
సాక్షి, గుంటూరు: ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలను పట్టి పీడిస్తున్నారని, ఆయన చెప్పేదానికి చేసే దానికి ఏమాత్రం సంబంధం ఉండదని మాజీ మంత్రి విడదల రజిని(Vidadala Rajini) అన్నారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రయత్నాలు, వైద్యారోగ్య రంగాల నిర్వీర్యంపై గురువారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు(Chandrababu) చేప్పేవన్నీ అబద్ధాలే. చెప్పే ఏ మాట మీద ఆయన నిలబడరు. ఎంతో దూరదృష్టితో వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. ఐదు కాలేజీలను మా ప్రభుత్వ హయాంలో నిర్మించాం. మెడికల్ కాలేజీల ద్వారా ఆరోగ్య సేవలను జగన్ విస్తృత పరిచారు. వైద్య విద్య చదివేవారి ఆశలను నిజం చేయాలని జగన్ చూశారు. కార్పొరేట్ స్థాయిలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని ఆయన భావించారు. నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించటానికి జగన్ అడుగులేశారు..
.. అలాంటి మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రయివేటీకరణ(AP Medical Colleges Privatization) చేస్తున్నారు. ఒక సంస్థతో సర్వే చేయించినట్టుగా కథ నడిపి వారితో ఫీజుబులిటీ రిపోర్టును తెప్పించారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో వారికి అనుగుణంగా రిపోర్టు ఇచ్చారు. ఒక్కో కాలేజీని సంవత్సరానికి రూ.5 వేల చొప్పున లీజుకు ఇస్తున్నారు. రూ.500 కోట్ల విలువైన ఆస్తిని రూ.5 వేలకు ఇవ్వటం ఏంటి?. పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యాన్ని ఏం చేయదల్చుకున్నారు?.
చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డెక్కారు. పరిశ్రమల ఊసే లేదు. అర్ధిక అభివృద్ధి పేరుతో చంద్రబాబు తన మనుషులకే మేలు చేస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు సంక్షేమం అనేది చంద్రబాబుకు ఇష్టం లేదు. కరోనా సమయంలో జగన్ అన్ని వర్గాలకూ మేలు చేశారు. కానీ చంద్రబాబు పాలనలో ప్రజలకు అలాంటి ఆశలన్నీ నీరు గారి పోయాయి. ఇప్పుడు పీపీపీ పద్దతి అంటున్నారు.

ఇప్పటికే ఆరోగ్య శ్రీ బిల్లులు అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలను ఎందుకు ఇలా పట్టి పీడిస్తున్నారు?. ప్రజల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటం ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యత నుండి చంద్రబాబు ప్రభుత్వం తప్పుకోవడం సరికాదు. గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్యం కోసం జగన్ అనేక ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు వాటిని కూడా ఈ ప్రభుత్వం నాశనం చేసింది. గిరిజనులకు మళ్ళీ డోలీల బాధ తప్పటం లేదు. మేము అధికారంలోకి వచ్చాక
మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణపై రివ్యూ చేస్తాం అని రజిని అన్నారు.
ఇదీ చదవండి: కడిగిన ముత్యంలా మా నాన్న బయటకు వస్తారు