నేడు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కమిటీ భేటీ

TRS State Committee Meets Today To Focus On Huzurabad - Sakshi

పార్టీ సంస్థాగత నిర్మాణం, దళితబంధు, ఇతర అంశాలపై దిశానిర్దేశం చేయనున్న సీఎం కేసీఆర్‌ 

విపక్షాల విమర్శలు, హుజూరాబాద్‌ ఉప ఎన్నికపైనా చర్చించే అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ సంస్థాగత నిర్మాణం, దళితబంధు పథకంపై పార్టీ కార్యాచరణ, హుజూ రాబాద్‌ ఉప ఎన్నిక తదితర అంశాలపై టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ మంగళవారం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో రాష్ట్ర కమి టీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. మంగళవా రం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. 

గ్రామస్థాయి నుంచీ పార్టీ నిర్మాణంపై.. 
ఈ ఏడాది ఫిబ్రవరి ఏడో తేదీన జరిగిన టీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశంలో మార్చి నెలాఖరు నాటికి సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏప్రిల్‌లో పార్టీ అ«ధ్యక్షుడి ఎన్నిక ప్లీనరీ ఉంటుందని ప్రకటించారు. కానీ కోవిడ్‌ రెండో దశ, లాక్‌డౌన్‌ నేపథ్యంలో జాప్యం జరిగింది. సభ్యత్వ నమోదు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఈ నెలాఖరులోగా సభ్యత్వ నమోదు పూర్తిచేసి, పుస్తకాలను తెలంగాణ భవన్‌లో అందజేయాలని పార్టీ నాయకత్వం ఇప్పటికే ఆదేశించింది. సభ్యత్వ నమోదు దాదాపు కొలిక్కి రావడంతో సంస్థాగత కమిటీల ఏర్పాటుపై దృష్టి పెట్టింది. ఈ మేరకు షె డ్యూల్‌ తేదీలను మంగళవారం జరిగే సమావేశంలో కేసీఆర్‌ ప్రకటించే అవకాశముంది. అన్ని కమిటీల ను ప్రక్షాళన చేయాలని.. వివిధ కారణాల తో అధికార పదవులు దక్కనివారు, చురుకైన నేతలు, కార్యకర్తలతో సామాజిక సమతూకం పాటిస్తూ కమిటీలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. 

దళితబంధు పథకంపై కార్యాచరణ 
ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళితబంధు పథకం ఉద్దేశాలు, లక్ష్యాలను పార్టీ యంత్రాంగం ద్వారా బలంగా క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో దీనిపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే సమయంలో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక, రాష్ట్ర రాజకీయాల్లో విపక్షాల దూకుడు, కొత్త రాజకీయ శక్తుల ప్రభావంపైనా తన మనోగతాన్ని వెల్లడించే అవకాశముంది. ఇక జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం పూర్తి, ప్రారంభోత్సవాలు, పార్టీ కార్యకర్తలకు శిక్షణ, ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణం తదితర అంశాలపైనా కేసీఆర్‌ స్పష్టత ఇవ్వనున్నట్టు సమాచారం.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top