బాబుగారూ.. ఇలాంటి దారుణాలు చేయడానికేనా అధికారంలోకి వచ్చింది? | Ys Jagan Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

బాబుగారూ.. ఇలాంటి దారుణాలు చేయడానికేనా అధికారంలోకి వచ్చింది?

Jan 16 2026 12:21 PM | Updated on Jan 16 2026 1:46 PM

Ys Jagan Fires On Chandrababu

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వ హత్యా రాజకీయాలపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబూ.. మీరు పాలించడానికి అర్హులేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాల్మాన్ హత్యను ఖండిస్తూ ట్వీట్ చేసిన జగన్.. రాజకీయ కక్షలతో ఎంతమంది ప్రాణాలను బలితీసుకుంటారు? అంటూ నిలదీశారు.

‘‘ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా రెడ్‌బుక్‌ రాజ్యాంగం, పొలిటికల్‌ గవర్నెన్స్‌ ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా?. మీ కక్షల పాలన ఫలితంగా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన మా పార్టీ కార్యకర్త, ఒక దళితుడు, ఒక పేదవాడు అయిన మందా సాల్మన్‌ హత్యకు గురైన ఘటనపై మీరు ఏం సమాధానం చెప్తారు?. అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడ్డానికి సాల్మన్ సొంత గ్రామానికి వెళ్తే ఇనుప రాడ్లతో కొట్టి హత్యచేస్తారా?. పైగా సాల్మన్‌పైనే తప్పుడు ఫిర్యాదు పెట్టిస్తారా?. ఇలాంటి దారుణాలు చేయడానికా మీరు అధికారంలోకి వచ్చింది?’’ అంటూ వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.

‘‘ఈ ఘటన ముమ్మాటికీ వైఎస్సార్‌సీపీని భయపెట్టడానికి, కట్టడిచేయడానికి మీరు, మీ పార్టీవారి ద్వారా, కొంతమంది పోలీసులు ద్వారా చేస్తున్న, చేయిస్తున్న రాజకీయ హింసాత్మక దాడుల పరంపరలో భాగమే. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, మీరు అజమాయిషీ చెలాయిస్తూ,   ఊళ్లో మీకు గిట్టని వారు ఉంటే చంపేస్తామని మీ వాళ్లు, మీ ఎమ్మెల్యే, మీ పోలీసుల బెదిరింపులతో పిన్నెల్లి గ్రామం నుంచి వందలకొద్దీ వైయస్సార్‌ కార్యకర్తల కుటుంబాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు.

..ఇదొక్కటే కాదు, అసెంబ్లీ ఎన్నికలు ముగిసింది మొదలు ఇలాంటి ఎన్నో ఘటనలు పల్నాడు సహా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. ఇంత జరుగుతున్నా సిగ్గులేకుండా మారణకాండను  ప్రోత్సహించారు. పౌరులకు రక్షణ కల్పించడం, వారు స్వేచ్ఛగా తమ జీవితాలను గడిపేలా చూడ్డం మీ బాధ్యత కాదా?. అలాంటి బాధ్యతలను నిర్వర్తించడంలో మీరు విఫలం చెందడం, పైగా మీరే మీ కక్షలకోసం శాంతిభద్రతలను దెబ్బతీసి హత్యారాజకీయాలకు వెన్నుదన్నుగా నిలవడం దుర్మార్గమైన విషయం కాదా?. మీరు ముఖ్యమంత్రిగా ఉండి చేస్తున్న రాజ్యాంగ ఉల్లంఘన కాదా?

..చంద్రబాబూ..  హింసారాజకీయాలకు పాల్పడుతున్న మిమ్మల్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరు. తప్పకుండా ఇలాంటి ఘటనలకు మీరు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఏది విత్తుతారో అదే రేపు  పండుతుందన్నది ఎప్పుడూ మరిచిపోకూడదు. టీడీపీవారి చేతిలో హత్యకు గురైన సాల్మన్‌ కుటుంబానికి వైయస్సార్‌సీపీ అండగా ఉంటూ వారిని ఆదుకుంటుంది’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement