ఉత్తరాఖండ్‌ సీఎం తీరత్‌ సింగ్‌ రాజీనామా!

Uttarakhand CM Tirath Singh Rawat Likely To Resign Sources Says - Sakshi

న్యూఢిల్లీ/డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి తీరత్‌ సింగ్‌ రాజీనామా చేసినట్లు సమాచారం. ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేనందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా  త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 10న తీరత్‌ సింగ్‌ ఉత్తరాఖండ్‌గా సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, అప్పటికి ఆయన ఎమ్మెల్యే కాదు. భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం... ఆరు నెలల కాలంలో ఆయన శాసన సభ సభ్యునిగా ఎంపిక కావాల్సి ఉంది. అయితే, సెప్టెంబరు 5తో ఈ గడువు ముగియనుండటం, మరో 6 నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. తాజాగా ఉప ఎన్నికలు జరుపలేని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో, రాజ్యాంగపరమైన ఇబ్బందుల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం సూచన మేరకు తీరత్‌సింగ్‌ పదవి నుంచి వైదొలిగినట్లు సమాచారం.

ఇక గత మూడు రోజులుగా తీరత్‌ సింగ్‌ బీజేపీ పెద్దలతో భేటీ అవుతున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో బుధవారం రాత్రి భేటీ అయిన ఆయన.. శుక్రవారం మరోసారి నడ్డాను కలిశారు. ఈ నేపథ్యంలో.. ప్రజాప్రతినిధుల చట్టం-1951 ప్రకారం ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే పరిస్థితి లేనందున.. రాజీనామా చేయాలని నడ్డా ఆయనకు చెప్పినట్లు తెలుస్తోంది.

అదే విధంగా... హల్ద్వానీ, గంగోత్రి శాసన సభ స్థానాలు ఖాళీగానే ఉన్నప్పటికీ, ఇప్పట్లో ఉప ఎన్నిక నిర్వహించే దాఖలాలు కనిపించడం లేనందున ఇదే సరైన నిర్ణయమని చెప్పినట్లు సమాచారం. దీంతో తీరత్‌ సింగ్‌ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన స్థానంలో మరో కీలక నేతను ముఖ్యమంత్రిని చేసేందుకు బీజేపీ పావులు కదుపుతున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా తీరత్‌ సింగ్‌ ప్రస్తుతం పౌరీ గర్వాల్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top