YS Sharmila Padayatra: నేటి నుంచే ‘ప్రజా ప్రస్థానం’

YSR Telangana Party Chief YS Sharmila Begin Her Padayatra - Sakshi

ఉదయం 10గం.కు చేవెళ్లలోని శంకర్‌పల్లి క్రాస్‌రోడ్‌ వద్ద బహిరంగ సభ

11.30 గంటలకు వైఎస్‌ షర్మిల పాదయాత్ర ప్రారంభం

తొలిరోజు 10కిలోమీటర్లు సాగనున్న యాత్ర 

సాక్షి, హైదరాబాద్‌/చేవెళ్ల: మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సంక్షేమ పాలనే లక్ష్యంగా వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల ప్రజా ప్రస్థానం మహా పాదయాత్రకు బుధవారం చేవెళ్లలో శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 10 గంటలకు చేవెళ్లలోని శంకర్‌పల్లి క్రాస్‌రోడ్డు వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 11.30 గంటలకు షర్మిల పాదయాత్ర ప్రారంభం కానుంది. చేవెళ్ల బస్టాండ్‌ సెంటర్‌ మీదుగా 2.5 కిలోమీటర్లు నడిచి, మధ్యాహ్నం 12.30 గంటలకు షాబాద్‌ క్రాస్‌ రోడ్డుకు చేరుకుంటారు.

అక్కడ వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత కిలోమీటర్‌ దూరంలో ఉన్న కందవాడ గేట్‌ క్రాస్‌ వద్దకు పాదయాత్ర చేరుకుంటుంది. అక్కడ భోజన విరామం తీసుకుని.. సాయంత్రం 3.00 గంటలకు యాత్ర మళ్లీ ప్రారంభిస్తారు. ఎర్రోనికొటల, కందవాడ, గుండాల మీదుగా నారాయన్‌దాస్‌గూడ క్రాస్‌రోడ్‌కు చేరుకుంటారు. మొహినాబాద్‌ మండలం నక్కలపల్లి వద్ద రాత్రి బస చేస్తారు.

తొలిరోజు 10 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. తర్వాత రోజు నక్కలపల్లిలో పాదయాత్ర మొదలై.. కేతిరెడ్డిపల్లి, వెంకటాపూర్‌ గుండా సాగుతుంది. అక్కడ భోజన విరామం తీసుకుంటారు. తర్వాత యాత్ర మల్కపురం చేరుకుంటుంది. అక్కడ షర్మిల స్థానికులతో మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ రాత్రికి వర్ధమాన్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ వద్ద బస చేయనున్నారు.  

ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే.. 
ప్రజల కష్టాలు తెలుసుకొని.. టీఆర్‌ఎస్‌ ప్రజావ్యతిరేక పాలనను ఎండగట్టేందుకే షర్మిల పాదయాత్ర చేస్తున్నారని వైఎస్‌ఆర్‌టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు. చేవెళ్లలో సభ నిర్వహించే స్థలాన్ని పరిశీలించి.. మీడియాతో మాట్లాడారు. 20 ఏళ్ల క్రితం ఇదే చేవెళ్ల నుంచి దివంగత నేత వైఎస్సార్‌ పాదయాత్ర ప్రారంభించారని గుర్తు చేశారు. తండ్రి బాటలోనే షర్మిల ఈ యాత్రకు సిద్ధమయ్యారన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఏ ఒక్క వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ నాయకులు పిట్ట రాంరెడ్డి, పంబల రాజు, నియోజకవర్గ ఇన్‌చార్జి కె. దయానంద్‌ తదితరులు పాల్గొన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top