రంలో ఒక ఛానెల్ మీద దాడి జరిగితే యుద్ధ ప్రాతిపదికన వరుసగా ఖండిస్తూ ట్వీట్ చేసిన వీరంతా సొంత రాష్ట్రంలో ఒక జిల్లా ప్రజా ప్రతినిధి మీద దాడి జరిగితే చూస్తూ ఊరుకోవడాన్ని ఏమనాలి.? ఆడ బిడ్డ మీద దాడి చేస్తే అదే వారికి ఆఖరి రోజు అవుతుందని ఒకరు, తలలు తీసేసే చట్టాలు తీసుకొస్తామని ఇంకొకరు మైకుల ముందర చేసిన శపథాలన్నీ ఏమయ్యాయి. అవన్నీ మాటలకే పరిమితమా.? బీసీ మహిళ ఉప్పాల హారిక కారు మీద రాళ్లు, కర్రలు, రాడ్లు తీసుకొచ్చి దాడి చేసి అద్దాలు పగలగొట్టి దంపతులను చంపాలని చూస్తే కనీసం సీఎంగా, డిప్యూటీ సీఎంగా, హోంమంత్రిగా అయినా బాధ్యత తీసుకోరా.? ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు కూడా చోద్యం చూస్తూ కూర్చున్నారు.
సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టులు పెట్టారనే కారణంతో వైఎస్సార్‌సీపీ మహిళా కార్యకర్తలను అర్థరాత్రి అని కూడా చూడకుండా అరెస్ట్ చేసి జైల్లో నిర్బంధించారు. కానీ మా పార్టీకి చెందిన మహిళా ప్రజాప్రతినిధి మీద దాడి జరిగితే మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఆదేశాలతోనే దాడి జరిగిందనే మా అనుమానలు నిజమవుతున్నాయి. పాకిస్థాన్ ఐసిస్ ఉగ్రవాదుల్ని తయారుచేసినట్టు తెలుగుదేశం, జనసేన పార్టీలు ఉన్మాదులను తయారు చేసి మహిళల మీద దాడులకు వాడుకుంటున్నారు. ఇలాంటి దాడులతో టీడీపీ చివరికి తెలుగు దండుపాళ్యం పార్టీగా మారిపోయింది. ఇప్పటికైనా ఒక మహిళగా అయినా హోంమంత్రి స్పందించి నిందితులపై కఠినంగా శిక్షించాలి.
రెడ్‌బుక్ రాజ్యాంగంలో మహిళలకు రక్షణ లేదు
:రాయన భాగ్యలక్ష్మి, విజయవాడ నగర మేయర్
బీసీ మహిళ, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక మీద జరిగిన దాడిని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రభుత్వ సెక్యూరిటీ ఉన్నా ఆమె మీద ఎలా దాడి జరిగిందో పోలీసులు, హోంమంత్రి వివరణ ఇవ్వాలి. టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన గూండాలు పార్టీ జెండాలు చేత్తో పట్టుకొచ్చి మరీ రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్లతో దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తూ కూర్చున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా అనే అనుమానం కలుగుతోంది. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కనపెట్టి నారా లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగంతో మహిళలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. బీసీ మహిళగా ఉప్పాల హారిక మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా’అని పేర్కొన్నారు.