YS Sharmila: ‘పోడు’పై పోరాడతా..

YS Sharmila Comments On Farmers Agency area Lands Issue - Sakshi

లింగాల పోడు భూముల భరోసా యాత్రలో షర్మిల

ఎస్‌ఎస్‌ తాడ్వాయి: గిరిజన రైతుల పోడు భూముల హక్కుల కోసం పోరాటం చేస్తానని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల భరోసా ఇచ్చారు. దివంగత ముఖ్యమంత్రి రాజన్న బిడ్డగా లింగాల ఏజెన్సీ ప్రాంతంలోని పోడు భూముల సమస్యలు పరిష్కారించే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం లింగాలలో బుధవారం ఏర్పాటు చేసిన పోడు భూముల రైతుల భరోసా యాత్రలో షర్మిల మాట్లాడారు. హుజూరాబాద్‌లో ఓట్ల కోసం సీఎం కేసీఆర్‌ దళితబంధు ప్రవేశపెట్టారని, గిరిజన ప్రాంతంలో ఎన్నికలు లేనందునే పోడు సమస్య పరిష్కరించట్లేదని ఆరోపించారు.

స్వయంగా గిరిజన గ్రామాలకు వెళ్లి మాట్లాడి ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్‌... ఫాంహౌస్‌కు వెళ్లాక మరిచిపోయారని షర్మిల ఎద్దేవా చేశారు. దివంగత నేత వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన అటవీ హక్కుల చట్టం అద్భుతంగా ఉందని ఆనాడు మాట్లాడిన కేసీఆర్‌.. అధికారంలోకి వచ్చాక ఆ చట్టాన్ని ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూముల సమస్యలపై ప్రశ్నించినందుకు 20 మంది మహిళలపై హత్యాయత్నం కేసులు పెట్టిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానిదని దుయ్యబట్టారు. అడవి బిడ్డల భూములు లాక్కుంటే గిరిజనులు మీ కుర్చీ లేకుండా చేస్తారని హెచ్చరించారు. 

వై.ఎస్‌. ఇచ్చిన భూములనూ లాక్కుంటున్నారు 
తెలంగాణలోని సుమారు 11 లక్షల ఎకరాల పోడు భూములకుగాను వై.ఎస్‌. హయాంలో 3 లక్షల ఎకరాల మేర గిరిజనులకు హక్కులు కల్పించగా కేసీఆర్‌ ఆ భూములను లాక్కుంటున్నారని, మిగిలిన 7 లక్షల ఎకరాల్లో ఇప్పటివరకు ఒక ఎకరానికీ పట్టా ఇవ్వలేదని షర్మిల విమర్శించారు. రాజన్న బిడ్డగా గిరిజనుల పోడు భూముల కోసం గిరిజనులు పక్షాన నిలబడి కోట్లాడతానన్నారు.

రాబోయే రోజుల్లో తాము అధికారంలోకి వస్తే పోడు భూములన్నింటికీ పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చారు. కాగా, పోడు భూముల సమస్యలపై షర్మిలకు గిరిజన మహిళలు తమ గోడు వినిపించారు. వైఎస్‌ హయాంలో ఇచ్చిన పట్టాలున్న పోడు భూములనూ అటవీ అధికారులు లాక్కొని మొక్కలు నాటుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇందిరా శోభన్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు కల్పన గాయత్రి, ములుగు కన్వీనర్లు బానోత్‌ సుజాత మంగిలాల్, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ కో–కన్వీనర్‌ రామసహాయం శ్రీనివాస్‌రెడ్డి  పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top