breaking news
padayatra from chevella
-
చేవెళ్ల నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభం
-
నేటి నుంచే ‘ప్రజా ప్రస్థానం’
సాక్షి, హైదరాబాద్/చేవెళ్ల: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పాలనే లక్ష్యంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల ప్రజా ప్రస్థానం మహా పాదయాత్రకు బుధవారం చేవెళ్లలో శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 10 గంటలకు చేవెళ్లలోని శంకర్పల్లి క్రాస్‌రోడ్డు వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 11.30 గంటలకు షర్మిల పాదయాత్ర ప్రారంభం కానుంది. చేవెళ్ల బస్టాండ్ సెంటర్ మీదుగా 2.5 కిలోమీటర్లు నడిచి, మధ్యాహ్నం 12.30 గంటలకు షాబాద్ క్రాస్ రోడ్డుకు చేరుకుంటారు. అక్కడ వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత కిలోమీటర్ దూరంలో ఉన్న కందవాడ గేట్ క్రాస్ వద్దకు పాదయాత్ర చేరుకుంటుంది. అక్కడ భోజన విరామం తీసుకుని.. సాయంత్రం 3.00 గంటలకు యాత్ర మళ్లీ ప్రారంభిస్తారు. ఎర్రోనికొటల, కందవాడ, గుండాల మీదుగా నారాయన్‌దాస్‌గూడ క్రాస్‌రోడ్‌కు చేరుకుంటారు. మొహినాబాద్ మండలం నక్కలపల్లి వద్ద రాత్రి బస చేస్తారు. తొలిరోజు 10 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. తర్వాత రోజు నక్కలపల్లిలో పాదయాత్ర మొదలై.. కేతిరెడ్డిపల్లి, వెంకటాపూర్ గుండా సాగుతుంది. అక్కడ భోజన విరామం తీసుకుంటారు. తర్వాత యాత్ర మల్కపురం చేరుకుంటుంది. అక్కడ షర్మిల స్థానికులతో మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ రాత్రికి వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద బస చేయనున్నారు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే.. ప్రజల కష్టాలు తెలుసుకొని.. టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక పాలనను ఎండగట్టేందుకే షర్మిల పాదయాత్ర చేస్తున్నారని వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు. చేవెళ్లలో సభ నిర్వహించే స్థలాన్ని పరిశీలించి.. మీడియాతో మాట్లాడారు. 20 ఏళ్ల క్రితం ఇదే చేవెళ్ల నుంచి దివంగత నేత వైఎస్సార్ పాదయాత్ర ప్రారంభించారని గుర్తు చేశారు. తండ్రి బాటలోనే షర్మిల ఈ యాత్రకు సిద్ధమయ్యారన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఏ ఒక్క వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ నాయకులు పిట్ట రాంరెడ్డి, పంబల రాజు, నియోజకవర్గ ఇన్చార్జి కె. దయానంద్ తదితరులు పాల్గొన్నారు. -
రాజన్న చిరునామా.. చేవెళ్ల
సాక్షి, చేవెళ్ల: ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా.. అధికారంలో ఉన్నా రంగారెడ్డి జిల్లా అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి ఎంతో అభిమానం. ఈ ప్రాంతం ఆయనతో ఓ బంధం పెనవేసుకుంది. చేవెళ్ల నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు, ఔఆర్ఆర్ నిర్మాణం, అంతర్జాతీయ సంస్థలు, పరిశ్రమల ఏర్పాటుకు సహకారంతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఈ జిల్లాలోనే అధికంగా అమలయ్యాయి. రంగారెడ్డి జిల్లాపై రాజన్న ముద్ర చెరపలేనిది. వైఎస్సార్ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.. పేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే వైఎస్సార్‌కు చేవెళ్ల ప్రాంతమంటే అమితాభిమానం. చేవెళ్ల నియోజకవర్గంతో ఆయనకు పెనవేసుకున్న బంధం ఏర్పడింది. పేదలు, రైతుల శ్రేయస్సే తమ ప్రభుత్వ లక్ష్యమంటూ ఘంటాపథంగా ప్రకటిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపారు. 2004 ఎన్నికల్లో సీఎం పదవిని అధిష్టించిన అనంతరం వైఎస్సార్ వెనుతిరిగి చూడకుండా పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేశారు. ప్రతి కుటుంబానికి మేలు జరిగేలా పథకాలను ప్రవేశపెట్టారు. దాంతో వారు ఊహించిన దానికంటే ఎక్కువగా మేలు జరిగింది. వైఎస్ రాజశేఖరరెడ్డికి సెంటిమెంట్‌గా చేవెళ్ల నియోజకవర్గ ప్రజలకు ఎంతో అనుబంధం ఉంది. ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా ఏ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించినా చేవెళ్ల నుంచే ప్రారంభించే సెంటిమెంట్ వైఎస్సార్‌కు ఉంది. 2001లో మండల పరిషత్, జెడ్పీటీసీ ఎన్నికల ప్రచార సభకు ప్రతిపక్ష నేతగా చేవెళ్లకు వచ్చిన ఆయన ఆ తర్వాత ఎన్నడూ చేవెళ్లను మరువలేదు. చేవెళ్ల ప్రాంతం తన సెంటిమెంట్ అంటూ బహిరంగంగానే ఆయన పలుసార్లు ప్రకటించారు. 2003లో చేవెళ్ల నుంచి మహా ప్రస్థానం పేరిట పాదయాత్ర ప్రారంభించారు. అనంతరం 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. తెలంగాణ ప్రాంతంలోని ఏడు జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు చేవెళ్ల–ప్రాణహిత ప్రాజెక్టు (నేటి కాళేశ్వరం ప్రాజెక్టు)కు నవంబర్ 19, 2008లో శంకుస్థాపన చేశారు. 2009 ఏప్రిల్లోఎన్నికల ప్రచారాన్ని చేవెళ్ల నుంచే ప్రారంభించి రెండోసారి విజయధుందుబి మోగించారు. పాదయాత్రలో వెన్నంటే.. 2004లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాజశేఖరరెడ్డి పాదయాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో పూర్తిస్థాయిలో ప్రసన్నకుమార్ పాల్గొని మనన్నలు పొందారు. 2005లో రాజీవ్ పల్లె బాట కార్యక్రమంలో భాగంగా మంచాలకు వైఎస్సార్ వచ్చారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది కార్యకర్తల మధ్య వీరిని రాజశేఖరరెడ్డి పేరు పెట్టి పిలవడం విశేషం. మంచాల మండలానికి వైఎస్సార్ ప్రత్యేకంగా 500 ఇళ్లు మంజూరు చేశారు. ఇళ్లతో పాటు అర్హులైన వారందరికీ పింఛన్లు కూడా అందజేశారు. ప్రత్యేకంగా నిధులు ఇచ్చి ఎంతోమందికి గుండె శస్త్ర చికిత్సలు కూడా చేయించారు. 2005 జనవరి 13వ తేదీన ఇబ్రహీంపట్నంలో పర్యటించిన వైఎస్ రాజశేఖరరెడ్డి ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు కృష్ణ నుంచి తాగునీరు అందించేందుకు రూ.20 కోట్లు మంజూరు చేశారు. 2008లో రెండో విడుతగా మరో రూ.12 కోట్లు కేటాయించారు. రావిర్యాలకు రాజన్నయోగం మహేశ్వరం: ఓవైపు అంతర్జాతీయ విమానాశ్రయం.. చుట్టూ ఔటర్ రింగురోడ్డు.. పరిసర ప్రాంతాల్లో అనేక అంతర్జాయతీస్థాయి కంపెనీలు.. వీటన్నింటి మధ్య ఉన్న రావిర్యాల గ్రామం అభివృద్ధి పథంలో శరవేగంగా దూసుకుపోతున్నది. ఇటు అభివృద్ధికి, అటు రియల్ బూమ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన రావిర్యాల ఒకప్పుడు కుగ్రామం. అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పడిన అభివృద్ధి బీజాలు, ఆయన చూపిన ప్రత్యేక చొరవతో రావి ర్యాల గ్రామం ప్రస్తుతం ప్రపంచపటంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటోంది. అప్పట్లో వైఎస్సార్ చేసిన కృషిని ఆ గ్రామం స్మరించుకుంటోంది. రావిర్యాల శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. చుట్టూ ఔటర్ రింగురోడ్డు, పక్కనే శ్రీశైలం జాతీయ రహదారి ఉండడం, అనేక అంతర్జాతీయ కంపెనీలు, పరిశ్రమలు వెలుస్తుండడం, రియల్ బూమ్ భారీస్థాయిలో ఉండడంతో రావిర్యాల గ్రామానికి వరంగా మారింది. ఒకప్పుడు మారుమూల కుగ్రామంగా ఉన్న రావిర్యాల ఇప్పుడు వెలుగుతోంది. 2004లో ఈ గ్రామానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకావడంతో క్రమంగా రావిర్యాల అభివృద్ధి పథంలోకి వచ్చింది. ఎయిర్‌పోర్టు రావడం, గ్రామానికి అనుకొని ఔటర్ రింగురోడ్డు వెళ్లడంతో ఈ గ్రామానికి మహర్దశ పట్టింది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రావిర్యాల గ్రామంలోనూ, పరిసర ప్రాంతాల్లో అనేక ప్రముఖ కంపెనీలు ఏర్పాటయ్యాయి. సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రావిర్యాల రెవెన్యూ పరిధిలో శ్రీశైలం ప్రధాన రహదారి పక్కన హార్డ్‌వేర్ పార్కు, ఫ్యాబ్ సిటీ, టీసీఎస్, రాజీవ్ జేమ్స్ పార్కు (డైమండ్ పార్కు), ఆగాఖాన్ అంతర్జాతీయ అకాడమీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఏర్పాటుచేశారు. దీనికితోడు గ్రామాన్ని చుట్టుకొని ఔటర్ రింగురోడ్డు రావడంతో రావిర్యాలకు రియల్ బూమ్ వరంగా మారింది. ఒక్కసారిగా భూములకు రెక్కలు వచ్చాయి. ఇప్పుడు రావిర్యాల గ్రామం అంటే తెలియని వారు ఉండరు. ప్రస్తుతం ఇక్కడ భూమి ఎకరానికి రూ.3 కోట్ల నుంచి 6 కోట్ల వరకు పలుకుతోంది. గ్రామం చుట్టు భారీ పరిశ్రమలు, కంపెనీలు వచ్చాయి. వైఎస్సార్ పాలనలో కొత్త వెలుగులు 2004లో వైఎస్సార్ అధికారం చేపట్టిన తర్వాత నగర శివారులోని రావిర్యాలతోపాటు చుట్టుపక్కల గ్రామాలకు కొత్త వెలుగులు వచ్చాయి. సమీపంలోని శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు, ఆ వెంటనే 2005–06 సమయంలో రావిర్యాల రెవెన్యూ పరిధిలో హార్డ్‌వేర్ పార్కు, ఫ్యాబ్‌సిటీ, ఇంటర్నేషనల్ ఆగాఖాన్ అకాడమీ, రాజీవ్ జేమ్స్ పార్కు వంటి ప్రతిష్టాత్మక సంస్థలు వెలువడం, హైదరాబాద్ నగరానికి మణిహారమైన ఔటర్ రింగురోడ్డు గ్రామానికి ఆనుకొని రావడంతో గ్రామం అభివృద్ధి వేగం పూంజుకుంది. కొత్త ఉపాధి అవకాశాలు లభించాయి. గ్రామం నుంచి ఉన్నత చదువులు చదివేవారి సంఖ్య పెరిగింది. రాజశేఖర్‌రెడ్డి హయాంలో భారీ స్థాయిలో కానిస్టేబుల్,ఉపాధ్యాయుల ఉద్యోగాలు పెద్దసంఖ్యలో గ్రామస్తులకు లభించాయి. రియల్ బూమ్ ఆసరాతో పలువురు గ్రామ విద్యార్ధులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లారు. నాటి బీజాలే.. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు శివారు ప్రాంతంలో అభివృద్ధికి చూపిన చొరవ వల్లే ఇక్కడ ప్రస్తుతం పెద్దఎత్తున అభివృద్ధి జరుగడానికి మూలకారణమని ఆయన అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. వైఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు వల్లే ఇప్పుడు గ్రామంలో ప్రగతి వెలుగులు పరుచుకున్నాయని, రావిర్యాల గ్రామం ప్రపంచపటంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేస్థాయిలో ఎదిగిందని వారు వైఎస్ కృషిని స్మరించుకుంటున్నారు. రాజశేఖర్‌రెడ్డి హాయంలో గ్రామానికి భారీ ప్రాజెక్టులు తీసుకురావడం, కంపెనీలు స్థాపించడం, ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేయడం మూలంగానే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందిందని ఆయన జయంతి సందర్భంగా వైఎస్సార్ అభిమానులు స్మరించుకుంటు నివాళులు అర్పిస్తున్నారు. -
మహానేతను మరువలేం..
చేవెళ్ల రూరల్, న్యూస్‌లైన్: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి.. ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకున్నా చేవెళ్లనే ఎంచుకునేవారు. వైఎస్‌కు చేవెళ్ల ఓ సెంటిమెంట్. అధికారం దరిచేరక ముందునుంచే ఇక్కడి నాయకులతో, కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ముఖ్యమంత్రి అయిన తర్వాత స్థానిక సమస్యలకు వైఎస్ తిరుగులేని పరిష్కారం చూపారు. అలా ఇక్కడి ప్రజలకు చేరువయ్యారు. అందుకే ఆయన దూరమై నాలుగేళ్లయినా మరవలేకపోతున్నామంటున్నారు చేవెళ్ల ప్రజానీకం. సోమవారం ఆయన నాలుగో వర్ధంతి. ఈ సందర్భంగా చేవెళ్లతో వైఎస్‌కున్న అనుబంధంపై కథనం... వైఎస్సార్ ప్రతిపక్షనేతగా, ముఖ్యమంత్రిగా ఏ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెట్టాలనుకున్నా చేవెళ్లనుంచే ప్రారంభించారు. 2003లో చేవెళ్ల నుంచి మహాపాదయాత్ర ప్రారంభించిన ఆయనకు అన్నివిధాలా కలిసొచ్చింది. చేవెళ్ల సెంటిమెంట్‌గా మారడానికి కూడా ఈ మహాపాదయాత్రే కారణం. అనంతరం 2004లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మట్టికరిపించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వైఎస్ విశేష కృషిచేశారు. చేవెళ్ల- ప్రాణహిత ప్రాజెక్టుకు నవంబర్ 19, 2008లో శంకుస్థాపన కూడా చేశారు. 2009 ఏప్రిల్‌లో జరిగిన సాధారణ శాసనసభ ఎన్నికలకు సైతం చేవెళ్ల నుంచి ప్రచారం ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా విజయఢంకా మోగించి తద్వారా రెండోసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మహానేత మరణించి నాలుగేళ్లు అవుతున్నా ఆయన జ్ఞాపకాలు మాత్రం ప్రజల్లోంచి పోలేదు. చేవెళ్లకు రాష్ట్రంలోనే కాదు జాతీయస్థాయిలో గుర్తింపుతెచ్చారు వైఎస్ రాజశేఖరరెడ్డి. ఇదీ చేవెళ్ల నియోజకవర్గంతో వైఎస్సార్ బంధం.. 2001: ఎంపీపీ, జెడ్పీటీసీల ఎన్నికల ప్రచార సభకు ప్రతిపక్షనేతగా చేవెళ్లకు విచ్చేశారు 2003: ఏప్రిల్ 9న ప్రజాప్రస్థానం పేరుతో చేవెళ్ల నుంచి పాదయాత్రకు శ్రీకారం 2004: జూన్ 13న చేవెళ్లలో పల్లెబాట ప్రారంభం 2004: నవంబర్ 19న చేవెళ్ల మండలం ఆలూరులో జాతీయ ఉపాధి హామీ పథకం పనుల ప్రారంభానికి ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో కలిసి వచ్చారు 2005: శంకర్పల్లి మండలం కొత్తపల్లిలో రైతు సదస్సు ప్రారంభం 2006: చేవెళ్లలోని దుద్దాగులో ప్రజాపథం కార్యక్రమాన్ని ప్రారంభించారు 2006: మే 7న షాబాద్ మండలం బోడంపహాడ్‌లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభ కార్యక్రమానికి వచ్చారు 2007: డిసెంబర్7న మొయినాబాద్ మండలం హిమాయత్‌నగర్ వద్ద ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభం 2008: మే నెలలో వికారాబాద్ ఉపఎన్నికల ప్రచారం చేవెళ్ల నుంచి ప్రారంభం 2008: నవంబర్ 19న చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టుకు శంకుస్థాపన 2009: మార్చి 25న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి జైత్రయాత్రను చేవెళ్ల నుంచి ప్రారంబించారు 2009: ఆగస్టు 8న చేవెళ్ల మండలంలోని ఊరెళ్ల వద్దగల ఎస్‌వీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలను ప్రారంభించారు