
పోలీసులపై ముల్తానీల రాళ్ల దాడి
ఎస్సైతో పాటు మరో నలుగురికి గాయాలు
ఇచ్చోడ మండలంలో ఘటన
ఇచ్చోడ/ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో పోడు గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. పోడు భూము ల్లో అటవీశాఖ మొక్కలు నాటడాన్ని ముల్తానీలు వ్యతిరేకించారు. కేశవపట్నం, సడక్‌గూడ గ్రామాల మధ్యలో ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. మహిళలు, పురుషులు, పిల్లలు దాదాపు 200 మంది వరకు రాళ్లు కర్రలతో మూకుమ్మడిగా దాడికి దిగారు. ఈ ఘట నలో ఇచ్చోడ ఎస్సై పురుషోత్తంతో పాటు నలుగురు సిబ్బంది గాయపడ్డారు. వారిని స్థానిక పీహెచ్‌సీకి తరలించారు.
నాలుగు రోజులుగా సిరిచెల్మ అటవీ ప్రాంతంలోని చెలుకగూడ వద్ద ముల్తానీలు సాగు చేస్తున్న పోడు భూముల్లో అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటుతున్నారు. ఆదివారం కూడా సిబ్బందితో కలిసి బందోబస్తు మధ్య అక్కడికి చేరుకున్నారు. మరికొంతమంది అటవీ సిబ్బంది, పోలీసులు సిరిచెల్మ ఘాట్‌పై సడక్‌గూడ వద్ద వేచి ఉన్నారు. ఈక్రమంలో కేశవపట్నం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ భర్త అల్తాఫ్ స్థానిక ఎస్సై పురుషోత్తంకు ఫోన్ చేసి గ్రామస్తులతో మాట్లాడదామని పిలిచారు. దీంతో ఎస్సై ఇద్దరు సిబ్బందితో కలిసి కేశవపట్నం వైçపు వెళ్లారు. అప్పటికే గ్రామస్తులు గాయిద్‌పల్లి రోడ్డు వద్ద వేచి ఉన్నారు.
వాహనంలో నుంచి దిగిన ఎస్సై, సిబ్బందిని ముల్తా నీలు చుట్టుముట్టి దాడికి పాల్పడ్డారు. ఎస్సై చేతికి గాయమవగా.. వీడియో తీస్తున్న కానిస్టేబుల్ సెల్‌ఫోన్‌ను లాక్కొని రాయితో తలపై కొట్టారు. పోలీసు వాహనంపై రాళ్లు వేయడంతో అద్దాలు పగిలిపోయాయి. అప్రమత్తమైన ఎస్సై మిగతా సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకునేలోపు ముల్తానీలు పరారయ్యారు. 20 నిమిషాల తర్వాత పొలాల వైపు నుంచి వచి్చన ముల్తానీలు సిబ్బందిపై మరోసారి రాళ్లతో దాడికి దిగారు.
ఈ ఘటనలో మరో ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. పోలీసులు ఎదురు దాడికి దిగడంతో ముల్తానీలు పారిపోయారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చెలుకగూడ వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని వాయిదా వేశారు. విషయం తెలుసుకున్న ఎస్పీ అఖిల్ మహాజన్, ఉట్నూర్ డీఎస్పీ కాజాల్‌సింగ్ ఇచ్చోడ పోలీస్‌స్టేషన్ చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కాగా, ముల్తానీల దాడిలో గాయపడిన వారిలో ముగ్గురు కానిస్టేబుళ్లను స్థానిక పీహెచ్‌సీ నుంచి రిమ్స్‌కు తరలించారు. చికిత్స అనంతరం సాయంత్రం వారిని డిశ్చార్జ్ చేశారు.