‘తల్లిలాంటి వారు.. మనసును బాధపెట్టి ఉంటే క్షమించండి’

Veerappa Moily Says Sorry If We Hurt Sonia Gandhi Feelings She Is LIke Mother - Sakshi

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వీరప్ప మొయిలీ

పార్టీకి ద్రోహం చేసిన వాళ్లే విధేయుల్లా నటిస్తున్నారు

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నాయకత్వాన్ని తామెప్పుడూ ప్రశ్నించలేదని ఆ పార్టీ సీనియర్‌ నేత వీరప్ప మొయిలీ అన్నారు. సోనియా పార్టీకి తల్లిలాంటివారని.. ఆమె మనోభావాలను కించపరిచే ఉద్దేశం తమకు ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ తెలిసోతెలియకో అలాంటిది జరిగి ఉంటే క్షమాపణ కోరుతున్నామన్నారు. ఆమె పట్ల ఎల్లవేళలా గౌరవ మర్యాదలు, కృతజ్ఞతాభావం కలిగి ఉంటామని పేర్కొన్నారు. అదే సమయంలో పార్టీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని భావించే తాము లేఖ రాశామని, అంతర్గత విషయాలను బహిర్గతం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. (చదవండి: ‘అసంతృప్త నేతలపై చర్యలు లేవు’)

కాగా కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంలో మార్పు అత్యవసరమని.. క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో చురుగ్గా పనిచేసే శాశ్వత, ఏఐసీసీ, పీసీసీ కార్యాలయాల్లో నిత్యం అందుబాటులో ఉండే నాయకత్వం కావాలని పేర్కొంటూ సుమారు 23 మంది సీనియర్‌ నేతలు ఇటీవల సోనియా గాంధీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. శశి థరూర్‌, కపిల్‌ సిబల్‌, గులాం నబీ ఆజాద్‌, వీరప్ప మొయిలీ తదితరులు ఈ లేఖపై సంతకం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం భేటీ అయిన కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీని ఏకగ్రీవంగా తీర్మానించడంతో.. పార్టీలో చెలరేగిన ప్రకంపనలు చప్పున చల్లారిపోయాయి.(చదవండిగాంధీలదే కాంగ్రెస్‌..!)

ఈ పరిణామాల గురించి వీరప్ప మొయిలీ మంగళవారం మాట్లాడుతూ.. ‘‘‘‘పార్టీ కోసం సోనియాజీ చేసిన త్యాగం గురించి మాకు తెలుసు. అందుకు మేం ఎల్లప్పుడు రుణపడి ఉంటాం. అయితే ఎన్నో ఏళ్లుగా మేం కూడా అంకిత భావంతో పార్టీ కోసం పనిచేస్తున్నాం. కాబట్టే పార్టీ ప్రస్తుత పరిస్థితుల గురించి అధినాయకత్వ దృష్టికి తీసుకువెళ్లాలనుకున్నాం. అంతేతప్ప సోనియా గాంధీ మనోభావాలను కించపరచుకోవాలనుకోలేదు. ఆమెపై గౌరవం అలాగే ఉంటుంది. 

అయితే అదే సమయంలో పార్టీలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. కేవలం దానిని ఆశించే మేం లేఖ రాశాం. అంతకుమించి వేరే ఉద్దేశం లేదు. ఆమె మాకు తల్లిలాంటి వారు. తొలుత అధ్యక్షురాలిగా కొనసాగేందుకు నిరాకరించినా తర్వాత ఆమె అంగీకరించారు. ఆమె మార్గదర్శకత్వంలో ముందుకు నడిచేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆమె పట్ల మా ప్రేమ తగ్గదు. అయితే మేం రాసిన లేఖ ఎలా లీకైందో తెలియడం లేదు. ఈ విషయంపై లోతుగా విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

అదే విధంగా కాంగ్రెస్‌ పార్టీకి అనేకసార్లు ద్రోహం చేసిన వాళ్లే.. పార్టీ విధేయులుగా నటిస్తూ తమ విధేయతనే ప్రశ్నించేలా వ్యవహరిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా సీడబ్ల్యూసీ సమావేశంలో భాగంగా సీనియర్‌ నాయకుల తీరుపై ఎంపీ రాహుల్‌ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. లేఖ వెనుక బీజేపీ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో.. దశాబ్దాల తరబడి పార్టీకి సేవలందిస్తున్న తమ పట్ల ఈ విధంగా వ్యవహరించడం సరికాదంటూ సీనియర్‌ నేతలు ఆవేదన చెందారు. ఒకానొక సమయంలో గులాం నబీ ఆజాద్‌ రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు వెలువడ్డాయి.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top