TRS Foundation Day: ఉద్యమ పార్టీగా ప్రస్థానం.. గమ్యాన్ని ముద్దాడిన పార్టీగా అధికారంలోకి

TRS Enters 21st Year: Foundation Day To Be Low Key Affair - Sakshi

తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా పోరుబాట 

2001 ఏప్రిల్‌ 27న జలదృశ్యం వేదికగా టీఆర్‌ఎస్‌ ఏర్పాటు 

గమ్యాన్ని ముద్దాడిన పార్టీగా అధికారంలోకి... సొంత రాష్ట్రంలో వరుస విజయాలతో పయనం 

నేటితో తెలంగాణ రాష్ట్ర సమితికి 20 ఏళ్లు

సాక్షి, హైదరాబాద్‌: దశాబ్దాల పాటు తెలంగాణ ప్రజలు కోరుకున్న స్వరాష్ట్ర సాధన లక్ష్యంగా ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి నేటితో ఇరవై ఏళ్లు పూర్తి చేసుకుంది. ‘నిధులు, నీళ్లు, నియామకాలు’నినాదంతో 2001 ఏప్రిల్‌ 27న జలదృశ్యం వేదికగా ప్రస్థానం ప్రారంభించిన టీఆర్‌ఎస్‌ 14 ఏళ్ల పాటు ఉద్యమ బాటలో నడిచింది. పార్టీ సారథి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో స్వరాష్ట్ర సాధనకు సర్వశక్తులూ ఒడ్డిన టీఆర్‌ఎస్‌ 2014 జూన్‌ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా అధికారం చేపట్టింది. ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలతోపాటు ఎజెండాలో లేని ఇతర పథకాలను కూడా అమలు చేస్తూ 2018లో వరుసగా రెండో పర్యాయం కూడా టీఆర్‌ఎస్‌ రాష్ట్రంలో అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. ఉద్యమ పార్టీగా, రాష్ట్ర సాధన తర్వాత అధికార పార్టీగా రెండు దశాబ్దాలుగా టీఆర్‌ఎస్‌ ప్రస్థానం కొనసాగుతోంది.

జల దృశ్యం నుంచి మొదలైన ప్రస్థానం 
తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001 ఏప్రిల్‌ 27న హైదరాబాద్‌ జలదృశ్యం వేదికగా తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేస్తున్నట్లు కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. తాను నిర్వహిస్తున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ పదవితో పాటు, సిద్దిపేట శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఇదే వేదిక మీద ప్రకటన చేశారు. అదే ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన సిద్దిపేట అసెంబ్లీ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలుపొందిన కేసీఆర్‌ తర్వాతి కాలంలో ఉద్యమ సాధనలో పదవులకు రాజీనామా చేయడాన్ని వ్యూహంగా మలుచుకున్నారు.

2004 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకుని 26 అసెంబ్లీ స్థానాలు, ఐదు లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందారు. కేంద్రంలో మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని మంత్రివర్గంలో కేసీఆర్‌తో పాటు ఆలె నరేంద్ర చేరగా, రాష్ట్రంలోనూ ఆరుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మంత్రి పదవులు చేపట్టారు. అయితే ప్రణబ్‌ ముఖర్జీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ తెలంగాణ అంశాన్ని తేల్చకపోవడంతో రాష్ట్ర మంత్రివర్గం నుంచి టీఆర్‌ఎస్‌ మంత్రులు వైదొలిగారు. వరంగల్, పోలవరంతోపాటు పలుచోట్ల భారీ బహిరంగ సభల ద్వారా తెలంగాణ వాదాన్ని ప్రజల్లోకి కేసీఆర్‌ మరింత బలంగా తీసుకెళ్లారు.  

రాజీనామాలే అస్త్రాలుగా ఉద్యమం 
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వ నాన్చివేత ధోరణిని నిరసిస్తూ కేసీఆర్, నరేంద్ర మంత్రి పదవుల నుంచి వైదొలిగారు. 2006లో తన కరీంనగర్‌ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కేసీఆర్‌ అదే ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఉప ఎన్నికలో మరోమారు భారీ మెజారిటీతో గెలుపొందారు. 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని మహా కూటమితో పొత్తు కుదుర్చుకున్న టీఆర్‌ఎస్‌ రెండు లోక్‌సభ స్థానాలతో పాటు, పది అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. 2009 సెప్టెంబర్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణంతో ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని రాష్ట్ర సాధనకు ఎత్తుగడగా మలచగలిగారు.

2009 అక్టోబర్‌ 21న సిద్దిపేటలో జరిగిన ఉద్యోగ గర్జన ద్వారా మరోమారు తెలంగాణ ఉద్యమ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. 2009 నవంబర్‌ 29న సిద్దిపేటలో కేసీఆర్‌ నిర్వహించ తలపెట్టిన ఆమరణ దీక్ష ఉద్యమాన్ని కొత్త మలుపు తిప్పింది. ఈ సందర్భంగా కేసీఆర్‌ను అరెస్టు చేసి తొలుత ఖమ్మం జైలుకు, ఆ తర్వాత హైదరాబాద్‌ నిమ్స్‌కు తరలించడం ఉద్యమ ఘట్టంలో అత్యంత కీలకంగా మారింది. తెలంగాణ ఏర్పాటుపై చేసిన ప్రకటనను కేంద్రం వెనక్కి తీసుకోవడంతో జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఏర్పాటులో కేసీఆర్‌ క్రియాశీలంగా వ్యవహరించారు. 2010 డిసెంబర్‌లో వరంగల్‌లో 30 లక్షల మందితో టీఆర్‌ఎస్‌ మహాగర్జన నిర్వహించగా, శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత 2011 జనవరి నుంచి టీఆర్‌ఎస్‌ నిర్విరామంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. 

ఉద్యమ ఫలితంగా తెలంగాణ ఆవిర్భావం 
సుదీర్ఘకాలంపాటు సాగిన ఉద్యమం ఫలితంగా 2013 అక్టోబర్‌లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ పార్లమెంటు బిల్లును ఆమోదించింది. 2014 జూన్‌ 2 నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా మనుగడలోకి వచ్చింది. అంతకు ముందే 2014 ఏప్రిల్‌లో జరిగిన సాధారణ ఎన్నికల ఫలితాలు అదే ఏడాది మే 16న వెలువడ్డాయి. కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ 119 అసెంబ్లీ స్థానాలకు గాను 63 చోట్ల విజయం సాధించింది. 2014 జూన్‌ 2న కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణలో తొలి ప్రభుత్వం ఏర్పాటైంది. తర్వాతి కాలంలో 12 మంది టీడీపీ సభ్యులు టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆ పార్టీ శాసన సభా పక్షం టీఆర్‌ఎస్‌లో విలీనమైంది. 

రెండోసారి టీఆర్‌ఎస్‌కు అధికార పగ్గాలు 
శాసనసభ ఐదేళ్ల కాల వ్యవధి పూర్తికాకమునుపే 2018 సెప్టెంబర్‌ 6న శాసనసభను రద్దు చేయడంతో అదే ఏడాది నవంబర్‌లో ముందస్తు ఎన్నికలు జరిగాయి. 119 స్థానాలను గాను 89 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందడంతో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వరుసగా రెండో పర్యాయం 2018 డిసెంబర్‌ 13న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్, టీడీపీ శాసన సభ్యులు టీఆర్‌ఎస్‌లో చేరడంతో రెండు పార్టీల శాసన సభా పక్షాలు అధికార పార్టీలో విలీనం అయ్యాయి. 2019 ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 9 స్థానాల్లో గెలిచి మిశ్రమ ఫలితాన్ని చవిచూసింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో నూరు శాతం విజయాన్ని సాధించిన టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ ఎన్నికల్లోనూ హవా కొనసాగించింది. 2020లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో స్వల్ప ఓట్ల తేడాతో సిట్టింగ్‌ స్థానాన్ని కోల్పోగా, బీజేపీ విజయం సాధించింది. గత డిసెంబర్‌లో జరిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ మిశ్రమ ఫలితాన్ని చవిచూసిన టీఆర్‌ఎస్‌ రాజకీయంగా ఒడిదుడుకులకు లోనైంది. ఈ ఏడాది మార్చిలో జరిగిన శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల్లో రెండు స్థానాల్లోనూ గెలుపొందిన టీఆర్‌ఎస్‌ తిరిగి ఆత్మ విశ్వాసంతో ప్రస్థానం సాగిస్తోంది.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top