
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కేసీఆర్ పాలనను గత ఆరేళ్లుగా ప్రజలు చూస్తున్నారని, ఆయన మాటలు చెప్పడం తప్ప ప్రజలకు ఏమీ చేయరని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ పాలన పట్ల ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారని, రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓట్ల కోసం ఎలా వస్తారని ఆ పార్టీ నేతలను ఓటర్లు నిలదీయాలని కోరారు. శుక్రవారం గాంధీభవన్‌లో గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని డివిజన్ల నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. రానున్న గ్రేటర్ ఎన్నికలను కాంగ్రెస్ కేడర్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కోరారు. ఈ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. ఈ నెల 18వ తేదీ లోపు అన్ని డివిజన్ కమిటీలు, బ్లాక్ కమిటీలను పూర్తి చేయాలని, ఆయా జాబితాలను సిటీ, జిల్లా అధ్యక్షులకు అందజేయాలని సూచించారు. రిజర్వేషన్లను బట్టి మేయర్ అభ్యర్థిని కూడా త్వరలోనే ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.