మతాల మధ్య బీజేపీ చిచ్చు

Vellampalli Srinivas Fires On Somu Veerraju - Sakshi

సోము వీర్రాజు తప్పుడు ప్రచారం చేస్తున్నారు

ఆ పార్టీ నేతలు మత రాజకీయాలు మానుకోవాలి

మంత్రి వెలంపల్లి ధ్వజం

వినాయక చవితి చేసుకోవద్దని మేం చెప్పలేదు

కేంద్రం ఇచ్చిన గైడ్‌లైన్స్‌ మేరకే గణేశ్‌ ఉత్సవాలపై నిర్ణయం

సాక్షి, అమరావతి: బీజేపీ నేతలు మత రాజకీయాలు మానుకోవాలని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ హితవు పలికారు. రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ఆదేశాలతోనే వినాయక చవితి వేడుకలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. వీర్రాజు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్‌ వద్ద మంత్రి సోమవారం మీడియాతో మాట్లాడారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కులమతాలకతీతంగా పాలన చేస్తున్నారన్నారని.. కానీ, ఆయనపై మతం ముద్ర వేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ నేతలకు హిందూ మతంపై గౌరవం ఉంటే గతంలోనే ప్రశ్నించేవారని.. కానీ, ఆలయాలను కూల్చిన టీడీపీని బీజేపీ ఏనాడూ ప్రశ్నించలేదని మంత్రి వెల్లంపల్లి ధ్వజమెత్తారు. వినాయక చవితి చేసుకోవద్దని తాము చెప్పలేదని.. దీనిపై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. పండుగల విషయంలో కేంద్రం ప్రభుత్వమే మార్గదర్శకాలిచ్చిందని.. వాటిని మార్చమని సోము వీర్రాజు అదే కేంద్రాన్ని అడగాలని వెలంపల్లి డిమాండ్‌ చేశారు.

వీటిని జారీచేసిన కేంద్ర ప్రభుత్వం కూడా హిందువులకు వ్యతిరేకమా అని ఆయన ప్రశ్నించారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పండుగ చేసుకోమని చెప్పామని.. ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చెయ్యొద్దని ఆయన కోరారు. పెద్ద పెద్ద విగ్రహాలు, ఊరేగింపులు పెట్టకూడదని మాత్రమే సూచించామన్నారు. ప్రజలు బీజేపీకి ఓట్లు వేయలేదు కాబట్టి, ఏపీ ప్రజలకు ఏమైనా పర్వాలేదన్నది బీజేపీ విధానమా? అని కూడా మంత్రి ప్రశ్నించారు. కోవిడ్‌ వేళ ప్రజలకు అండగా ఉండాల్సిందిపోయి, మత విద్వేషాలను రెచ్చగొట్టడం ఏమిటన్నారు.

మార్గదర్శకాలు ఉల్లంఘిస్తే కేసులే..
పండుగలకు సంబంధించి.. కేంద్రం ఏవైతే మార్గదర్శకాలు ఇచ్చిందో.. ఆ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా, ఆఖరికి బీజేపీ నేతలు వ్యవహరించినా వారి మీద కూడా కేసులు పెడతామని వెలంపల్లి హెచ్చరించారు. అందులో ఎటువంటి సందేహంలేదని స్పష్టంచేశారు. కోవిడ్‌ కాలంలోనే కుంభమేళాకు అనుమతిస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకతను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. హిందూ మతం మీద ప్రేమ, గౌరవం బీజేపీకి ఉంటే.. చంద్రబాబు హయాంలో విజయవాడలో 50 పురాతన దేవాలయాలు కూల్చివేసినప్పుడు, గోదావరి పుష్కరాల్లో  30 మంది అమాయక భక్తుల్ని పొట్టనపెట్టుకున్నప్పుడు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. బీజేపీ ధర్నాలు చేయాల్సింది రాష్ట్రంలోని కలెక్టరేట్ల ముందు కాదని.. మార్గదర్శకాలు జారీచేసిన కేంద్ర హోంమంత్రి కార్యాలయం ముందో లేదా కేంద్ర ప్రభుత్వం ముందో చేయాలని మంత్రి వెలంపల్లి సవాల్‌ చేశారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top