కేసీఆర్‌ చాణక్యం: టీఆర్‌ఎస్‌కు కలిసొచ్చిన అంశాలివే..

TRS Political Strategy In MLC Elections - Sakshi

‘అనూహ్య అభ్యర్థి’ని చివరి నిమిషంలో తెరమీదకు తెచ్చి ‘హైదరాబాద్‌’లో విజయం

నల్లగొండలో బహుముఖ పోటీని ఎదుర్కొని పార్టీ బలంతో బయటపడిన పల్లా

కలిసొచ్చిన ఓట్ల చీలిక... ఫలితం ఇచ్చిన ‘ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌’

సాక్షి, హైదరాబాద్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయ భేరీ మోగించడంతో టీఆర్‌ఎస్‌ పార్టీకి మళ్లీ జోష్‌ వచ్చింది. ఒక సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు కమలం చేతిలో ఉన్న స్థానాన్ని కూడా చేజిక్కించుకుని కారు పార్టీ సత్తా చాటింది. టీఆర్‌ఎస్‌ అనుసరించిన బహుముఖ వ్యూహం, ఎత్తుగడలు పార్టీ అభ్యర్థుల విజయానికి బాటలు వేశాయి. టీఆర్‌ఎస్‌కు కలిసొచ్చిన అంశాలను ఓసారి పరిశీలిస్తే..

ఫలించిన ‘అనూహ్య అభ్యర్థి’ఎత్తుగడ
‘నల్లగొండ– ఖమ్మం– వరంగల్‌’పట్టభద్రుల స్థానం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని మరోమారు అభ్యర్థిగా ప్రకటించిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‘హైదరాబాద్‌– రంగారెడ్డి– మహబూబ్‌నగర్‌’బరిలో అభ్యర్థిని నిలిపే విషయంలో చివరి నిముషం వరకు గోప్యత పాటించారు. ‘హైదరాబాద్‌’స్థానానికి 2007, 2009, 2015లో జరిగిన ఎన్నికల్లో 2009 మినహా మిగతా రెండు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని నిలిపినా టీఆర్‌ఎస్‌ విజయం సాధించలేదు. దీంతో ప్రస్తుత ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ పోటీ చేసే అవకాశం లేదని, స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌కు మద్దతు ఇస్తుందని కూడా ఓ దశలో ప్రచారం జరిగింది. ఫిబ్రవరి 23న నామినేషన్ల స్వీకరణ ముగియగా.. ఒకరోజు ముందు ఫిబ్రవరి 22న ‘హైదరాబాద్‌’స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు కూతురు సురభి వాణీదేవి పేరును అనూహ్యంగా కేసీఆర్‌ ఖరారు చేశారు.

పీవీ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో వాణీదేవి పేరు తెరమీదకు రావడం విపక్షాలతో పాటు టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆశ్చర్యానికి లోనయ్యాయి. శతజయంతి ఉత్సవాల కానుకగా ఆమెను గెలిపించి చట్టసభకు పంపిస్తామని టీఆర్‌ఎస్‌ నాయకులు చెప్పారు. ఓడిపోయే స్థానంలో పోటీకి దింపి వాణీదేవిని బలిపశువును చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. దాంతో టీఆర్‌ఎస్‌ ఈ స్థానంలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

పోలింగ్‌ తేదీకి కేవలం 20 రోజుల ముందు పార్టీ అభ్యర్థిని ఖరారు చేసిన కేసీఆర్‌ శరవేగంగా ప్రచార వ్యూహాన్ని ఖరారు చేయడంతో పాటు పార్టీ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో మోహరించారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (హైదరాబాద్‌), రాజ్యసభ సభ్యుడు కేశవరావు (రంగారెడ్డి), ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి (మహబూబ్‌నగర్‌)కు సమన్వయ బాధ్యతలు అప్పగించారు. ‘నల్లగొండ’పట్టభద్రుల స్థానంలో సమన్వయ బాధ్యతలు ఉమ్మడి జిల్లా మంత్రులకు అప్పగించిన కేసీఆర్‌ ‘హైదరాబాద్‌’లో మాత్రం ఉమ్మడి జిల్లాల మంత్రులతో పాటు అదనంగా మరో ముగ్గురు మంత్రులు గంగుల కమలాకర్‌ (హైదరాబాద్‌), టి.హరీష్‌రావు (రంగారెడ్డి), వేముల ప్రశాంత్‌రెడ్డి (మహబూబ్‌నగర్‌)లను ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. 

ప్రచారంలో దూకుడు.. పోలింగ్‌పై దృష్టి
‘నల్లగొండ– ఖమ్మం– వరంగల్‌’స్థానంలో ఆరు నెలలుగా సన్నాహక సమావేశాలతో పార్టీ యంత్రాంగాన్ని సన్నద్దం చేస్తూ వచ్చిన టీఆర్‌ఎస్‌ ‘హైదరాబాద్‌– రంగారెడ్డి– మహబూబ్‌నగర్‌’లో మాత్రం ఎన్నికల ప్రచారంలో దూకుడు ప్రదర్శించింది. మండల, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో సన్నాహాక సమావేశాలు ముగిసిన వెంటనే క్షేత్రస్థాయిలో ప్రతీ 50 మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జిని నియమించి ప్రతీ ఓటరును చేరుకునేలా సమన్వయంపై దృష్టి కేంద్రీకరించింది. రెండు పట్టభద్రుల స్థానాల్లోనూ పార్టీ వ్యూహం అమలును కేసీఆర్‌ స్వయంగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు మంత్రులు, ఇన్‌చార్జిలు, ఎమ్మెల్యేలు, ఇతర మంత్రులను అప్రమత్తం చేస్తూ వచ్చారు.

22 జిల్లాలు.. 77 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పట్టభద్రుల ఎన్నికలు జరుగుతుండటంతో ఈ ఎన్నికలను టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు తదితర వృత్తి నిపుణులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, కొన్ని కుల సంఘాలు, కాలనీ సంఘాలతోనూ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడానికి టీఆర్‌ఎస్‌ ప్రాధాన్యతనిచ్చింది. పోలింగ్‌ శాతం పెరిగితేనే పార్టీ అభ్యర్థులకు ప్రథమ ప్రాధాన్యత ఓట్లలో ఆధిక్యత దక్కుతుందనే అంచనాతో చేసిన ప్రయత్నాలు కూడా టీఆర్‌ఎస్‌కు అనుకూలించినట్లు ఫలితాల సరళి వెల్లడించింది.

ఫలించిన ‘ఫిట్‌మెంట్‌’.. కలిసొచ్చిన ఓట్ల చీలిక
పోలింగ్‌కు మూడు రోజుల ముందు ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో జరిపిన భేటీ టీఆర్‌ఎస్‌కు కొంత అనుకూల వాతావరణాన్ని సృష్టించింది. 29 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సానుకూలత వ్యక్తం చేశారని ఆయా సంఘాల నాయకులు చేసిన ప్రకటనపై విమర్శలు వచ్చినా.. ఆయా వర్గాల్లోటీఆర్‌ఎస్‌పై ఉన్న వ్యతిరేకత కొంతమేర తగ్గడానికి ఉపయోగపడింది. ఇదిలా ఉంటే రెండు పట్టభద్రుల స్థానాల్లోనూ భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేయడం ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలికకు దారితీసింది.

‘హైదరాబాద్‌’లో 93, ‘నల్లగొండ’లో 71 మంది పోటీ చేయగా, రెండు చోట్లా ఎనిమిదేసి మందికి పైగా అభ్యర్థులు భారీగా ప్రథమ ప్రాధాన్యత ఓట్లు సాధించడం టీఆర్‌ఎస్‌ ఆధిక్యానికి బాటలు వేసింది. ఈ ఆధిక్యానికి ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు తోడు కావడంతో టీఆర్‌ఎస్‌ గెలుపు సునాయాసమైంది. మరోవైపు బీజేపీ లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ అటు క్షేత్రస్థాయి ప్రచారంలోనూ, ఇటు సోషల్‌ మీడియాలోనూ అత్యంత దూకుడును ప్రదర్శించింది. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం, గ్యాస్, డీజిల్, పెట్రో ధరల పెంపు వంటి అంశాలను ప్రస్తావించడంతో పాటు, ఉద్యోగులు, విద్యార్థులతో తమది పేగు బంధమనే సెంటిమెంటును కూడా లేవనెత్తింది.

]

చదవండి:
టీఆర్‌ఎస్‌కే పట్టం.. రెండు స్థానాలు 'గులాబీ'కే 
ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను: చిన్నారెడ్డి 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top